హత్య కేసులో ముగ్గురి అరెస్టు
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:17 AM
: ఒకటవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బంగారు వ్యాపారి షేక్ ఇజహర్ అహ్మద్ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ బాబుప్రసాద్ తెలిపారు.
పరారీలో మరో ఇద్దరు..
మూడు కత్తులు, బైక్ స్వాధీనం
కర్నూలు క్రైం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఒకటవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బంగారు వ్యాపారి షేక్ ఇజహర్ అహ్మద్ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ బాబుప్రసాద్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన సీఐ పార్థసారఽథితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. రాధాకృష్ణ థియేటర్ సమీపంలో ఈనెల 1వ తేదీన సాయంత్రం 7గంటలకు ఇజహర్ అహ్మద్ తన తండ్రి నిసార్ అహ్మద్‌తో కలిసి నమాజుకు వెళ్లాడు. మసీదు నుంచి బయటకు రాగానే వన్‌టౌన్ గనిగల్లీకి చెందిన ఇమ్రాన్, ఇర్ఫాన్, షేక్ జాహీన్ అహ్మద్ ఆలియాస్ జహంగీర్, ఎస్‌ఎండీ ఇర్ఫాజ్, యూసుఫ్‌తో కలిసి దాడి చేశారు. పాత గొడవలు, మనస్పర్థలు ఏర్పడటంతోనే ఇజహర్ అహ్మద్‌ను హత్య చేయాలనే పథకంలో భాగంగా దాడిచేసి కత్తులతో గాయపరిచారు. ఇజహార్‌ను కర్నూలు ప్రభుత్వ ఆసు పత్రికి తరలించగా అదే రోజు రాత్రి 8 గంటలకు మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇమ్రాన్, ఇర్ఫాన్, షేక్ జాహీన్ అహ్మద్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామన్నారు. నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన మూడు కత్తులను, బైక్‌ను స్వాధీనం చేసుకొని, నిందితులను రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో పీసీఆర్ సీఐ శివశంకర్, వన్‌టౌన్ ఎస్‌ఐ తిమ్మారెడ్డి, సిబ్బంది ఉన్నారు.