చెంచుల చెంతకు..
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:02 AM
నల్లమల అటవీ అంచుల్లోని చిట్టచివరి మారుమూల గ్రామం. చెంచు గిరిజనులతో సహా వెనుకబడిన తరగతులకు చెందిన పలు వర్గాలు ఇక్కడ జీవనం సాగిస్తుంటాయి. ఈ గ్రామంలో చాలా మందికి విద్య ప్రాముఖ్యత తెలిసేది కాదు.
వంద శాతం జీఈఆర్‌తో అరుదైన ఘనత
పీఎం జన్‌మన్ కింద గ్రామానికి మంజూరైన వసతిగృహం
హెచ్‌ఎం చొరవతో విద్యార్థుల బడిబాట
ఆదర్శంగా నిలుస్తున్న ఎంపీపీ పాఠశాల
విద్యార్థులందరికీ ‘తల్లికి వందనం’
చివరి దశలో ఆదివాసీ విద్యాలయ నిర్మాణ పనులు
నల్లమల అటవీ అంచుల్లోని చిట్టచివరి మారుమూల గ్రామం. చెంచు గిరిజనులతో సహా వెనుకబడిన తరగతులకు చెందిన పలు వర్గాలు ఇక్కడ జీవనం సాగిస్తుంటాయి. ఈ గ్రామంలో చాలా మందికి విద్య ప్రాముఖ్యత తెలిసేది కాదు. అందుకే తమ పిల్లలను సరిగ్గా బడికి పంపించకపోవడంతో పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా ఉండేది. గ్రామంలో బడికి వెళ్లే పిల్లల సంఖ్యతో పోల్చితే బడికి వెళ్లని వారే ఎక్కువ. ఇదంతా ఒకప్పటి మాట.. ప్రస్తుతం ఎంపీపీ పాఠశాల హెచ్‌ఎం వెంకటేశ్వర్లు చొరవతో గ్రామంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పిల్లలందరూ బడిబాట పట్టారు. ఎవరైనా బడికి రాకపోతే మాత్రం హెచ్‌ఎం ఊరురుకోరు. పిల్లలు బడికి ఎందుకు రాలేదో ఆరా తీసి ఎక్కడున్నారో గుర్తించేవారు. అవసరమైతే అడవుల్లో సైతం వెతికి పిల్లలను బడికి పిలుచుకొస్తారు. దీంతో ఈయనంటే విద్యార్థులకు గౌరవంతో కూడిన భయం ఏర్పడింది. ఇంతటి నిరంతర కృషితో నేడు కొట్టాలచెరువు ఎంపీపీ పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది.
ఆత్మకూరు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): నల్లమల అడవిలోని చిట్టచివరి గ్రామం కొట్టాలచెరువు. ఒకప్పుడు విద్యకు దూరంగా ఉండేది. ప్రస్తుతం పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. ఆ గ్రామంలోని ఎం పీపీ పాఠశాల హెచ్‌ఎం వెంకటేశ్వర్లు చొరవతో గిరిజన పుత్రులు సరస్వతీ కుమారులుగా మారారు. పిల్లలందరూ బడిబాట పట్టారంటే మామూలు విషయం కాదు. వందశాతం జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్‌మెంట్ రేషియో) సాధించి జిల్లాలోనే అరుదైన పాఠశాలగా ఆత్మకూరు మండలంలోని కొట్టాలచెరువు ఎంపీపీ పాఠశాల ఆదర్శంగా నిలిచింది.
విద్యార్థులకు కళకళలాడుతోంది
ఇక్కడ చాలా మంది గిరిజన కుటుంబాలకు చెందిన పిల్లలు ఉంటారు. వీరిలో కొందరు తల్లిదండ్రులతో కలిసి అడవిబాట పడుతుంటారు. అకారణంగా విద్యార్థులు బడికి రాకపోతే మాత్రం ప్రధానోపాఽధ్యాయులు ఊరుకునే ప్రసక్తే ఉండదు. పిల్లలు బడికి ఎందుకు రాలేదో ఆరా తీసి ఎక్కడున్నారో గుర్తించేవారు. అవసరమైతే అడవుల్లో సైతం వెతికి పిల్లలను బడికి పిలుచుకొస్తారు. దీంతో ఈయనంటే విద్యార్థులకు గౌరవంతో కూడిన భయం ఉండటంతో చాలామంది విద్యార్థులు ప్రతిరోజు యూనిఫామ్ ధరించి పాఠశాలకు శ్రద్ద వస్తుంటారు. దీంతో పిల్లలెవరూ.. బడికి వెళ్లకూడదన్న ఆలోచనే లేకుండా ఉండటంతో పాఠశాల విద్యార్థులతో కళకళలాడుతోంది. కాగా ఒకప్పుడు చాలామంది విద్యార్థులు ఆధార్ నమోదు కూడా లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కూడా సరిగ్గా అందేవి కావు. ప్రస్తుతం విద్యార్థులందరికి ఆధార్ నమోదు ఉండటంతో ఇటీవల అందరికి ‘తల్లికి వందనం’ కింద విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.13000 చొప్పున నగదు జమైంది.
ఐదేళ్ల క్రితం 27 మంది విద్యార్థులే..
కొట్టాలచెరువు గ్రామంలో సుమారు 1200 వరకు జనాభా ఉంది. గ్రామంలోని ఎంపీపీ పాఠశాలకు ఐదేళ్ల క్రితం 27మంది విద్యార్థులు మాత్రమే వచ్చేవారు. అందువల్ల పలు టీచర్ పోస్టులు కూడా రద్దయ్యాయి. గదులు కూడా రెండు మాత్రమే ఉన్నాయి. ఎవరూ ఊహించని విధంగా ఈపాఠశాలలో 117 మంది విద్యార్థులు ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో 93 మంది గిరిజన విద్యార్థులే ఉన్నారు. ప్రతిరోజు విద్యార్థుల హాజరు శాతం కూడా 95శాతం వరకు ఉండటం గమనార్హం. విద్యార్థులు అధికమవ్వడంతో ప్రస్తుతం ఉన్న రెండు తరగతి గదులు చాలక హెచ్‌ఎం వెంకటేశ్వర్లు తన సొంత ఖర్చులతో పాటు గ్రామస్థుల సహకారంతో అదనంగా పాఠశాల ప్రాంగణంలో ఒక గుడిసెను నిర్మించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. రూ.10లక్షల నాడు-నేడు నిధులతో విద్యార్థులకు అవసరమయ్యే ఫర్నిచర్‌ను, ఇతర సదుపాయాలను కూడా అందుబాటులో ఉంచారు. ఇక్కడ ముగ్గురు రెగ్యులర్ ఉపాధ్యాయులు మాత్రమే ఉండగా ఆర్డీటీ సహకారంతో ఒకరు, హెచ్‌ఎం సహకారంతో మరో వాలంటరీ టీచర్ల సహకారాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ విధంగా గ్రామంలోని పిల్లలందరూ ఎంపీపీ పాఠశాలలకు వెళ్తుండటంతో 100శాతం జీఈఆర్ నమోదు నమోదైంది.
నాణ్యమైన విద్య
ఈ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నీతికథలు, ఆటలు, కళలు, అల్లికలు, రంగోలీ, క్విజ్ వంటి పోటీల్లో ప్రావీణ్యత కల్పిస్తున్నారు. ఇటీవల అంతర జిల్లా స్థాయిలో గిరిజన విద్యార్థులకు జరిగిన వివిధపోటీల్లో ఈ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్య ఊహించని రీతిలో పెరగడంతో పీఎం జన్‌మన్‌లో భాగంగా ఈ గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదివాసీ విద్యాలయాన్ని మంజూరు చేశారు.
రూ. .2.3కోట్లతో ఆదివాసీ విద్యాలయం.
గిరిజనులకు మంచి విద్యను అందిస్తే వారి జీవన ప్రమాణాలను మెరుపర్చువచ్చునన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏడు పీఎం జనమన్ హాస్టళ్లను మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లాకు 2, మిగిలిన 5 నంద్యాల జిల్లాకు మంజూరయ్యాయి. ఇందులో భాగంగనే కొట్టాలచెరువు గ్రామంలో రూ.2.3కోట్లతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదివాసీ విద్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ వసతిగృహంలో ఒక్కొ గదికి కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే ఉండేలా 50 మంది సామర్థ్యం గల గదులను నిర్మిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య మరింత పెరిగితే మొదటి అంతస్తులో మరిన్ని గదులను నిర్మించాలని భావిస్తున్నారు. మొత్తానికి కొట్టాలచెరువు ప్రాథమిక పాఠశాలలో అనూహ్యంగా విద్యార్థుల సంఖ్య పెరగడం వల్లే ఈ వసతిగృహం మంజూరైనట్లు తెలిసింది. ఈ నిర్మాణ పనులను 2024 అక్టోబరు 5న కలెక్టర్ రాజకుమారితో కలిసి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు చివరి దశగా చేరుకున్నాయి.
ఆనందంగా ఉంది
ఒకప్పుడు విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి.. టీచర్ పోస్టులను సైతం కోల్పోయిన కొట్టాలచెరువు ప్రాథమిక పాఠశాలలో నేడు వంద శాతం జీఈఆర్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించడంతో వారిలో కూడా క్రమశిక్షణ పెరిగి శ్రద్దగా పాఠశాలకు వస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో గదుల కొరత ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
-వెంకటేశ్వర్లు, హెచ్‌ఎం, ప్రాథమిక పాఠశాల,కొట్టాలచెరువు, ఆత్మకూరు