కపాస్ అయ్యారు..!
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:14 AM
సీసీఐ రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసేందుకు గతేడాది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే యాప్‌ను ప్రవేశపెట్టడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు.
యాప్‌లపై అవగాహన
లబ్ధి పొందిన రైతులు
సీసీఐకు 4,89,078 క్వింటాళ్ల పత్తి అమ్మకాలు
రైతుల ఖాతాలో రూ.383 కోట్లు జమ
సీసీఐ రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసేందుకు గతేడాది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే యాప్‌ను ప్రవేశపెట్టడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది కూడా ఇదే తంతు కొనసాగుతోందని అన్నదాతలు ఆందోళన చెందారు. సీసీఐ అమలులోకి తెచ్చిన కపాస్ కిసాన్ యాప్‌తో పాటు సీఎం యాప్, ఈక్రాప్ నమోదు తదితర వాటిపై రైతులు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకున్నారు. ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి రైతుల సందేహాలను నివృత్తి చేశారు. దీంతో జిల్లాలోని 16 సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకెళ్లి క్వింటానికి రూ.7,500 నుంచి పూర్తిస్థాయి మద్దతు ధర రూ.8,110 పొందగలిగారు. ఇప్పటిదాకా 15,975 మంది రైతులు 4,89,078 క్వింటాళ్ల పత్తిని సీసీఐ కేంద్రాల్లో అమ్మారు.
కర్నూలు అగ్రికల్చర్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): రైతులతో వివిధ రకాల యాప్‌లపై అవగాహన పెంచుకొని లబ్ధి పొందారు. గతంలో సీసీఐ (కాటన్ కార్పొ రేషన్ ఆఫ్ ఇండియా) రైతుల నుంచి ఎప్పుడూ పత్తిని పెద్దమొత్తంలో కొనుగోలు చేయలేదు. అప్పట్లో రకరకాల యాప్‌లు లేవు. రైతులు వివిధ రకాల యాప్‌లపై అ వగాహన పెంచుకున్నారు. ఈసారి ఖరీఫ్‌లో రైతులు పండించిన పత్తిని సీసీఐ రికార్డు స్థాయిలో కొనుగోలు చేసింది. కొత్తగా ఎన్నెన్నో కఠిన నిబంధనలు అధిగమించి రైతులు పూర్తి అవగాహనతో పత్తిని సీసీఐకి అమ్మి మద్దతు ధరను పొందగలిగారు. గత సంవత్సరం నవంబరు 11న పత్తిని రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు సీసీఐ కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో జనవరి 11వరకు పత్తిని రైతుల నుంచి సీసీఐ సంస్థ కొనుగోలు చేసింది.
మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ..
రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్‌ను బుక్ చేసుకునేందుకు తంటాలు పడుతున్న సమయంలో ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ చంద్రమౌలి రైతు లకు ఆ యాప్‌పై అవగాహన కల్పించారు. ప్రతి రోజూ జిల్లాలో వేలాది మంది రైతులు పత్తిని ఎలా అమ్ముకోవాలో ఏవిధంగా కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలో తెలియక ఉమ్మడి జిల్లాలోని 15 మార్కెట్ కమిటీల సెక్రటరీలకు పోన్లు చేసి వివరాలు అడిగారు. ప్రతి రోజు వందలాది మంది రైతులకు సమాధానం చెప్పు కోలేక ఇబ్బందులు పడ్డామని విలేకరుల ముందు ఆవేదన వ్యక్తం చేసేవారు. ఈ పరిస్థితులను గుర్తించిన ఎమ్మిగనూరు సెక్రటరీ చంద్రమౌలి రైతులతో వాట్సాప్ గ్రూపును ఏర్పాటుచేశారు. దీంతో రైతులు వాట్సాప్ గ్రూపులో పత్తిని ఎలా అమ్ముకో వాలో వివరాలు అడగడం, రైతుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, ఆయా మార్కెట్ కమిటీల సెక్రటరీలకు సులువైన మార్గంగా ఏర్పడింది. అందువల్లనే ఈసారి రికార్డు స్థాయిలో రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయగలిగామనీ మార్కెటింగ్ శాఖ ఏడీఎం నారాయణమూర్తి తెలిపారు.
మొదట్లో ఆందోళన..
ఈసంవత్సరం రైతులు వివిధ యాప్‌లతో ఇక్కట్లు పడ్డారు. ప్రారంభం నుంచి సీసీఐ అమలు చేస్తున్న యాప్‌లతో రైతులు తట్టుకోలేక ఈసారి కూడా తమకు దళారులు, వ్యాపారులే శరణ్యం అవుతారేమోనని ఆందోళన చెందారు. ఊహించని విదంగా రైతు లు సీసీఐ అమలులోకి తెచ్చిన కపాస్ కిసాన్ యాప్‌తో పాటు సీఎం యాప్, ఈక్రాప్ నమోదు తదితర వాటి గురించి అవగాహన పూర్తి స్థాయిలో పెంచుకుని నిబంధనల మేరకు పత్తిని జిల్లాలోని 16 సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి క్వింటానికి రూ.7,500 నుంచి పూర్తిస్థాయి మద్దతు ధర రూ.8,110లు పొందగలిగారు. ఇప్పటిదాకా 15,975 మంది రైతులు 4,89,078 క్వింటాళ్ల పత్తిని సీసీఐ కేంద్రాల్లో అమ్మారు. వీరికి సీసీఐ ద్వారా రూ.383 కోట్లను వారి బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. జనవరి వరకు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ పత్తిని అమ్ముకోవచ్చని మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి నారాయణమూర్తి తెలిపారు.
ఎంతో ప్రయో జనం కలిగింది
గత సంవత్సరం రైతులు పత్తిని అమ్ముకునేందుకు ఎన్నో కష్టనష్టాలు అనుభవించారు. సీసీఐ పత్తిని కొనుగోలు చేసేందుకు అమలుచేసిన నిబంధనలపై రైతులకు అవగాహన లేకపోవడంతో ఆపరిస్థితి నెలకొంది. ఈసారి అటువంటి కష్టాలు రైతులు పడకూడదనే ఉద్దేశంతోనే సీసీఐ అమలు చేస్తున్న నిబంధనలపై రైతులకు అవగాహన కల్పించేందు కోసం వారితో వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశాము. ఎప్పటికప్పుడు ఆ గ్రూపులో రైతుల సందేహాలను నివృత్తి చేశాం.
చంద్రమౌలి, మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ, ఎమ్మిగనూరు