అధికారుల ఇష్టారాజ్యం
ABN , Publish Date - Nov 25 , 2025 | 01:17 AM
: ఇటీవల నగరంలో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభను సాకుగా చేసుకుని విద్యుత్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపి స్తున్నాయి.
మోదీ సభ పేరుతో వెంచర్‌లో విద్యుత్ లైన్
ఎస్‌ఈ దృష్టికి రావడంతో పరిశీలన
ఏడీఈ, ఏఈల నిర్లక్ష్యంపై మండిపడ్డ కర్నూలు ఎస్‌ఈ
కల్లూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఇటీవల నగరంలో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభను సాకుగా చేసుకుని విద్యుత్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపి స్తున్నాయి. సభకు వచ్చే వాహనాల పార్కింగ్ ప్రదేశాల్లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో భారీగా విద్యుదీకరణ పనులు చేపట్టారు. అందుకోసం వెయ్యికి పైగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు అంటున్నారు. ఈ సందర్భంగా కర్నూలు డివిజన్ పరిధిలోని ఏడీఈ, ఏఈ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు విమర్శలు వచ్చాయి. అక్టోబరు 16న మీటింగ్ జరిగితే నవంబరు 23 వరకు వెంచర్‌లో విద్యుదీకరణ లైన్లు ఆలాగే కొనసాగించడం వెనుక అధికారుల లోపాయికారి ఒప్పందం ఉండనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వెంచర్‌లో విద్యుత్ లైన్‌ను పరిశీలించిన ఎస్‌ఈ
అక్టోబరు 16న కర్నూలు జిల్లా నన్నూరు టోల్‌ప్లాజా సమీపంలోని రాగమయూరి వెంచర్‌లో భారీ బహిరంగసభ నిర్వహించారు. ప్రధాని సభను సాకుగా చూపి ఏకంగా ఓ వెంచర్ యాజమాన్యంతో అధికారులు కుమ్మక్కై దాదాపు 20 స్తంభాలతో లైన్ ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. కర్నూలు ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈకి ఫిర్యాదు అందడంతో ఆదివారం ఆ వెంచర్‌ను ఎస్‌ఈ ఆర్. ప్రదీప్ కుమార్, ఎస్‌ఏఓ చిన్నరాఘవులు, సివిల్ ఏడీఈతో కలిసి పరిశీలిం చారు. వెంచర్‌లో విద్యుదీకరణ పనులు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుండటంతో కర్నూలు డివిజన్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. కర్నూలు రూరల్స్ ఏడీఈ, ఓర్వకల్లు ఏఈలకు మెమో జారీ చేస్తానని ఆగ్రహం వ్యక్తం చేసి తక్షణమే విద్యుత్ లైన్లు తొలగించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం పనికి రాదని అధికారులపై మండిపడ్డారు.
ఎట్టకేలకు వెంచర్‌లో విద్యుత్ లైన్లు తొలగింపు
కర్నూలు ఆపరేషన్ ఎస్‌ఈ ఆర్. ప్రదీప్‌కుమార్ ఆదేశాల మేరకు ఎట్టకేలకు సోమవారం ఆ వెంచర్లో విద్యుత్ లైన్లను ఆదికారులు తొలగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడీఈ, ఏఈ సిబ్బందితో కలిసి మోదీ సభ ప్రాంతంలో ఉన్న స్తంభాలను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. ఈ అంశంపై స్థానిక అధికారును సంప్రదించగా స్తంభాలు చోరీకి గురవుతాయని వెంచర్లో లైన్ తొలగించలేదని సూచించడం గమనార్హం.
క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
మోదీ సభ ప్రాంగణానికి సమీపంలోని ఓ వెంచర్‌లో ఎస్టిటేషన్ లేకుండా విద్యుదీకరణ పనులు చేశారని ఫిర్యాదుతో ఆదివారం ఆ ప్రదేశాన్ని పరిశీలించాను. దాదాపు 40 రోజులు లైన్లు అక్కడే ఉన్నాయి. తక్షణమే విద్యుత్ స్తంభాలను తొలగించాలని ఏడీఈ, ఓర్వకల్లు ఏఈలను ఆదేశించాం. ఆ ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. వాటిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఆదేశించాం. - ప్రదీప్‌కుమార్, ఎస్‌ఈ