Share News

దొంగల ముఠాకు మూడేళ్ల జైలు

ABN , Publish Date - Apr 30 , 2025 | 12:17 AM

ఫిబ్రవరి 24.. అర్ధరాత్రి 1.45 గంటల సమయం. గుర్తుతెలియని వ్యక్తులు జాతీయ రహదారి పక్కనే ఏటీఎం మిషన్‌ను దొంగలించి తీసుకెళ్తుండగా స్థానికులకు అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దొంగల ముఠాకు మూడేళ్ల జైలు
శిక్ష పడిన హర్యాణా గ్యాంగ్‌ను జైలుకు తరలిస్తున్న పోలీసులు

రెండు నెలల్లో శిక్ష పడేలా చేసిన తాలుకా పోలీసులు

అభినందించిన ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఫిబ్రవరి 24.. అర్ధరాత్రి 1.45 గంటల సమయం. గుర్తుతెలియని వ్యక్తులు జాతీయ రహదారి పక్కనే ఏటీఎం మిషన్‌ను దొంగలించి తీసుకెళ్తుండగా స్థానికులకు అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీస్‌ వాహనం సైరన్‌ వినగానే దొంగల ముఠా ఏటీఎం యంత్రాన్ని వదిలేసి చీకట్లో పారిపోయారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆధారాలతో అంతర్రాష్ట్ర హరియాణా రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేయడమే కాకుండా పక్కా ఆధారాలతో కేసును న్యాయస్థానంలో రుజువుచేసి శిక్ష పడేలా చేసిన కర్నూలు తాలుకా సర్కిల్‌, ఉల్లిందకొండ పోలీస్‌స్టేషన్‌ పోలీసులను ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అభినందించారు. శభాష్‌ పోలీస్‌ అనిపించారు. ఎస్పీ ఇచ్చిన సమాచారం మేరకు.. కర్నూలు నగర శివార్లలోని కల్లూరు మండలం ఉల్లిందకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చిన్నటేకూరు వద్ద కర్నూలు జాతీయ రహదారి-44 సర్వీస్‌ రోడ్డు పక్కనే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఏటీఎం కేంద్రం ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 24న అర్ధరాత్రి 1:45 గంటల సమయంలో గుర్తుతెలియని దుండగులు ఏటీఎం యంత్రాన్ని పెకలించి తాళ్లతో కట్టి హైవేపైకి లాక్కెళ్లుతున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకోబోతుండగా.. వారి వాహనం సైరన్‌ శబ్దం విన్న దొంగల ముఠా ఏటీఎంను వదిలేసి చీకట్లో పరారయ్యారు. పోలీసులు వెతికినా ఫలితం లేదు. ఉల్లిందకొండ పోలీస్‌ స్టేషన్‌లో దోపిడీ కేసు నమోదు చేశారు. అది అంతర్రాష్ట్ర ముఠా పనేనని గుర్తించిన ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌, కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్‌, కర్నూలు తాలూకా సీఐ చంద్రబాబునాయుడు, ఉలిందకొండ ఎస్సై ధనుంజయ ఆఽధ్వర్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటుచేశారు. ఏటీఎం మిషన్‌ను దొంగలించడానికి టోయింగ్‌ వాహనాన్ని దొంగలించినట్లు గుర్తించారు. సీసీ పుటేజీలను సేకరించారు. నేషనల్‌ హైవే పొడవునా టోల్‌పాజా వద్ద ఉన్న సీసీ కెమెరాలను క్షుణంగా పరిశీలించారు. హరియాణాకు చెందిన ఓ ముఠా.. కంటైనర్‌ డ్రైవర్‌గా హరియాణా నుంచి బెంగళూరుకు కంటైనర్‌లో కార్లు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అదే కంటైనర్‌లో మారుతి సుజికీ కార్లను 23వ తేదీ కర్నూలుకు తీసుకొచ్చి అన్‌లోడ్‌ చేశారు. అదేరోజు తిరిగి వెళ్లకుండా నేషనల్‌ హైవే పక్కన ఉన్న ఏటీ ఎంలపై నిఘా పెట్టారు. రెక్కీ నిర్వహించాక.. 24న అర్ధరాత్రి 11.30 గంటలకు ఏటీఎం మిషన్‌ను పెకలించే పనులు మొదలు పట్టారు. 1.45 గంటలకు ఎట్టకేలకు పెకలించి.. తాళ్లుకట్టి హైవే వైపు తీసుకెళ్తుండగా స్థానికులు గుర్తించడం, వారి సమాచారం అందుకున్న పోలీసులు రావడంతో పారిపోయారు. 5-10 నిమిషాలు ఆలస్యమై ఉంటే కంటేనర్‌లో ఏటీఎంను ఎక్కించుకొని పారిపోయే అవకాశం ఉండేది. సీసీ పుటేజీలు ఆధారంగా పది రోజుల్లో కేసులు ఛేదించారు. హరియాణాకు చెందిన సూన్నీషాహీద్‌ఖాన్‌, సున్నీ ఇమ్రాన్‌ఖాన్‌, మహమ్మద్‌ జంసాద్‌ఖాన్‌, మహమ్మద్‌ షావ్కర్‌ఖాన్‌లే ఈఘటనకు పాల్పడ్డారని పక్కా ఆధారాలు సేకరించారు. మార్చి 6న అరెస్టుచేసి కోర్టులో హాజరు పరచగా న్యాయా ధికారి రిమాండ్‌కు ఆదేశించారు. అంతటితో ఆగకుండా సాంకేతిక ఆధారాలు సేకరించి దర్యాప్తు నివేదికను కోర్టులో ఉంచారు. స్పెషల్‌ మొబైల్‌ కోర్టు, ఎఫ్‌ఏసీ స్పెషల్‌ జేఎఫ్‌సీఎం (పీఅండ్‌ఈ) కోర్టు విచారణ నేరం రుజువు కావడంతో జుడిషి యల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ న్యాయాధికారి సరోజనమ్మ మూడేళ్లు జైలుశిక్ష, రూ.14 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చారు. ఈ కేసును ఛేదించడమే కాకుండా శిక్షపడేలా చేసిన కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్‌, కర్నూలు తాలూకా సర్కిల్‌ సీఐ చంద్రబాబు నాయుడు, ఉలిందకొండ ఎస్సై ధనుంజయ, కోర్టు కానిస్టేబుళ్లు మహేశ్‌, శేఖర్‌ సహా నిందితులకు శిక్ష పడేలా బలమైన వాదనలు వినిపించిన ఏపీపీ అనిల్‌కుమార్‌ను ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అభినందించారు.

Updated Date - Apr 30 , 2025 | 12:17 AM