ఉధృతం ఆదోని ఉద్యమం
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:02 AM
ఉధృతం ఆదోని ఉద్యమం
35వ రోజుకు చేరిన రిలే దీక్షలు
ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో పెరుగుతున్న ఆందోళన
మద్దతుగా కలెక్టరేట్ వద్ద విద్యావంతుల వేదిక నిరసన
సీఎం చంద్రబాబును కలిసేందుకు జేఏసీ సన్నాహాలు
రేపు వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల రిలే దీక్షకు ప్రణాళిక
ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. నెల రోజుల క్రితం ఆదోనికే పరిమితమైన జిల్లా సాధన ఉద్యమాలు ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలకు విస్తరించాయి. పల్లెకు సైతం చేరాయి. కరువు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక జిల్లా ఎంతో అవసరమనే సెంటిమెంటు జనాల్లో బలపడింది. ఫలితంగా ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఆదోనిలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 35వ రోజుకు చేరుకున్నాయి. ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరులో సైతం రిలే దీక్షలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. అదే క్రమంలో ప్రజల ఆకాంక్షను గుర్తించిన కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సీఎం చంద్రబాబును కలిసి జిల్లాపై నిర్ణయం తీసుకునేలా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అదే క్రమంలో అందివచ్చిన అవకాశాన్ని రాజకీయంగా సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ ఎత్తులు వేస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సోమవారం ఆదోని కేంద్రంగా రిలే నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధ్దమయ్యారు.
కర్నూలు, డిసెంబరు 20 ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనకు మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. రాష్ట్రంలో ఆయా జిల్లాల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మంత్రివర్గ ఉప సంఘం అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. దీంతో ఆ రోజు నుంచే ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలను కలిపి ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. అదే క్రమంలో ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారధి ఆదోని జిల్లా ఏర్పాటు అవసరంపై అసెంబ్లీలో గళమెత్తారు. పలువురు ప్రజాసంఘాల నాయకులు వినతి పత్రాలు సైతం అందజేశారు. మంత్రివర్గం ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు జిల్లాలను మాత్రమే కొత్తగా ఏర్పాటు చేసేందుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ గెజిట్‌లో ఆదోని జిల్లా లేకపోవడంతో ఒక్కసారిగా ప్రజలు ఆందోళనల వైపు అడుగులు వేశారు. జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉద్యమాలు, నిరసనలు రిలే నిరాహారదీక్షలు, బంద్‌లు ఇలా వివిధ రూపాల్లో జిల్లా డిమాండ్ ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ పార్టీలు, పలు ప్రజాసంఘాలు, జర్నలిస్టు సంఘాలు సైతం జిల్లా సాధనకు మద్దతుగా రిలే నిరాహారదీక్షలో కూర్చున్నారు. శనివారం నాటికి జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 35వ రోజుకు చేరుకున్నాయి. ఆదోనిలో మొదలు పెట్టిన ఈ ఉద్యమం ఐదు నియోజకవర్గాలకు పాకింది. ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరులో సైతం గత పదిహేను రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. జేఏసీకి మద్దతుగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కుతున్నాయి. ఉద్యమ తీవ్రత పెరుగుతుండటంతో కూటమి పార్టీలోనూ, ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది.
ఆదోని జిల్లాకు మద్దతుగా విద్యావంతుల వేదిక
నిత్యం కరువు, వలసలతో తల్లడిల్లే పశ్చిమ ప్రాంత పల్లెసీమలు అభివృద్ధి చెందాలంటే ఆదోని జిల్లా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షను గౌరవించి ప్రభుత్వం ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద శనివారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆ వేదిక కో కన్వీనర్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యావంతుల వేదిక కన్వీనర్ అరుణ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, జన విజ్ఞాన వేదిక నాయకులు శ్రీరాములు, ఎస్‌డీపీఐ నాయకులు చాంద్‌బాషా, ప్రజాభ్యుదయ సంఘం నాయకులు దుర్గప్ప, బుడగ జంగాల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు తూర్పాటి మనోహర్ తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదోని ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి, తక్షణమే జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సీఎం చంద్రబాబును కలవనున్న కూటమి నేతలు:
ఆదోని జిల్లా సాధన ఉద్యమం ఉధృతం కావడం.. ప్రజల్లో సెంటిమెంటు బలపడటంతో వారి ఆకాంక్షకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అధికార కూటమి నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లాల పునర్విభజన మంత్రివర్గ ఉప సంఘం కన్వీనర్ అనగాని సత్యప్రసాద్‌లను కలిసి ప్రజల ఆకాంక్షను వినిపించారు. తాజాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారధి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి కే. మీనాక్షి నాయుడు జేఏసీ నాయకులతో కలిసి సీఎం చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అపాయింటుమెంటు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అదే క్రమం లో బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు మాధవ్‌తో కూడా సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదోని జిల్లా డిమాండ్‌కు మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు సైతం మద్దతు తెలిపారు.
రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ఎత్తు
ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ ప్రజల్లో బలపడటంతో దానిని రాజకీయంగా వాడుకునేందుకు ప్రతిపక్ష వైసీపీ నేతలు ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే ఆదోనిలో దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. సోమవారం వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రిలే నిరాహారదీక్షలో కూర్చోవడానికి ప్రయత్నిస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా.. జిల్లాలను పునర్విభజించింది. 13 జిల్లాలను 26 జిల్లాలు చేసింది. ఆ సమయంలో అడిగి ఉంటే.. ఆదోని జిల్లా ఏర్పాటుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పట్లో జిల్లా సాధన కోసం ఏబీవీపీ లాంటి విద్యార్థి సంస్థలు గళమెత్తితే వారి నోరు మూయించారే తప్ప ఆదోని జిల్లా కోసం నాడు వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు జగన్‌ను అడగలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండటం, ఉద్యమం ఉధృతం కావడంతో ఆ పార్టీ నాయకులు రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వ్యూహాలు పన్నుతున్నారు. అందులో భాగంగానే సోమవారం దీక్షలకు సిద్ధం అవుతున్నారు.