Share News

నారీలోకం.. హర్షాతిరేకం..!

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:20 AM

సార్‌..! నేను రోజు మా ఊరి నుంచి ఎమ్మిగనూరుకు వచ్చి.. ఇక్కడి నుంచి పల్లెపల్లెకు వెళ్లి సిల్వరు, ప్లాస్టిక్‌ సామాన్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నా.

నారీలోకం.. హర్షాతిరేకం..!

ఆర్టీసీ బస్సుల్లో మహిళల సందడి

జీరో టికెట్లు అందిస్తున్న కండెక్టర్లు

‘స్త్రీ శక్తి’ని సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు

జిల్లాలో తొలి రోజు 15వేల మందికి పైగా ప్రయాణం

చిన్నచిన్న సమస్యలున్నా 95 శాతం సక్సెస్‌

సార్‌..! నేను రోజు మా ఊరి నుంచి ఎమ్మిగనూరుకు వచ్చి.. ఇక్కడి నుంచి పల్లెపల్లెకు వెళ్లి సిల్వరు, ప్లాస్టిక్‌ సామాన్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నా. ప్రతి రోజూ రూ.150-200 వరకు చార్జీల కోసం ఖర్చు చేయాల్సి వచ్చేది. చంద్రన్న ఉచిత బస్సు ప్రయాణం వల్ల నాకు రోజుకు సగటున రూ.150 చొప్పున నెలకు రూ.4,500 చార్జీల రూపంలో ఆదా అవుతుంది. ఇక నుంచి ఆ డబ్బు కుటుంబ ఖర్చులకు వస్తుంది. చంద్రబాబు చల్లంగుండాలయ్యా..! అంటూ సి.బెళగల్‌ గ్రామానికి చెందిన సూరమ్మ సంతోషం వ్యక్తం చేశారు. ఆమె ఒక్కటే కాదు.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సాగించిన ఏ మహిళను కదిపినా ఉచిత బస్సు ప్రయాణంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): స్త్రీశక్తి పేరిట సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణంపై మహిళాలోకం హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తుంది. ఆధార్‌, రేషన్‌కార్డు వంటి గుర్తింపు కార్డు చూపిస్తే.. కండక్టర్లు జీరో టికెట్‌ ఇస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ‘స్త్రీ శక్తి’ పథకానికి సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం శ్రీకారం చుట్టారు. జిల్లాలో మంత్రి టీజీ భరత్‌, ఆయా నియోజకవర్గాల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. శనివారం ఉదయం నుంచే మహి ళలు పెద్దసంఖ్యలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కృష్ణాష్టమి సెలవు కావడంతో మహిళా ఉద్యోగుల సంఖ్య తగ్గింది. జిల్లాలో తొలిరోజు దాదాపుగా 15వేల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకుంటారని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయిలో పలువురు మహిళలను పలకరించింది. ఎవరిని కదిపినా ఒకటే మాట.. చంద్రన్నా.. నీవు చల్లంగా ఉండాల య్యా..! అంటూ దీవిస్తున్నారు.

తొలి రోజు చిన్నపాటి ఇబ్బందులు

జిల్లాలో కర్నూలు, ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం ఆర్టీసీ బస్టాండుల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలు తీరును ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించింది. పలువురు మహిళలను పలకరించి అమలు తీరు ఎలా ఉందో అడిగి తెలుసుకుంది. తొలిరోజు కావడంతో టికెట్ల జారీ, గుర్తింపు కార్డులు చూపించడంలో చిన్నిచిన్న ఇబ్బందులు తలెత్తినా 95 శాతం సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. మహిళలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామాలు, పట్టణాలకు వెళ్లి కూరగాయాలు, పాలు పెరుగు, దుస్తులు, వంట సామగ్రి.. వంటివి విక్రయిస్తూ జీవనం సాగించే చిరు వ్యాపారాలు చేసే మహిళల్లో రెట్టింపు ఆనందోత్సాహం కనిపించింది. రోజుకు రూ.100-200కు పైగా చార్జీల రూపంలో ఖర్చులు భరించాల్సి వచ్చేది. ఉచిత ప్రయాణం వల్ల నెలకు సరాసరి రూ.2,500 నుంచి రూ.4,500కు పైగా ఆదా అవుతుంది. ఉచిత బస్సు ప్రయాణం రూపంలో ఏడాదికి రూ.25-50వేలు వరకు కూటమి ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించినట్లే అని కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామానికి చెందిన కూరగాయల వ్యాపారి రామలక్ష్మమ్మ పేర్కొన్నారు. మాది కర్నూలు.. గోనెగండ్ల మండలంలో ఓ గ్రామ సచివాలయంలో పని చేస్తున్నా. రోజు ఆర్టీసీ బస్సులో వెళ్లి రావడం వల్ల రానుపోనూ చార్జీలు రూ.150-200కు పైగా అవుతుంది. గోనెగండ్లలో స్టాప్‌ లేదంటే ఎమ్మిగనూరు చార్జీ తీసుకోవాల్సి వచ్చేంది. ఉచిత బస్సు ప్రయాణంతో ఎంత తక్కువ కాదన్న రూ.5వేల వరకు ఆదా అవుతుందని, ‘స్త్రీశక్తి’ మహిళా ఉద్యోగులకు ఓ వరమని సచివాలయ మహిళా ఉద్యోగి ఒకరు పేర్కొన్నారు. అన్ని వర్గాల మహిళలు ఉచిత బస్సు ప్రయాణంపై ఆనందోత్సాహం వ్యక్తం చేశారు.

నిబంధనలు సడలించి శ్రీశైలం ఘాట్‌ రూట్లో..

ఘాట్‌ రూట్లో ఉచిత బస్సు ప్రయాణం లేదనే నిబంధన మొదట్లో పెట్టారు. శ్రీశైలం వెళ్లే మహిళా భక్తులకు ఉచిత ప్రయాణ సౌకర్యం లేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. స్త్రీశక్తి ప్రారంభోత్సవ సభలో మహిళా భక్తులు ఉచితంగా శ్రీశైలం వెళ్లి మల్లన్నను దర్శించుకొని రావొ చ్చని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో నిబంధనలు సడలించి శ్రీశైలం ఘాట్‌ రూట్లో కూడా భద్రత దృష్ట్యా పరిమితి (సీటింగ్‌ కెపాసిటీ)కి మించకుండా వరకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించారు. దీంతో జిల్లాలో ఉచిత ప్రయాణం కల్పించే పల్లె వెలుగు, అలా్ట్ర పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల 231నుంచి 250కి చేరాయి. స్పెషల్‌ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తారు. కృష్ణాష్టమి సెలవు రోజు కావడంతో తొలిరోజు స్వల్పంగా మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గినా, సరాసరి 15వేల మందికిపైగా ఉచిత ప్రయాణ సౌకర్యం సద్వినియోగం చేసుకున్నారని ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీనివాసులు తెలిపారు. ఉచిత ప్రయాణంపై మహిళలకు అవగాహ న కల్పించారు. కర్నూలు నుంచి ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాల యం, ఆలూరు వెళ్లే ప్రయాణీకులు ముప్పాతిక శాతం ఉన్నారు. కర్నూలు-ఆదోని వయా కోడుమూరు, ఎమ్మిగనూరు మీదుగా నడిపే సింగిల్‌, టూ, త్రీ స్టాప్‌ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గుర్తింపు కార్డులు తప్పనిసరి

‘స్త్రీ శక్తి’లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు 250 బస్సులు సిద్ధం చేశాం. అన్నిరకాల సర్వీసు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం ఉంటుంది. ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటరు గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక గుర్తింపు కార్డును మహిళలు తప్పక చూపించాలి. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఆ సంస్థ ఇచ్చే గుర్తింపు (ఐడీ) కార్డు, విభిన్న ప్రతిభావంతులైన మహిళలు సంబంధిత సంక్షేమ శాఖ ఇచ్చే గుర్తింపు కార్డు చూపించినా అనుమతి ఇస్తారు.

టి శ్రీనివాసులు, ఆర్‌ఎం, రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ), కర్నూలు

రాఘవేంద్ర స్వామి దర్శించుకున్నా

ప్రభుత్వం మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించటం మంచిదే. మొదటి సారి ఉచిత బస్సులో ప్రయాణించి పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నాం.

సౌమ్య, ఆదోని

మహిళలకు దక్కిన గౌరవం

ప్రభుత్వం మహిళలకు గౌరవం కల్పించింది. ఉచిత బస్సు పథకం మహిళలకు ఎంతో ఉప యోగ పడుతుంది. ఏదైనా ఆసుపత్రికి వచ్చినా, కుటుంబ అవసరాలకై పట్టణానికి వచ్చినా కూడా ఉచి తంగా రావడం అనేది చాలా ఆనందం వేస్తుంది. బస్సుకి ఇచ్చే చార్జీలకు అయ్యే ఖర్చు పిల్లలకు పండ్లు తీసుకెళ్లొచ్చు.

సరస్వతి, గోనెగండ్ల

చంద్రబాబు మంచి పని..

ఆడోళ్లకు సీఎం చంద్రబాబు మంచి పని చేశారు. కొడుకులను దుడ్లు అడిగే పని లేదు. మాకేమి ఏదైనా అడ్రస్‌ కార్డు ఉంటే చాలు. బస్సు ఎక్కుతాము పోయి పని చూసుకుంటాం. మరి అదే బస్సుకు వస్తాం. నాకేం పింఛన్‌ కూడా వస్తుంది. వారికి నేనే ఇస్తాను. చంద్రబాబు మాట ఇచ్చాడు. దాని ప్రకారం నడుచుకున్నాడు.

- జెరూసమ్మ, ఎమ్మిగనూరు

Updated Date - Aug 17 , 2025 | 12:20 AM