అత్యాధునిక టెక్నాలజీతో టిడ్కో గృహాలు
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:01 AM
అత్యాఽధునిక టెక్నాలజీతో టిడ్కో గృహాలను నిర్మిస్తున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు.
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ
కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): అత్యాఽధునిక టెక్నాలజీతో టిడ్కో గృహాలను నిర్మిస్తున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. నగర శివారులోని టిడ్కో గృహాలను పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, కలెక్టర్ పి.రంజిత్‌బాషా, జేసీ బి.నవ్య, నగర పాలక కమిషనర్ పి.విశ్వనాథ్, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరితో కలిసి శనివారం పరిశీలించారు. ముందుగా టిడ్కో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ సింగపూర్, మలేసియా, జపాన్, చైనా, రష్యా తదితర అభివృద్ధి చెందిన దేశాలలో షేర్ వాల్ టెక్నాలజీతో గృహాలు నిర్మిస్తారని, అదే టెక్నాలజీని వినియోగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. సౌకర్యవంతమైన రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, కమ్యూనిటీ హాల్స్, పాఠశాల తదతర కనీస సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లాలో రెండు నెలల్లో మరికొన్ని చోట్ల అన్న క్యాంటీన్‌లను ప్రారంభిస్తామన్నారు. టిడ్కో సముదాయాల్లో ఉన్న కంపచెట్లను త్వరితగతిన తొలగించాలని అధికారులను ఆదేశించారు. డిసెంబరుకల్లా 3,056 గృహాలను పూర్తి చేస్తామని, మిగతా 3,826 గృహాలు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధుల కోరిక మేరకు టిడ్కో గృహ సముదాయానికి ఒక పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేస్తామని, అది కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా త్వరలో వస్తుందన్నారు. మరిన్ని మౌలిక వసతులకు రూ.5 కోట్లు మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. మంత్రి టీజీ భరత్ కోరిక మేరకు ఇక్కడే పది ఎకరాల స్థలాన్ని ఎంఎస్‌ఎంఈ కింద పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ఇస్తున్నామన్నారు. నగరంలో ఆక్రమణలకు గురైన పార్కు స్థలాలను కమిషనర్ ద్వారా విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
ఎంఎస్‌ఎంఈ కింద ఉద్యోగావకాశాలు: మంత్రి భరత్
ఎంఎస్‌ఎంఈ కింద యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. పరిశ్రమ ఏర్పాటు వల్ల కాలనీలో ఉండే వెయ్యి కుటుంబాలకు ఉపాది లభిస్తుందన్నారు. గృహ సముదాయంలో ఉన్న జంగిల్ క్లియరెన్సు ఆదివారం సాయంత్రానికి కల్లా పూర్తి చేసి వాటికి సంబంధించి ఫోటోల మంత్రి నారాయణకు పంపాలని ఆదేశించారు. త్వరలోనే కాంట్రాక్టర్లకు రూ.6 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం టిడ్కో గృహాలను పట్టించుకోలేదని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లబ్ధిదారులకు ఇళ్లు అందజేయాలనే ఉద్దేశ్యంతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా మంత్రి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతోముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టిడ్కో అధికారులు, ‘కుడా’ అధికారులు పాల్గొన్నారు.