Share News

టిడ్కో ఇల్లు.. తీరని కల..!

ABN , Publish Date - Jun 24 , 2025 | 11:17 PM

2025 జూన్‌ 12 నాటికి రాష్ట్రంలో 1.18 లక్షల ఏపీ టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం.. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయిస్తాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 44వ సీఆర్డీఏ సమావేశంలో ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం.

టిడ్కో ఇల్లు.. తీరని కల..!
కర్నూలు నగరం జగనాథగట్టులో నిర్మించిన ఏపీ టిడ్కో ఇళ్లు

ఉమ్మడి జిల్లాలో సిద్ధంగా 23,645 ఇళ్లు

ఏడాదైనా పంపిణీ చేయని కూటమి ప్రభుత్వం

వైసీపీ హయాంలో ఐదేళ్లు నిర్లక్ష్యం.. శిథిలావస్థకు చేరుతున్న గృహాలు

పేదల ఆశలు అడియాశలేనా..?

2025 జూన్‌ 12 నాటికి రాష్ట్రంలో 1.18 లక్షల ఏపీ టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం.. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయిస్తాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 44వ సీఆర్డీఏ సమావేశంలో ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం.

- 2024 డిసెంబరు 24న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ

కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాదైన సందర్భంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సాధించిన విజయాలు చెప్పుకొని.. రాబోయే నాలుగేళ్లలో చేపట్టబోయే సంక్షేమం, అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేయడం అభినందించాల్సిన విషయమే. అయితే.. వైసీపీ హయాంలో ఐదేళ్లు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ఏపీ టిడ్కో ఇళ్లపై దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తున్నది. కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో టిడ్కో ఇళ్లకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించలేదు. ఇలాంటి ఇళ్లలోకి వెళ్లడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పంపకానికి సిద్ధంగా ఉన్న 23,645 ఇళ్లు నిరుపయోగంగా మారాయి. ఇల్లు ఎక్కడుందో చూపకపోయినా నెల కంతులు కట్టాలంటూ బ్యాంకులు నోటీసులు పంపుతున్నాయి. టిడ్కో ఇళ్ల దుస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.

కర్నూలు, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన తరువాత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టణ పేదలకు నివాస సౌకర్యం కల్పించాలనే సంకల్పంతో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-ఎన్టీఆర్‌ ఇళ్లు పథకంలో భాగంగా ఫేజ్‌-1 కింద కర్నూలు నగరం, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల పట్టణాలు ఎంపిక చేశారు. రూ.1,650 కోట్లతో 27,968 ఇళ్లు మంజూరు చేశారు. ఇటుకలు, పిల్లర్లు లేకుండా షేర్‌వాల్‌ సాంకేతిక పరిజ్ఙానంతో జీ+3 ఇళ్ల సముదాయ నిర్మాణాలను మహారాష్ట్రకు చెందిన షాపూర్జీ, పల్లన్‌జీ సంస్థ దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీ టిడ్కో) పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టారు. కర్నూలు నగరం శివారున బైపాస్‌ రోడ్డు పక్కనే 170 ఎకరాలు కేటాయించారు. 10 వేల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఎమ్మిగనూరులో శివన్న నగర్‌, మైనార్టీ కాలనీల్లో, ఆదోని శివారున సిరుగుప్ప రోడ్డు సమీపంలో, నంద్యాలలో ఎస్‌ఆర్‌బీసీ కాలనీలో చేపట్టిన తొలి విడతలో 18,976 ఇళ్లు మంజూరు చేస్తే 17,992 ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టారు. ఫేజ్‌-2 కింద రూ.200 కోట్లతో 3,500 ఇళ్లు, ఫేజ్‌-3 కింద రూ.350 కోట్లతో 5 వేలు, ఫేజ్‌-4 కింద రూ.930 కోట్లతో 19 వేలు.. నాలుగు విడతల్లో 55,468 టిడ్కో ఇళ్లు మంజూరు చేసి రూ.3,130 కోట్లు కేటాయించారు. 2019 మేలో జగన్‌ సారథ్యంలో వైసీపీ ప్రభుత్వం రాగానే నిర్మాణాలు మొదలు పెట్టని ఇళ్లను రద్దు చేశారు. పూర్తయిన ఇళ్లకు మౌలిక వసతులు కల్పించి ఇవ్వలేదు.

కూటమి వచ్చాక కూడా అదే పరిస్థితి

కర్నూలులో 8,829 ఇళ్లు పూర్తి చేశారు. 2,064 ఇళ్ల తాళాలు లబ్ధిదారులకు అప్పగించారు. ఐదారు కుటుంబాలు మినహా ఒక్కరూ ఇళ్లలో చేరలేదు. ఆదోనిలో 4,720 ఇళ్లు మొదలు పెడితే 3,494 ఇళ్లు పూర్తి చేసి 1,632 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించారు. ఎమ్మిగనూరులో 4,272 ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేసి 1,920 ఇళ్లు, నంద్యాలలో 10 వేల ఇళ్లు మంజూరు అయితే 9 వేల ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టారు. 5,370 ఇళ్లు నిర్మాణాలు పూర్తి చేసి 2,096 మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అప్పగించారు. అయితే.. తాగునీరు, విద్యుత్‌, రోడ్లు, పాఠశాల, వైద్యశాల, రవాణా సౌకర్యం వంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇచ్చిన ఇళ్లలో చేరడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లు కూడా పంపిణీకి నోచుకోలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. ఆరు నెలలు లేదంటే ఏడాదిలోగా టిడ్కో ఇళ్లలో గృహ ప్రవేశాలు చేస్తామని ఆశించారు. అయితే.. కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి విజయోత్సవ సంబరాలు చేసుకున్నారే తప్ప పేదలకు టిడ్కో ఇళ్లు ఇవ్వలేదు. అసంపూర్తి ఇళ్లు, మౌలిక వసతులపై దృష్టి పెట్టకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

రూ.180.02 కోట్లు ఇస్తే..!

కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్‌ పట్టణాల్లో అసంపూర్తి ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతల కల్పన కోసం పెండింగ్‌ బిల్లుల చెల్లింపు, పెండింగ్‌ పనులు పూర్తి చేయాలంటే దాదాపు రూ.180.02 కోట్లు నిధులు కావాలని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. కర్నూలు జిల్లాలో పెండింగ్‌ బిల్లులు రూ.1.97 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.19.45 కోట్లు చెల్లించాల్సి ఉంది. అసంపూర్తి పనుల కోసం కర్నూలు జిల్లాలో ఇళ్లకు రూ.61.78 కోట్లు, మౌలిక వసతులకు రూ.5.16 కోట్లు కలిపి రూ.66.94 కోట్లు కావాలి. నంద్యాల జిల్లాలో ఇళ్లకు రూ.61.25 కోట్లు, మౌలిక వసతులకు రూ.30.42 కోట్లు కలిపి రూ.62.25 కోట్లు అవసరం. బకాయిలు చెల్లిస్తేగాని పనులు చేయలేమని కాంట్రాక్ట్‌ సంస్థలు చేతులెత్తేశాయి.

నెల కంతులు కట్టమని నోటీసులు

టిడ్కో ఇళ్లు మూడు కేటగిరీల్లో నిర్మించి లబ్ధిదారుల వాటా కింద డిపాజిట్‌ తీసుకున్నారు. ఏ కేటగిరీ కింద 300 చదరపు అడుగుల ఇంటికి రూ.500, బీ కేటగిరీ కింద 400 చదరపు అడుగుల ఇంటికి రూ.50 వేలు, సీ కేటగిరీ కింద 430 చదరపు అడుగుల ఇంటికి రూ.లక్ష చొప్పున నాలుగు కంతుల్లో సేకరించిన డిపాజిట్‌ మొత్తాన్ని ఏపీ టిడ్కో బ్యాంక్‌ ఖాతాలో జమ చేశారు. వివిధ బ్యాంకులు లబ్ధిదారుల పేరిట రుణాలు మంజూరు చేశాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ కేటగిరీ ఇళ్లను పూర్తిగా ఉచితంగా ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. మిగిలిన రెండు కేటగిరీల ఇళ్ల లబ్ధిదారులు రూ.3,805 చొప్పున నెల కంతులు చెల్లించాల్సి ఉంది. నగర పాలక సంస్థ, మున్సిపాలిటీ రికార్డులు ప్రకారం కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరులో 5.616 ఇళ్లు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్‌లో 3,488 ఇళ్లు పేదలకు అప్పగించినట్లు చూపించారు. దీంతో నెల కంతులు కట్టాలని బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లే చూపలేదు.. నెల కంతులెలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పాలక పెద్దలు స్పందించి అర్హులైన లబ్ధిదారులకు టిడ్కో పంపిణీ చేయాలని, అక్కడే నివాసం ఉండేలా తాగునీరు, విద్యుత్‌, రోడ్లు వంటి సౌకర్యాలతో పాటు పాఠశాల, ఆస్పత్రి, రవాణా, అంగన్‌వాడి కేంద్రాలు, షాపింగ్‌ వంటి సౌకర్యాలు సమకూర్చాలని కోరుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో టీడీపీ ఇళ్ల పురోగతి వివరాలు

నగరం/పట్టణం ఒప్పందం మొదలు పూర్తైన లబ్ధిదారులకు

చేసిన ఇళ్లు పెట్టినవి ఇళ్లు పంపిణీ చేసినవి

కర్నూలు నగరం 10,000 10,000 8,829 2,064

ఆదోని 4,704 4,720 3,494 1,632

ఎమ్మినూరు 4,272 4,272 4,272 1,920

నంద్యాల పట్టణం 10,000 9,000 5,370 2,096

డోన్‌ 306 288 288 --

ఆళ్లగడ్డ 2,304 1,392 1,392 1,392

మొత్తం 31,586 29,672 23,645 7,008

ప్రతిపాదనలు పంపించాం

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పెండింగ్‌ బిల్లులు, బ్యాలెన్స్‌ పనులకు దాదాపు రూ.180 కోట్లు అవసరం. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. కర్నూలు జిల్లాలో మౌలిక వసతుల కోసం బకాయి బిల్లులు, బ్యాలెన్స్‌ పనులకు రూ.66.94 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.91.67 కోట్లు కావాలి. బకాయి బిల్లులు చెల్లించగానే పనులు చేపడుతామని కాంట్రాక్టర్లు అంటున్నారు. నిధులు రాగానే పనులు పూర్తి చేస్తాం.

- నాగమోహన్‌, ఎస్‌ఈ, ఏపీ టిడ్కో, కర్నూలు

Updated Date - Jun 24 , 2025 | 11:17 PM