Share News

వలస బాటన పశ్చిమం

ABN , Publish Date - Jul 14 , 2025 | 11:47 PM

వలస బాటన పశ్చిమం

వలస బాటన పశ్చిమం
కోసిగి 9వ వార్డు కాలనీ నుంచి తెలంగాణకు వలస వెళ్తున్న కూలీలు

కోసిగి నుంచి 30 కుటుంబాలు

ఇప్పుడిప్పుడే ఖరీఫ్‌ మొదలైంది. వానలు నమ్మకం కలిగించడం లేదు. పంటలు పండి పూట గడుస్తుందనే భరోసా కలగడం లేదు. సీజన్‌ మొదలు కాకముందే వ్యవసాయం నిరాశను మిగిల్చింది. ఊళ్లో బతకడం కష్టమని తేలిపోయింది. పశ్చిమ ప్రాంతం నుంచి ప్రజలు తెలంగాణకు వలస బాట పట్టారు.

కోసిగిలోని 9వ వార్డు గాంధీనగర్‌ కాలనీకి చెందిన సుమారు 30 కుటుంబాలు సోమవారం పిల్లాపాపలతో కలిసి మూటముల్లె సర్దుకుని తెలంగాణకు వ్యవసాయ పనులకు బయల్దేరారు. కోసిగి కరువుకు, వలసకు పుట్టినిల్లు. ఏటా వలస మీదే మండల ప్రజలు ప్రధానంగా బతుకుతున్నారు. ఎక్కడ కూలి పనులు ఉంటే అక్కడికి సంసారమంతా తరలిపోతుంది. ఈ ఏడాడి ఖరీఫ్‌ ఆరంభంలోనే వలస తప్పలేదు. పక్క రాష్ట్రంలో కూలీ ఎక్కువగా ఇస్తుండటంతో వెళ్తున్నామని కూలీలు అన్నారు. ఏటా నవంబరు, డిసెంబరు మధ్యలో వలసలు ప్రారంభమయ్యేవి. ఈసారి అప్పుడే ఇండ్లకు తాళాలు పడ్డాయి. - కోసిగి (ఆంధ్రజ్యోతి)

అధిక కూలి వస్తుందని వలస వెళ్తున్నాం

ఇక్కడ పని చేసే కూలీకి రూ.200 నుంచి రూ.300 కూలి వస్తుంది. పక్క రాష్ట్రంలో రూ.500 నుంచి రూ.800 దాకా కూలి ఇస్తున్నారని తెలిసింది. అందుకే భార్యా పిల్లలను వెంట బెట్టుకుని పోతున్నా.

- తోళ్ల ఉరుకుందు

అందరం ఒకే చోట పని చేస్తాం

మా కుటుంబం అందరం కలిసి ఒకే చోట కూలి చేస్తే డబ్బులు ఎక్కువగా వస్తాయి మూడు నెలలు కష్టపడితే రూ.లక్ష దాకా సంపాదించుకుంటాం.

- కోసిగి అంజినమ్మ - 9వ వార్డు, కోసిగి

Updated Date - Jul 14 , 2025 | 11:47 PM