పొగాకుతో ప్రాణాలకు ముప్పు: డీఎంహెచ్‌వో
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:30 AM
పొగాకును ఏ రూపంలో తీసుకున్న నష్టమేనని పొగాకు వాడటంతో ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని కర్నూలు డీఎంహెచ్‌వో డాక్టర్ పి.శాంతికళ హెచ్చరించారు.
కర్నూలు హాస్పిటల్, మే 31 (ఆంధ్రజ్యోతి): పొగాకును ఏ రూపంలో తీసుకున్న నష్టమేనని పొగాకు వాడటంతో ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని కర్నూలు డీఎంహెచ్‌వో డాక్టర్ పి.శాంతికళ హెచ్చరించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకకుని శనివారం జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని డీఎంహెచ్‌వో ప్రారంభించారు. కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ పొగ తాగడం వల్ల, నోటి దుర్వాసన, గొంతు వ్యాధులు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, దగ్గు, ఆయాసం, రక్తపోటు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. బస్టాండు, రైల్వేస్టేషన్, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజలు రద్డీగా ఉండే ప్రాంతాల్లో పొగ తాగడం నిషేధమని, విద్యాసంస్థల పరిసరాల్లో వందగజాలలోపు పొగాకు ఉత్పత్తులను విక్రయించడం నిషేధమని తెలిపారు. అనంతరం ఆశా కార్యకర్తలతో డీఎంహెచ్‌వో ప్రతిజ్ఞ చేయించారు. ఎన్‌సీడీ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ శైలేష్ కుమార్, డీఐవో డాక్టర్ నాగప్రసాద్, సంచార చికిత్స కార్యక్రమ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రఘు, డీపీఎంవో డాక్టర్ ఉమా, డీపీవో విజయరాజు, డెమో శ్రీనివాసులశెట్టి, డిప్యూటీ డెమో చంద్రశేఖర్ రెడ్డి, ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్, ప్రొజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు.