Share News

ఎరు‘వుత్తుత్తి’

ABN , Publish Date - Jul 11 , 2025 | 11:45 PM

రైతుకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. వర్షాలు కురుస్తుండడంతో పంటల సత్తువ కోసం ఎరువులు చాలా అవసరం.

ఎరు‘వుత్తుత్తి’
ఆదోని మార్కెట్‌ యార్డ్‌ డీసీఎంఎస్‌ కేంద్రం వద్ద ఎరువుల కోసం బారులు

కలత చెందుతున్న రైతన్న

యూరియా కోసం డీసీఎంఎస్‌ల వద్ద పడిగాపులు

వారం రోజులుగా దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు

ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి

లింక్‌ ఎరువులు కొంటేనే యూరియా

తూతూ మంత్రంగా వ్యవసాయాధికారుల తనిఖీలు

రైతుకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. వర్షాలు కురుస్తుండడంతో పంటల సత్తువ కోసం ఎరువులు చాలా అవసరం. అధికారులు ఎరువులు ఉన్నాయని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. సహకార సంఘాలతో పాటు రైతు సేవా కేంద్రాల్లో అవసరమైన నిలువలు లేక ప్రైవేటు ఎరువుల వ్యాపారులపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఆదోని డివిజన్‌లో 89 వేల లక్షల హెక్టార్లకు పైగా వివిధ పంటలను సాగు చేశారు. ప్రధానంగా పత్తి, వరి, వేరుశనగ, మిరప పంటలకు ప్రస్తుతం యూరియా చాలా అవసరం. ప్రైవేటు వ్యాపారుల వద్ద యూరియా కావాలంటే లింకు ఎరువు కొనాల్సిందే. వ్యవసాయ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు.

ఆదోని అగ్రికల్చర్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి): ఎరువులు ఉన్నాయి, ఆందోళనవద్దని అధికారులు చెబుతున్న మాటలు నీటి మూటలయ్యాయి. వారం రోజులుగా ఎరువులు లభించక రైతులు అవస్థలు పడుతున్నారు. సహకార సంఘా ల్లో, రైతుసేవా కేంద్రాల్లో నిలువ లు లేక ప్రైవేటు ఎరువుల వ్యా పారులపై ఆధార పడాల్సిన పరిస్థితి. అవసరమైన ఎరువులతో పాటు వారు లింకు ఎరువులు కొనాల్సిందే అనే కండీషన్‌ పెట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆదోని మార్కెట్‌ యార్డ్‌లోని డిస్టిక్‌ కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) వద్దకు రైతులు పరిగెడుతున్నారు. అక్కడా రెండు రోజులుగా అవసరమైన స్టాక్‌ లేకపోవడంతో పడిగాపులు కాస్తున్నారు.

కర్ణాటక రైతులు సైతం..

ఆదోని రెవెన్యూ డివిజన్‌ కావడంతో ఇక్కడికి ఆదోని, కౌతాళం, పెద్ద కడుబూరు, కోసిగి, ఆలూరు, మంత్రాలయం, ఆస్పరి, పత్తికొండ, హొళగుంద మండలాలకు చెందిన రైతులతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక రైతులు సైతం ఎరువుల కోసం ఇక్కడి వస్తుంటారు. ఇతర ప్రాంతాలకు చెందిన రైతుల సైతం వచ్చి కొనుగోలు చేస్తుండడంతో ఈ ప్రాంత రైతులకు ఎరువులు లభించక అవస్థలు పడుతున్నారు. డివిజన్‌లో 89వేల లక్షల హెక్టార్లకు పైగా వివిధ పంటలను సాగు చేశారు. ప్రధానంగా పత్తి, వరి, వేరుశనగ, మిరప పంటలకు ప్రస్తుతం యూరియా చాలా అవసరం. ప్రైవేటు వ్యాపారుల వద్ద యూరియా కావాలంటే లింకు ఎరువు కొనాల్సిందే. మరికొంతమంది కాంప్లెక్స్‌ ఎరువులకు సైతం లింకు అంటగడుతున్నారు. మరో వైపు సందట్లో సడేమియాగా రూ.80 నుంచి రూ.130 వరకు బస్తాపై అధికంగా రైతులకు విక్రయిస్తున్నారు. వ్యవసాయ అధికారులు సైతం తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు.

అరకొర నిల్వలు..

డీసీఎంఎస్‌, రైతు సేవా కేంద్రాలలో ఎమ్మార్పీ ధరకే విక్రయిస్తుండడంతో రైతులు అక్కడకు అధికంగా ఎరువులు కొనుగోలుకు మొగ్గు చూపుతారు. అక్కడ అవసరమైన ఎరువులు అందుబాటులో లేకపోవడంతో రోజూ పడిగాపులు కావలసిన పరిస్థితి. అరకొర నిల్వలు వస్తుండడంతో ఉదయమే ఆదోని మార్కెట్‌ యార్డ్‌లోని డీసీఎంఎస్‌ కేంద్ర వద్ద బారులు తీరుతున్నారు. గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల వ్యవసాయ శాఖ సిబ్బంది ఇటీవల బదిలీలు చేపట్టడంతో అక్కడ ఎరువులు అందుబాటులో లేవు. కొన్నిచోట్ల ఉన్న సిబ్బంది ఇంకా విధుల్లోకి చేరకపోవడంతో రైతులకు ఎరువుల కొరత ఏర్పడింది.

రెండు రోజులుగా తిరుగుతున్నా

మాకు 30 ఎకరాల పొలం ఉంది. పత్తి, మిరప వేశాం. వర్షాలు కురవడంతో పంట ఎదుగుదలకు యూరియా చాలా అవసరం. ఎరువులు దొరకక రెండు రోజులుగా డీసీఎంఎస్‌ వద్ద పడిగాపులు కాస్తున్నాం. ఉదయం నుంచి వచ్చి వరుసలో నిలబడి ఎరువులు తీసుకుంటున్నాం.

సరస్వతి, మహిళా రైతు, నాగనాతనహళ్లి

పంట దెబ్బతినే ప్రమాదం..

ఏడెకరాల పొలం ఉంది. 5 ఎకరాలు పత్తి, రెండు ఎకరాలు మిరపను సాగుచేశా. ఎరువులు దొరకడం లేదు. ప్రస్తుతం పంటలకు ఎరువులు చాలా అవసరం. సరైన ఎరువులు వేయకపోతే పంట దెబ్బతినే ప్రమాదం ఉంది.

దేవరాజు, సతేకూడ్లూరు

ఎరువుల కొరత లేదు

ఎరువుల కొరత లేదు. మార్క్‌ఫెడ్‌లో బఫర్‌ స్టాక్‌ కింద 1,843 మెట్రిక్‌ టన్నుల ఎరువు నిల్వ ఉంది. డీసీఎంఎస్‌ ఎప్పటికప్పుడు ఎరువులు కేటాయిస్తున్నాం. అక్కడ కొంతమంది ఇతర ప్రాంతాలకు చెందిన రైతులు రావడంతో ఇబ్బంది తలెత్తుతోంది. వీటితో పాటు గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల్లో రైతులకు 4500 బస్తాలు ఎరువులను అందుబాటులో ఉంచాం. ప్రైవేటు ఎరువుల దుకాణాల్లో లింక్‌ ఎరువుల రైతులకు అంటగడితే ఫిర్యాదు చేయొచ్చు.

సుధాకర్‌, మండల వ్యవసాయాధికారి, ఆదోని

Updated Date - Jul 11 , 2025 | 11:45 PM