Share News

కొండను తవ్వేస్తున్నారు..!

ABN , Publish Date - Sep 08 , 2025 | 11:50 PM

మండల పరిధిలోని కొతిగట్టు కొండను అక్రమార్కులు తవ్వేస్తున్నారు. ఈవిషయం సం బంధిత అధికారులకు తెలిసినా అప్పటికి అప్పు డు సిబ్బందిని పంపి హడావుడి చేసి వదిలేస్తున్నారు.

కొండను తవ్వేస్తున్నారు..!
గుడికల్‌ కొతిగట్టు కొండలో ఎర్రగరుసు తవ్విన దృశ్యం

ఎర్రగరుసు కోసం అక్రమ తవ్వకాలు

అలా పట్టుకొని.. ఇలా వదిలేస్తున్న అధికారులు

చర్యలు చేపట్టకపోవడంతో రెచ్చిపోతున్న అక్రమార్కులు

ఎమ్మిగనూరు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కొతిగట్టు కొండను అక్రమార్కులు తవ్వేస్తున్నారు. ఈవిషయం సం బంధిత అధికారులకు తెలిసినా అప్పటికి అప్పు డు సిబ్బందిని పంపి హడావుడి చేసి వదిలేస్తున్నారు. దీంతో అక్రమార్కుల గరుసు తవ్వకాలకు అడ్డుకట్ట పడటం లేదు. మండలంలోని గుడికల్‌ గ్రామ పరిధిలో ఎల్లెల్సీ కాలువను ఆనుకొని ఉన్న కొతిగట్టు(కొండ)లో గత నెల 30వ తేదీన అక్ర మార్కులు ఎక్స్‌కవేటర్‌తో గరుసు తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలించారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు వీఆర్‌ఏలను కొండదగ్గరకు పంపి గరుసు తవ్వకాలను అడ్డుకున్నారు. అక్ర మార్కులు అక్కడి నుంచి పలాయనం చిత్తగిం చారు. ఐదు రోజులు గడిచాక శుక్రవారం కోటేకల్‌ పంచాయతీలో మజరా గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు కొతిగట్టు కొండలో గరుసు తవ్వి ట్రాక్టర్ల ద్వారా ఎమ్మిగనూరు పట్టణానికి తరలించాడు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు గుడికల్‌ వీఆర్‌ఏలను కొండ దగ్గరకు పంపి గరుసు తవ్వకాలను అడ్డుకున్నారు. దీంతో అక్రమార్కులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.అనుమతి లేకుండా గరుసు తవ్వకాలకు పాల్పడినప్పటికి ట్రాక్టర్లను, ఎక్స్‌కవేటర్‌ను సీజ్‌ చేయకుండా వదిలేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తూతూ మంత్రంగా..

అధికారులు మొదట్లో అక్రమార్కులపై కేసు నమోదు చేయటం, ట్రాక్టర్‌, ఎక్స్‌కవేటర్‌ స్వాధీనం చేసుకొని ఉంటే మరోసారి గరుసు తవ్వకాలు జరిగేవి కావు. తూతూ మంత్రంగా కింది స్థాయి సిబ్బందిని పంపి చర్యలు చేపట్టారు. దీంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గరుసు తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే మాసుమాన్‌దొడ్డి గ్రామ సమీపంలో ఉన్న పలమరసు కొండను అక్రమార్కులు ఖాళీచేశారు. ఇప్పుడు గుడకల్‌ కొతిగట్టు కొండపై దృష్టి సారించి ఓ వైపు నుంచి కొండకు కన్నం వేస్తు గరుసు తవ్వకాలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించని పక్షంలో కొతిగట్టు కొండ కూడా మరో పలమరసు కొండగా మారనుందని ప్రజలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. గరుసు తవ్వకాలపై తహసీల్దార్‌ శేషఫణి, గుడికల్‌ వీఆర్‌వో వరలక్ష్మిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.

Updated Date - Sep 08 , 2025 | 11:50 PM