పట్టుబడిపంతులయ్యారు..!
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:28 AM
కోటి ఆశలతో లక్షలాది మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురుచూశారు.. నోటిఫికేషన్ రానే వచ్చింది.. అహర్నిశలు శ్రమించారు..
మెగా డీఎస్సీ-2025 మెరిట్ జాబితా విడుదల
త్వరలో నియామక ప్రక్రియ పూర్తి.. పాఠశాలకు కేటాయింపు
జిల్లాలో 2,645 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ
టాపర్-1, 2లో వివిధ విభాగాల్లో 42 మంది అభ్యర్థులు
సర్టిఫికెట్ల పరిశీలనకు డిప్యూటీ డీఈవో, ఎంఈవోలకు శిక్షణ
ఎన్నికల హామీ నిలుపుకున్న కూటమి ప్రభుత్వం
రేపటి నుంచి ధ్రువీకరణ పత్రాలు పరిశీలన
కోటి ఆశలతో లక్షలాది మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురుచూశారు.. నోటిఫికేషన్ రానే వచ్చింది.. అహర్నిశలు శ్రమించారు.. రోజుకు పది నుంచి 12 గంటల పాటు పుస్తకాలతో కుస్తీ పట్టారు.. గురువులుగా ఎదగాలనే లక్ష్యంతో ముందు కు సాగారు.. పరీక్షలు రాసి ఇక ఫలితాల కోసం పడిగాపులు కాశారు.. వారి కలలు నెరవేరే సమ యం ఆసన్నమైంది.. వారి కష్టానికి తగ్గ ఫలితం దక్కే ఘడియలు రానే వచ్చాయి. శనివారం ఎందరో నిరు ద్యోగుల జీవితాల్లో ఉద్యోగ వెలుగులు వెలిగాయి. డీఎస్సీ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అభ్యర్థికి వచ్చిన మార్కులు, మెరిట్ జాబితాలో వారి పేరు ఏస్థాయిలో ఉంది..? ఉద్యోగం వస్తుందా.. రాదా..? అని అభ్యర్థులు నిర్ధారణకు వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5.77 లక్షల మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు దరఖాస్తులు చేస్తే, ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే 53,787 మంది దరఖాస్తు చేయడం కొసమెరుపు. ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. వారి కుటుంబాలు, బంధువులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు.
కర్నూలు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఉపాఽధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా మెగా డీఎస్పీ-2025 పక్కా ప్రణాళికతో నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వివిధ విభాగాల్లో 2,645 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఖాళీలు ఇక్కడే ఉండడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన నిరుద్యోగ ఉపాధ్యాయులు నాన్‌లోకల్ కేటరిగిలో అదృష్ట్యాన్ని పరీక్షించుకోవడానికి దరఖాస్తులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం మెరిట్ జాబితాను విడుదల చేశారు. కష్టపడి చదివిన వారు ఉద్యోగాలు సాధించారు. మెరిట్ జాబితాను డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్లో పెట్టారు. అన్ని సబ్జెక్టులకు రాష్ట్ర, జోన్, జిల్లాల వారీగా ర్యాంకులు ఇచ్చారు. జిల్లాలో 53,787 మంది అభ్యర్థులు డీఎస్సీ రాశారు. వారికి వచ్చిన మార్కులు ఆధారంగా మెరిట్ జాబితాను విడుదల చేశారు. త్వరలో పాఠశాలలకు కొత్త గురువు వస్తున్నారు. వివిధ సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులు పరిశీలిస్తే జిల్లాలో టాపర్-1గా నిలిచిన అభ్యర్థులు అత్యధికంగా 64.22 - 87.34 మార్కులు సాధించారు. ఆఖరులో నిలిచిన అభ్యర్థులకు అత్యల్పంగా సాంఘిక శాస్త్రంలో 18.56 మార్కులు, స్కూల్ అసిస్టెంట్ కన్నడలో 43.27 మార్కులు వచ్చాయి. వివిధ కేటగిరి రిజర్వేషన్లు ప్రకారం స్థానిక (లోకల్) అభ్యర్థులకు కటాఫ్ మార్కులు 64.06395 నుంచి 79.60427 పైబడి మార్కులు వచ్చిన అభ్యర్థులకు, స్థానికేత (నాన్ లోకల్) అభ్యర్థులు 70.56513 నుంచి 87.00531 మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థుకు ఉపాధ్యాయ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మెరిట్ జాబితాలో పేర్లు, మార్కులు, ర్యాంకులు చూసి తమకు ఉద్యోగం ఖాయం అని భావించే అభ్యర్థులు, వారి ఇళ్లలో సంబరాలు జరుపుకుంటున్నారు.
స్టేట్ ర్యాంకుతో మెరిసిన మహేష్‌బాబు
మూడు పోస్టులతో రాణించిన పేదింటి ఆణిముత్యం
కల్లూరు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన డీఏస్సీ ఫలితాల్లో కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడుకు చెందిన పేదింటి ఆణిముత్యం కల్లె మహేషబాబు స్టేట్ ర్యాంకుతో సత్తాచాటాడు. పెద్దపాడుకు చెందిన సాధారణ కూలీ వెంకటేశ్వర్లు, పార్వతమ్మలకు ముగ్గురు కుమారులు. పెద్దవాడైన కల్లె మహేష్‌బాబుకు చదువుపై ఉన్న మక్కువను గుర్తించిన తల్లిదండ్రులు రోజూకూలీగా పని చేస్తూ ఉన్నతంగా చదివించారు. పట్టుదలతో డీఏస్సీ రాసిన మహేష్‌బాబు ఏకంగా మూడు పోస్టులకు ఎంపికయ్యాడు. టీజీటీ తెలుగు స్టేట్‌ఫస్ట్ ర్యాంక్ 85.20 మార్కులు, పీజీటీ ఫోర్త్ జోన్ ఫస్ట్ ర్యాంక్ 84 మార్కులు, కర్నూలు జిల్లా స్కూల్ అసిస్టెంట్ తెలుగు జిల్లా ఫస్ట్ ర్యాంక్ 85.62 మార్కులతో అత్యున్నత ప్రతిభ కనబరిచారు. కష్టానికి తగిన ఫలితం వచ్చినందుకు ఆనందంగా ఉందని మహేష్‌బాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయంలో తల్లితండ్రుల పాత్ర చాలా ఉందని, చెమటోర్చి తనను చదివించిన అమ్మానాన్నల రుణం తీర్చుకుంటానన్నారు. అదేవిధంగా రాయలసీమ యూనివర్సిటీ తెలుగు డిపార్ట్‌మెంట్‌లో పీహెచ్‌డీ స్కాలర్ (జేఆర్‌ఎఫ్) తోడ్పాటు, తెలుగు డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ ఎన్.నరసింహులు ప్రోత్సాహం మరువలేనని కల్లె మహేష్‌బాబు సంతోషం వ్యక్తం చేశారు.
సర్టిఫికెట్ల పరిశీలనకు సన్నాహాలు
జిల్లాలో డీఎస్సీ-2025 ప్రతిభ చూపి ఉపాధ్యాయ ఉద్యోగం ఖరారు అయిన అభ్యర్థుల దరఖాస్తులు పరిశీలనకు అధికా రులు సన్నాహాలు చేస్తున్నారు. 50 అభ్యర్థులకు ఒక బృందం ఉంటుంది. సోమవారం నుంచి సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. ప్రతి జిల్లాకు సీనియర్ అధికారులను ఇన్‌చార్జిగా నియమిస్తారు. ఒకేసారి అన్ని సర్టిఫికెట్లు పరిశీలన పూర్తి చేసేందుకు సన్నాహా లు చేస్తున్నారు. శనివారం సునయన ఆడిటోరియంలో ఎంఈ వోలు, ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ తహసీల్దారులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. విద్యా శాఖ రాష్ట్ర సంయుక్త సంచాలకులు అబ్రహాం, ప్రాంతీయ సంచాలకులు కె.శామ్యూల్ వర్చువల్ ద్వారా విధివిధానాలను వివరించారు. కర్నూలు, నంద్యాల డీఈవోలు ఎస్.శామ్యూల్‌పాల్, జనార్దన్‌రెడ్డి, కర్నూలు జిల్లా ట్రైబల్ వెల్ఫేర్, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు హాజరయ్యారు. ఎస్జీటీ అభ్యర్థులకు కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలో, స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) లాం గ్వేజ్ అభ్యర్థులు నన్నూరు సమీపంలో మారుతి ఎస్టేట్ శ్రీరాఘవేంద్ర బీఎడ్ కళాశాలలో, స్కూల్ అసిస్టెంట్ నాన్- లాంగ్వేజ్ అభ్యర్థులు నన్నూరు సమీపంలో మారుతి ఎస్టేట్-2లో ఉన్న శ్రీనివాస బీఎడ్ కళాశాలలో 25వ తేదీ (సోమ వారం) నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని కర్నూలు డీఈవో తెలి పారు. 54బృందాలు (టీమ్‌లు), 216 మంది విద్యా, రెవెన్యూ, వైద్య అధికారులు పరిశీలనలో పాల్గొంటారు. 170 మంది వలంటీర్లు అందుబాటులో ఉంటారు. సమచారం కోసం హెల్ప్ డెస్క్‌లో ఉండే నరసయ్య-81218 21266, సూపరింటెం డెంట్ మదుల్లా-96036 83182, ఏడీ కె.నాగభూషణం-91776 79042 లకు కాల్ చేయవచ్చని డీఈవో తెలిపారు.
ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు..
డీఎస్సీ అర్హత సాధించిన అభ్యర్థులు సంబంధిత విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ఽధ్రువీక రణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్లు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. అంతకు ముందే ఆసర్టిఫికెట్లు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని విద్యా శాఖ అధికారులు తెలిపారు. అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీ, సమయానికి సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాకపోతే వారి అభ్యర్థిత్వం రద్దుచేసి, ఆ తరువాత మెరిట్ ఉన్న అభ్యర్థిని సర్టిఫి కెట్ల పరిశీలనకు పిలుస్తారు. దీంతో ఎన్ని ఇబ్బందులున్నా, కేటాయించిన తేదీ, సమయానికి సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని డీఈవో శామ్యూల్‌పాల్ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. కుల, రెవెన్యూ సర్టిఫికెట్ల పరిశీలనకు రెవెన్యూ అధకారులు, దివ్యాంగ సర్టిఫికెట్ల పరిశీలనకు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ఒకే అభ్యర్థికి రెండు, మూడు ఉద్యోగాలకు ఎంపికై, అందులో ఒక పోస్టును ఎంపిక చేసుకుంటే, మిగిలిన పోస్టులకు తర్వాత అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తారు. దీంతో కటాఫ్ మార్కులు, ర్యాంకుల్లో స్వల్ప తేడాలు వచ్చే అవకాశం లేకపోలేదు.
శభాష్ లావణ్య..
డీఎస్సీలో జిల్లా ఫస్ట్ ర్యాంకు
తుగ్గలి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): తండ్రి పుల్లయ్య తన చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి కృష్ణవేణి కూలీ పనులు చేస్తూ చదువు చెప్పడంతో.. విద్యాబుద్దులు నేర్పి సరస్వతిగా తీర్చిదిద్ది విద్యనందించే గౌరవ ఉపాధ్యాయురాలుగా సేవలందించేందుకు డీఎస్సీ ఎస్జీటీలో లావణ్య జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించింది. అందరితో శభాష్ అనిపించుకుంటుంది. మాజీ సర్పంచ్ వెంకటస్వామి, మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖ్ యాదవ్‌తో పాటు పలువురు లావణ్యను అభినందించారు.
నాన్న కోరిక మేరకు ఉపాధ్యాయ వృత్తి చేపట్టా
తాను 7వ తరగతి చదువుతున్న సమయంలో నాన్న అకాల మరణం చెందారు. అమ్మ కూలీ పనులు చేస్తూ తనను, చెల్లెలు, తమ్ముడిని చదివింది. నాన్న కోరిక మేరకు ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనే ఆకాంక్షతో ఎంతో కష్టపడి చదివి విజయం సాధించా. 2020లోనే టీటీసీ పూర్తి చేశా. ఉన్నత చదువుల కోసం గురువులు ఆర్థికసాయం అందించారు. వారి రుణం తీర్చుకోలేనిది. భవిష్యత్తులో పేద విద్యార్థులకు అండగా ఉంటా. వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తా.
లావణ్య, ఎస్‌జీటీ, జి.ఎర్రగుడి
గురువు ఉద్యోగం సాధించాలన్నదే..
ఆదోని అగ్రికల్చర్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): టీచర్ ఉద్యోగం సాధించాలన్న తపనతో రోజుకు 12 నుంచి 16 గంటల పాటు చదివి పట్టుబట్టి సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో ఆదోనికి చెందిన సాయి నవీన్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌లో జిల్లా మొదటి స్థానంలో నిలిచారు. తండ్రి ఆర్ కిషోర్ రిటైర్డ్ ఉద్యోగి, తల్లి జె.విజయ్ కుమార్ ఆస్పరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు.
ర్యాంకుల దీపిక
నంద్యాల ఎన్జీవోస్ కాలనీకి చెందిన దీపిక ఏకంగా మూడు ర్యాంకులు సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన దీపిక నంద్యాలకు చెందిన డ్రాయింగ్ మాస్టర్ ఆదిశేషును వివాహం చేసుకుంది. పట్టణంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో జిల్లాస్థాయిలో మొదటిర్యాంక్, పీజీటీ జోన్-2లో రెండవ ర్యాంక్, టీజీటీలో 7వ ర్యాంక్ సాధించారు.
కౌతాళం మండలానికి ర్యాంకుల పంట
కౌతాళం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ మెరిట్ లిస్ట్‌లో కౌతాళం మండలంకు చెందిన విద్యార్థులు ర్యాంకులు సాధించి ఉపాధ్యాయ కొలువులను చేజిక్కించుకున్నారు. ముఖ్యంగా కన్నడ మీడియం విభాగంలో నదిచాగి గ్రామానికి చెందిన 8 మంది ఉపాధ్యాయ కొలువులకు ఎంపిక కావడంతో ఆగ్రామంలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. మండలంలోని నదిచాగి గ్రామం నుంచే ఎనిమిది మంది ఉపాధ్యాయ కొలవులు సాధించారు. స్కూల్ అసిస్టెంట్ల విభాగంలో సోషల్‌లో జిల్లా మొదటి ర్యాంకు స్వాతి, కన్నడలో జిల్లా రెండో ర్యాంకు వడ్డే నాగరాజు, గణితంలో జిల్లా 5వ ర్యాంకు మంజుశ్రీ, ఎస్జీటీ కన్న డలో కావ్య జిల్లా 3వ ర్యాంకు, తొగట చరణ్ రాజ్ జిల్లా 10వ ర్యాంకు, రాంతుల్లా 14, విజయ్ కుమార్ 25, వైశాఖ శెట్టి 29వ ర్యాంకులు సాధించారు. ఒకేసారి తమ గ్రామం నుంచి 8 మంది ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక కావడంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మండల పరిధిలోని ఎరిగేరి గ్రామానికి చెందిన జయకర్ స్కూల్ అసిస్టెంట్ విభాగంలో ఇంగ్లీష్‌లో జిల్లా 10వ ర్యాంకు సాధించారు.
ప్రభాకరుడి ప్రతిభ
నంద్యాల హాస్పిటల్: కర్నూలు జిల్లా సి.బెళగల్‌లోని డా.బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో పీఈటీగా కాంట్రాక్ట్ పద్ధతిన పని చేస్తున్న డేరంగుల ప్రభాకర్ డీఎస్సీలో ప్రతిభ చాటాడు. రెండు ఉద్యోగాలకు ఎంపిక అయ్యాడు. జూపాడుబంగ్లా మండలం తూడిచెర్లకి చెందిన సాధారణ రైతు కుటుంబం రామకృష్ణుడు, వరలక్ష్మమ్మకు రామగోపాల్, బాలకృష్ణ, ప్రభాకర్ అనే ముగ్గురు సంతానం. చివరివాడైన ప్రభాకర్ బీపీఈడీ కోర్సు చేసి పీఈటీగా పనిచేస్తున్నారు. ఇటీవలి డీఎస్సీలో పీఈటీ పోస్టుకు 83మార్కులతో రాయలసీమ జోన్‌స్థాయిలో 17వ ర్యాంక్ సాధించి పీఈటీగా ఎంపికయ్యారు. అలాగే 85మార్కులతో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుకు 11వ ర్యాంక్ సాధించి ఎంపికయ్యారు.
టైలర్ మాస్టర్
శిరివెళ్ల: టైలరింగ్ పనిచేస్తున్న నసీరుద్దీన్ డీఎస్సీలో సత్తా చాటి గురువుగా మారనున్నారు. శిరివెళ్లకు చెందిన నసీరుద్దీన్ స్కూల్ అసిస్టెంట్ హిందీ విభాగంలో 82.37మార్కులతో ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. ఉపాధ్యాయ ఉద్యోగం సాధించి విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పం నెరవేరిందని నసీరుద్దీన్ అన్నారు. జిల్లాస్థాయిలో మొదటి ర్యాంకు సాధిం చిన ఆయనను పలువురు గ్రామపెద్దలు, ఉపాధ్యాయులు అభినందించారు.