Share News

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

ABN , Publish Date - Aug 16 , 2025 | 12:14 AM

నంద్యాల జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

ఆళ్లగడ్డ సమీపంలో ఢీకొన్న రెండు ప్రైవేటు బస్సులు

27 మంది ప్రయాణికులకు గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

నంద్యాల/ఆళ్లగడ్డ, ఆగస్టు15(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 27 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఆల్ఫా ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా రెండు బస్సుల్లో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. దీంతో వెంటనే తోటి ప్రయాణికులు పోలీసులకు సమాచారమందించడంతో ఆళ్లగడ్డ పోలీసులు అక్కడి చేరుకుని వైద్యచికిత్సల నిమిత్తం ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాదుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

రెండు బస్సుల్లో 49 మంది ప్రయాణికులు

శ్రీకృష్ణ ట్రావెల్స్‌, జగన్‌ ట్రావెల్స్‌కు చెందిన ఈ రెండు బస్సులు నిత్యం తిరుపతి- హైదరాబాదు రూట్‌లో తిరుగుతున్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో గురువారం రాత్రి కూడా ఈ రెండు బస్సులు తిరుపతి నుంచి హైదరాబాదుకు వివిధ ప్రాంతాలకు చెందిన 49 మంది ప్రయాణికులతో బయల్దేరాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఆల్ఫా ఇంజనీరీంగ్‌ కళాశాల వద్దకు శుక్రవారం ఉదయం తెల్లవారు జామున 3.30 గంటలకు రాగానే.. ముందుగా వెళ్తున్న జగన్‌ ట్రావెల్స్‌ బస్సును వెనుకనుంచి వస్త్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సు ఢీకొంది. దీంతో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న 49 మంది ప్రయాణికుల్లో 27మందికి గాయాలు కాగా.. ముగ్గురు ప్రయాణికులకు తీవ్రరక్తస్రావం కావడంతో అక్కడిక్కడే మృతి చెందారు. ప్రయాణికులందరూ నిద్రలో ఉండటంతో ప్రమాదం ఎలా జరిగిగిందో..? కూడా చెప్పలేని పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే బస్సును ఢీకొట్టినట్లు ప్రాథమిక అంచన వేసినట్లు తెలుస్తోంది.

ముగ్గురి మృతి

ఈ ఘటనలో శ్రీకృష్ణ ట్రావెల్‌ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయా ణికుల్లో ఏపీలోని అనకాపల్లి జిల్లా నేతవరం మండలం గునుపుడి గ్రామానికి చెందిన కుసరాజు (25) మృతి చెందారు. ఆయన హైదరా బాదులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో డ్రోన్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. అలాగే జగన్‌ ట్రావెల్‌ బస్సులో ప్రయాణిస్తున్న రాజమండ్రి పట్టణానికి చెందిన వెంకటసాయి(22) మృతి చెందారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ఉంటున్నారు. హైదరాబాదులోని సరూర్‌నగర్‌కు చెందిన అనంత గౌతమ్‌(23) అక్కడికక్కడే మృతి చెందారు. రెండు బస్సుల్లోని 27మంది గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే మృతిచెందిన వారిలో వెంకటసాయి, అనంతగౌతమ్‌ ఇంజి నీరింగ్‌ విద్యను అభ్యసిస్తున్నారని పోలీసులు తెలిపారు. మృతులు ముగ్గురితో పాటు మిగిలిన ప్రయాణికుల్లో కూడా ఎక్కువ శాతం మంది తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని తిరుగు పయనమైనట్లు సమాచారం.

ఇద్దరి పరిస్థితి విషమం

రెండు బస్సుల్లో 27 మందికి గాయాలు కాగా.. వీరిలో హైదరా బాదులోని చందానగర్‌కు చెందిన వృద్ధురాలు బొనగిరి అనంతలక్ష్మి, అదే ప్రాంతానికి చెందిన విజయ కిరణ్‌కు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యచికిత్సల నిమిత్తం నంద్యాల నుంచి హైదరాబాదుకు తరలించారు. మిగిలిన 25 మందికి స్వల్ప గాయలయ్యాయి. ఆయితే ఈ రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిలో అధిక శాతం మంది హైదరాబాదు వాసులే ఉన్నట్లు తెలిసింది.

Updated Date - Aug 16 , 2025 | 12:14 AM