పొగాకు రైతుకు తిప్పలు
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:50 PM
ఓర్వకల్లులో పొగాకు బేడ్లను విక్రయించేందుకు రైతులకు తిప్పలు ఎదురయ్యాయి. పొగాకు విక్రయించేందుకు గోడౌన్లు, రహదారులపై రైతులు జాగారణ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

రాత్రింబవళ్లు జాగరణ
ఓర్వకల్లు మార్చి 11(ఆంధ్రజ్యోతి): ఓర్వకల్లులో పొగాకు బేడ్లను విక్రయించేందుకు రైతులకు తిప్పలు ఎదురయ్యాయి. పొగాకు విక్రయించేందుకు గోడౌన్లు, రహదారులపై రైతులు జాగారణ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మంగళవారం పొగాకు విక్రయించేందుకు భారీ వాహనాలు నిలిచిపోయాయి. ఓర్వకల్లు మండలంలో వీఎస్‌టీ, ఐటీసీ బొంబిడాళ్ల, డెక్కల్, రిలయన్స్ కంపెనీలు పొగాకును కొనుగోలు చేస్తున్నారు. పొగాకు బేడ్లను విక్రయించేందుకు నంద్యాల, కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రంలోని రాయచూరు తదితర రైతులు పొగాకు విక్రయించేందుకు ఓర్వకల్లుకు వస్తున్నారు. అయితే.. పొగాకు రైతులకు భోజన వసతి, నీటి సౌకర్యం కల్పించాల్సి ఉండగా.. ఒకే ఒక కంపెనీ జీపీఐ మాత్రమే రైతులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. మిగతా ఆరు కంపెనీలు రైతులను పట్టించుకునే దాఖలాలే కరువయ్యాయి. పొగాకు నాటే ముందు ప్రతి రైతు పొగాకును కొంటామని వాగ్దానం చేసిన కంపెనీలు నేడు తడి ఉందని పొగాకు వెనక్కు పంపడంతో రాను పోను రవాణా చార్జీల భారం పెరుగుతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పొగాకు క్వింటం రూ.16వేలకు కొనుగోలు చేయాలని ఆయా కంపెనీలను రైతులు కోరారు. విక్రయించేందుకు వచ్చే రైతులకు కంపెనీ యజమాన్యం భోజనం, మంచి నీటి సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు.