ముచ్చటగా ముగ్గురు...!
ABN , Publish Date - May 11 , 2025 | 12:14 AM
నందికొట్కూరు నియోజకవ ర్గంలో రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి.
నందికొట్కూరులో అగ్నిమాక కేంద్రం భవన నిర్మాణానికి భూమిపూజ
వేర్వేరుగా పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్
మరోమారు తేటతెల్లమైన విభేదాలు
నందికొట్కూరు, మే 10 (ఆంధ్రజ్యోతి): నందికొట్కూరు నియోజకవ ర్గంలో రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస అంశంలో ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య వర్గపోరు బహిర్గతమైన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు తాజాగా నంది కొట్కూరులో ఓ భవన నిర్మాణానికి సంబంధించి భూమిపూజ విషయంలో అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. శనివారం పట్టణంలోని బైరెడ్డి నగర్‌లో నియోజకవర్గ అగ్నిమాపక కేంద్ర నూతన భవన నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డిలు వేర్వేరుగా వేర్వేరు సమయాల్లో భూమిపూజ చేయడం హాట్ టాఫిక్‌గా మారింది. ముందుగా ముహూర్తం దాటిపోతుందన్న నెపంతో ఉదయం 9:41 గంటలకు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి వార్డు కౌన్సిలర్ చాంద్‌బాషతో శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గిత్తా జయసూర్య 10:17 గంటలకు చేరుకుని మళ్లీ శంకుస్థాపన చేశారు. ఇక ఎంపీ బైరెడ్డి శబరి 11:02 గంటలకు చేరుకుని ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన చేశారు. ఇదిలా ఉండగా శంకుస్థాపనల తంతు పూర్తి చేసేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. ఒకే పార్టీ నుంచి గెలిచిన వారు ఇలా వేర్వేరుగా పాల్గొనడం కేడర్‌లో గందరగోళానికి దారి తీసింది.