వైజ్ఞానిక ప్రదర్శనలతో ఆలోచన సామర్థ్యం
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:01 AM
విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకత, ఆలోచన సామర్థ్యం, పరిశోధన దృక్పథాన్ని వెలికితీసేందుకు, విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు తోడ్పడుతాయని కలెక్టర్ డా.ఏ. సిరి పేర్కొన్నారు.
పిల్లల నైపుణ్యాలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి : కలెక్టర్ డా. సిరి
ఆకట్టుకున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో నమూనాలు
కర్నూలు ఎడ్యుకేషన్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకత, ఆలోచన సామర్థ్యం, పరిశోధన దృక్పథాన్ని వెలికితీసేందుకు, విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు తోడ్పడుతాయని కలెక్టర్ డా.ఏ. సిరి పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ టౌన్ మోడల్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను కలెక్టర్ ప్రారంభించారు. ముందుగా శాస్త్రవేత్త సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ శాస్త్రీయ నమూనాలు, వినూత్న ఆవిష్కరణలను ఆసక్తిగా పరిశీలించి వారి ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, సానుకూల అలవాట్లను పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముస్తాబ్ కార్నర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం పాఠశాలలో కలెక్టర్ మొక్కను నాటారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. సుధాకర్, జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ లోక్‌రాజ్, జిల్లా సైన్స్ అధికారి రంగమ్మ, ప్రిన్సిపాల్ ఆదినారాయణరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.