జగమంతా రామమయం..!
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:56 PM
శ్రీరామ నామం నేడు అంతటా ప్రతిధ్వనించనుంది. ఆదివారం ‘శ్రీరామనవమి’ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

నేడు శ్రీరామనవమి
వైష్ణవ దేవాలయాల్లో సీతారాముల కల్యాణం
కర్నూలు కల్చరల్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): శ్రీరామ నామం నేడు అంతటా ప్రతిధ్వనించనుంది. ఆదివారం ‘శ్రీరామనవమి’ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లా కేంద్రాలతోపాటు జిల్లాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సీతారాముల కల్యాణ సందడి బాగా కానవస్తోంది. కల్యాణ వేడుకలకు ఆలయాల కమిటీల నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు చలువ పందిళ్లు నిర్మించారు. తీర్థ, ప్రసాదాల పంపిణీకి క్యూలైన్లు సిద్ధం చేశారు. వేసవిలో దాహార్తి తీర్చేందుకు మంచినీటి వసతి కల్పించారు. జిల్లాలో ఏటా శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు వైభవోపేతంగా నిర్వహిస్తుండగా, ఈ ఏడాది గ్రీష్మతాపం ఎక్కువగా ఉన్నా ఉత్సవాలకు ఎలాంటి లోటు లేకుండా ఘనంగా నిర్వహించనున్నారు.
నగరంలోని ఆలయాల్లో కల్యాణ వేడుకలు
నగరంలోని వైష్ణవ ఆలయాల్లో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయా ఆలయాల్లోని ఉత్సవ మూర్తులను కల్యాణానికి సిద్ధం చేశారు. పెద్ద పెద్ద పందిళ్లు వేసి, వాటి కింద కల్యాణ వేదికలు నిర్మించారు. భక్తులు ఈ వేడుకలు వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో సీతారాముల కల్యాణోత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కె. క్రిష్టన్న, నాగోజీరావు, మహాబలేష్ తెలిపారు. పాత నగరంలో అతి పురాతన దేవాలయం శ్రీరాంభొట్ల దేవాలయంలో, పాతనగరంలోని పేట శ్రీరామాలయం, కొత్తపేటలోని శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో కల్యాణ వేడుకలు నిర్వహించనున్నారు. అలాగే నగరంలోని బళ్లారి చౌరస్తాలోని హనుమాన్ దేవాలయం, వీఆర్ కాలనీలోగల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, బాపూజీ నగర్‌లోని కోదండ రామా లయంలో, మాధవీ నగర్, అశోకనగర్, ధర్మపేటలోని శ్రీ సీతారామ ఆలయాల్లో కల్యాణం జరగనుంది.