Share News

కల్యాణం.. నృసింహుడి వైభోగం..

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:09 AM

నమో నారసింహా.. ఉగ్రం వీరం మహావిష్ణుం అంటూ భక్తజనం స్మరిస్తుండగా దిగువ అహోబిల క్షేత్రంలో లక్ష్మీ నృసింహ స్వామి కల్యాణోత్సవం బుధవారం రాత్రి నయనానందకరంగా జరిగింది.

కల్యాణం.. నృసింహుడి వైభోగం..
మాంగల్యం చూపుతున్న ఆలయ ప్రధాన అర్చకులు

‘దిగువ’ అహోబిలంలో ఘనంగా కల్యాణోత్సవం

ఎగువ అహోబిలంలో తొట్టి తిరుమంజనం

అశ్వ వాహనంపై విహరించిన జ్వాలా నరసింహస్వామి

ఆళ్లగడ్డ(శిరివెళ్ల), మార్చి 12(ఆంధ్రజ్యోతి): నమో నారసింహా.. ఉగ్రం వీరం మహావిష్ణుం అంటూ భక్తజనం స్మరిస్తుండగా దిగువ అహోబిల క్షేత్రంలో లక్ష్మీ నృసింహ స్వామి కల్యాణోత్సవం బుధవారం రాత్రి నయనానందకరంగా జరిగింది. అహోబిల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలంలో వేదపండితులు ముందుగా స్వామి, అమ్మవారికి నవకలశ తిరుమంజనం, విశేష పూజలు నిర్వహించారు. తిరు నక్షత్రం సందర్భంగా అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీవణ్‌ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ స్వామివారిని పుష్ప పల్లకిలో ఆలయ మాడవీధుల్లో ఉత్సవం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామివారి కల్యాణోత్సవానికి పట్టువస్ర్తాలు, మహాప్రసాదాన్ని అధికారులు అహోబిల మఠం పీఠాధిపతికి అందజేశారు. శ్రీదేవీ భూదేవి సమేత ప్రహ్లాద వరదస్వామి ఉత్సవమూర్తులకు అర్చకులు శాస్త్రోక్తంగా ఉదయం అభిషేకం, సాయంత్రం గజ వాహన సేవ, గ్రామోత్సవం నిర్వహించారు.

రమణీయం.. ప్రహ్లాద వరదుడి కల్యాణం

దిగువ అహోబిల క్షేత్రంలో ప్రహ్లాద వరదస్వామి, అమృతవల్లి అమ్మవారి కల్యాణం రమణీయంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలు, వివిధ రకాల పూలమాలలతో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలా అలంకరించి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా ఎదుర్కోళ్లు నిర్వహించారు. పద్మశాలి సంఘం తరపున పడకండ్లకు చెందిన కోటా రామయ్య, శారద దంపతులు కల్యాణోత్సవానికి ఉభయదారులుగా వ్యవహరించి స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకలను పీఠాధిపతితోపాటు ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన్‌, మణియార్‌ సౌమ్యనారాయణన్‌, మేనేజర్‌ మురళీధరన్‌, సంపత్‌ కుమార్‌స్వామి, బాలసుబ్రమణ్యం పర్యవేక్షించారు.

అశ్వ వాహనంపై శ్రీవారు

ఎగువ అహోబిలంలో జ్వాలా నృసింహస్వామి బుధవారం అశ్వ వాహనంపై విహరించారు. ఉభయదేవేరులతో కొలువైన స్వామివారిని విశేషంగా అలంకరించి సంప్రదాయబద్దంగా ఉత్సవం నిర్వహించారు. ఆలయ యాగశాల ప్రాంగణంలో వేదమంత్రోచ్ఛారణలతో అర్చకులు సాయంత్రం తొట్టి తిరుమంజనం నిర్వహించారు. రాత్రి జ్వాలా నరసింహ స్వామిని అశ్వ వాహనంపై కొలువుంచి మేళతాళాల మధ్య ఆలయ మాడవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.

‘ఎగువ’లో నేడు రథోత్సవం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో గురువారం వైభవంగా రథోత్సవం నిర్వహించనున్నారు. వేలాది మంది భక్తులు హాజరుకానుండడంతో నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేపట్టారు. దిగువ అహోబిల క్షేత్రంలో కాళింగనర్తనోత్సవం, శ్రీదేవీ, భూదేవీ సమేత ప్రహ్లాదవరదస్వామి ఉత్సవమూర్తులకు అభిషేకం, తొట్టి తిరుమంజనం నిర్వహిస్తారు. ప్రహ్లాదవరదుడు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.

Updated Date - Mar 13 , 2025 | 12:09 AM