Share News

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:33 AM

కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు ఆదివారం ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాలివీ..

పిడుగుపాటుకు ముగ్గురి మృతి
బాలయ్య (ఫైల్‌)

కౌతాళం/క్రిష్ణగిరి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు ఆదివారం ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాలివీ.. వేసవి సెలవులు కావడంతో కౌతాళం మండలంలోని కాత్రికి గ్రామానికి చెందిన తెలుగు చిన్న వీరేష్‌, పార్వతి దంపతుల కుమారుడు అశోక్‌(21), తలారి వీరేష్‌, మారెమ్మ దంపతుల కుమారుడు బాలయ్య(22)తో పాటు మరో ఎనిమిది బాలురు, యువకులు ఊరి సమీపంలోని పొలాల్లో క్రికెట్‌ ఆడేందుకు వెళ్లారు. అయితే గాలి వానతో పాటు వర్షం ఎక్కువ కావడంతో సమీపంలోని చెట్టు కిందకు చేరుకున్నారు. ఆ సమయంలో పిడుగు పడటంతో అశోక్‌, బాలయ్య అక్కడే స్పృహ కోల్పోయారు. నిరు పాది, గంగాధర్‌ గాయపడ్డారు. గ్రామస్థులు చికిత్స కోసం గంగాధర్‌ను హాల్వి గ్రామానికి తీసుకెళ్లారు. మిగతా ముగ్గురిని కౌతాళం పీహెచ్‌సీకి, అక్కడి నుంచి ఆదోని వైద్యశాలకు తీసుకెళ్లారు. కౌతాళం పీహెచ్‌సీలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఏఎన్‌ఎం ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ఆదోనికి తీసుకెళ్లాలని సూచించారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బాధిత కుటుంబాల సభ్యులు, బంధువులు ఏఎన్‌ఎంతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత పీహెచ్‌సీ నుంచి 108 వాహనంలో ఆదోనికి తీసుకెళ్లారు. అయితే అంబులెన్స్‌ కూడా ఆలస్యంగా వచ్చిందని వారు అసహనం వ్యక్తం చేశారు. అయితే అప్పటికే అశోక్‌, బాలయ్య మృతి చెందినట్లు ఆదోని వైద్యులు నిర్ధారించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలయ్యకు గతేడాది వివాహం కాగా భార్య మీనాక్షి ప్రస్తుతం గర్భిణి. అశోక్‌ తల్లిదండ్రులతో పాటు వ్యవసాయం, కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు.

క్రిష్ణగిరి మండలంలో రైతు..

మండలంలోని కటారుకొండ గ్రామానికి చెందిన బోయ శ్రీనివాసులు(52) పిడుగుపాటుకు ఆదివారం మృతి చెందారు. ఈదురు గాలులతో వర్షం కురువగా పొలంలో పనులు చేసుకుంటున్న శ్రీనివాసులు చెట్టు కిందకు వెళ్లారు. చెట్టుపై పిడుగు పడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాసులుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 12:33 AM