Share News

కేంద్ర పథకాల్లో జాప్యం తగదు

ABN , Publish Date - Nov 20 , 2025 | 11:28 PM

వివిధ శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో జాప్యానికి తావులేకుండా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నంద్యాల పార్లమెంట్‌ సభ్యురాలు, జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ(దిశా) కమిటీ ఛైర్మన్‌ బైరెడ్డి శబరి అధికారులను ఆదేశించారు.

కేంద్ర పథకాల్లో జాప్యం తగదు
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ శబరి, కలెక్టర్‌

ఎంపీ, దిశ కమిటీ చైర్మన్‌ బైరెడ్డి శబరి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల, నూనెపల్లి 20 (ఆంధ్రజ్యోతి) : వివిధ శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో జాప్యానికి తావులేకుండా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నంద్యాల పార్లమెంట్‌ సభ్యురాలు, జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ(దిశా) కమిటీ ఛైర్మన్‌ బైరెడ్డి శబరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో బైరెడ్డి శబరి అధ్యక్షతన దిశా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో వినియోగించు కోకపోవడంతో రూ. వందల కోట్లు వెనక్కి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. జిల్లాలోని ఏ ఏ శాఖలకు ఏమేం నిధులు అవసరమో నివేదిక తయారు చేసి తమకు పంపాలని అధికారులకు సూచించారు. విద్యాశాఖ భవనాల మరమ్మతులకు మంజూరైన నిధులను వినియోగించుకోవాలన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద మంజూరు చేసిన 60 శాతం వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకొని రైతులను ప్రోత్సహించాలన్నారు. కొన్ని చోట్ల జాతీయ రహదారులు మరమ్మతుకు గురయ్యాయని నేషనల్‌ హైవే అధికారులు తగు చర్యలు చేపట్టాలన్నారు. జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ఇంటింటికీ కొళాయి కనెక్షన్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లాలో రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం 10,600 సాయిల్‌ హెల్త్‌ కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో జిల్లాలో 5.20 లక్షల మందికి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌(ఏబీహెచ్‌ఏ) కోసం ఈ-కేవైసీ చేసినట్లు తెలిపారు. తాగునీటి సరఫరాకు ఆర్వో ప్లాంట్లు మంజూరు చేసి, బోర్‌, విద్యుత్‌ కనెక్షను ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు నిర్ణీత కాల వ్యవధిలో పూర్తిచేయాలనన్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) అనేది ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాల రైతులకు ఆర్థిక సాయం అందుతుందని అన్నారు. రబీ, ఖరీఫ్‌ సీజన్‌లో పండించే పంటలకకు తప్పనిసరిగా పంట బీమా కల్పించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. పశు సంవర్ధక శాఖకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకు 57,392 పాడి పశువులున్నాయని, వాటిని పెంచడానికి పశువులు లేని వారికి పశువులిచ్చి ప్రోత్సహించామన్నారు. జలకనూరు రిజర్వాయర్‌ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా విద్యుత్‌ కనెక్షన్ల ద్వారా నీటిని తీసుకుంటున్నారని వాటిని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈని కలెక్టర్‌ ఆదేశించారు.

ఉమ్మడి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ.. 340సీ కు సంబంధించిన పనులు నాణ్యంగా జరిగేలా చూడాలన్నారు. అండర్‌ పాత్‌ నిర్మాణాలు చాలా దూరంగా వేయడం ద్వారా ప్రజలు రోడ్డు దాటడానికి ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. జల్‌మార్గ్‌ వికాస్‌ ప్రాజెక్టు(జేఎంవీపీ) జిల్లాను పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని, శ్రీశైలానికి వెళ్లడానికి సింగిల్‌ రోడ్డు ఉండటం వల్ల అధిక సమయం పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సీఈవో నాసరరెడ్డి, డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, ఎంపీపీలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 11:28 PM