Share News

యూరియా కొరత లేదు.. ఆందోళన వద్దు

ABN , Publish Date - Aug 11 , 2025 | 11:30 PM

యూరియా కొరత లేదని.. రైతులు ఆందోళన చెందవద్దని, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని న్యాయ, మైనార్టీశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ రైతులకు భరోసానిచ్చారు.

యూరియా కొరత లేదు.. ఆందోళన వద్దు
మాట్లాడుతున్న మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల ఎడ్యుకేషన్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): యూరియా కొరత లేదని.. రైతులు ఆందోళన చెందవద్దని, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని న్యాయ, మైనార్టీశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ రైతులకు భరోసానిచ్చారు. నంద్యాల టెక్కె మార్కెట్‌యార్డు కార్యాల యంలో మార్కెట్‌యార్డు చైర్మన్‌ గుంటుపల్లి హరిబాబు అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సమావేశానికి మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ గౌరవాధ్యక్షుడిగా హాజరయ్యారు. సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రైతాంగానికి పెరుగుతున్న అవసరాల దృష్ట్యా పొలాలకు లింక్‌రోడ్లు వేయాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మార్కెట్‌ ఆదాయ మార్గాలను పెంచుకోవాల న్నారు. టెక్కె మార్కెట్‌ యార్డులో రోడ్డుకు పక్కన ఉన్న షాపుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. మార్కెట్‌ను అభివృద్ధి చేసిన వారిని మరిచి కార్యాలయం నిండా ఫొటోలను పెట్టారని ఎద్దేవా చేశారు. గోస్పాడు మండలం దీబగుంట్ల సొసైటీకి మే, జూన్‌లోనే ఎరువులు ఎలా ఇచ్చారని, దీనిపై విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పారు. మార్కెట్‌యార్డుకు చెందిన షాపులు, గోదాములను బహిరంగవేలం ద్వారా నిర్వహించాలని కమిటీ సభ్యులకు సూచించారు. రైతు సమాఖ్యలు రైతుల కోసం నిర్వహించాలే కాని రాజకీయాల కోసం కాదన్నారు. చైర్మన్‌ హరిబాబు మాట్లాడుతూ కార్యాలయ మరమ్మతులకు రూ.10 లక్షలు, కాంపౌండ్‌ మరమ్మతులకు రూ.10లక్షలు, టెక్కె మార్కెట్‌యార్డులో 9 షాపులు నిర్మాణాలకు రూ.58లక్షలు తదితర పనులకు రూ.1.70 కోట్లతో చేపట్టేందుకు తీర్మానించినట్లు తెలిపారు. సమావేశంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి కల్పన, మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ రంగప్రసాద్‌, డైరెక్టర్లు స్వామినాయక్‌, అజ్మీర్‌, నూర్‌బాషా, మదార్‌సా, రవికుమార్‌, విజయగౌరి, పరిమళ, అనసూయ, నాగలక్ష్మి, లీలావతి, నాగమ్మ, సుమలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 11:30 PM