మృత్యు‘మలుపులు’..!
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:50 PM
మృత్యు‘మలుపులు’..!
ఎన్‌హెచ్-167పై ప్రమాదకరంగా కోటేకల్లు మలుపులు
నిత్యం ప్రమాదాలు
ఐదేళ్లలో 20 మందికి పైగా దుర్మరణం
ఆ ప్రాంతంలో నాలుగు లైన్ రోడ్డు, డివైడర్లు ఏర్పాటు చేయాలి
జాతీయ రహదారి-167 నిత్యం రక్తసిక్తమవుతోంది. ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. కోటేకల్లు సమీపంలోని రెండు మలుపులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. గడిచిన ఐదారేళ్లలో ఈ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 25 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇటీవల నవంబరు 2న ఆదోని మండలం కపటి గ్రామానికి చెందిన కూలీలు పొట్టచేత పట్టుకొని పత్తితీసే పనులకు ఓ ఆటోలో వెళ్లారు. కోటేకల్లు గ్రామ సమీపంలోని బాడయ్య చేను మలుపు వద్దకు ఎదురుగా వస్తున్న మినీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఇద్దరు మృతి చెందారు. 11 మంది గాయపడ్డారు. ఈ రక్తపు మరకలు చెదిరిపోక ముందే.. అక్కడికి కిలోమీటరు దూరంలోని కాశిరాళ్లమెట్ట మలుపు వద్ద శనివారం అర్థరాత్రి 4.30 గంటల సమయంలో రెండు కార్లు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కర్ణాటక వాసులు మృతి చెందారు. ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు, ప్రజా ప్రతినిధులు రావడం, దిగ్ర్భాంతి వ్యక్తం చేయడం.. ఆ తరువాత మర్చిపోవడం అంతా మామూలైంది. ఆరేకల్లు నుంచి కోటేకల్లు వరకు నాలుగు లైన్లు రోడ్డుగా విస్తరించి, డివైడరు ఏర్పాటు చేస్తే కొంతైనా ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని స్థానికులు అంటున్నారు. జిల్లాలో జాతీయ రహదారులు నెత్తుటి దారులుగా మారుతున్న తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో హైదరాబాద్ - బెంగళూరు వయా కర్నూలు జాతీయ రహదారి-44, కర్నూలు - చిత్తూరు వయా నంద్యాల జాతీయ రహదారి-40, బళ్లారి-కోదాడ వయా ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం జాతీయ రహదారి-167 ఉన్నాయి. అడ్డూఅదుపు లేని వేగం, నిర్లక్ష్యం, రహదారి నిర్వహణ లోపాలు వెరసి జాతీయ రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. కర్నూలు నగరానికి సమీపంలో కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో ఈనెల 24న రోడ్డుపై పడిన బైక్‌పై నిర్లక్ష్యంగా వి.కావేరి ట్రావెల్ బస్సు వెళ్లడంతో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతైన ఘోర విషాద ఘటన మరవకనే.. ఎమ్మిగనూరు మండలం కోటేకల్లు వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కన్నడిగులు దుర్మరణం పాలయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టలేదు. కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ 2014-15 మధ్యలో అప్పటి ప్రభు త్వం బళ్లారి సమీపంలో ఉన్న హగరి నుంచి తెలంగాణలోని కోదాడ వరకు హాలహర్వి, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, రాయచూరు, మహబూబ్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, దేవరకొండ మీదుగా జాతీయ రహదారి-167 నిర్మించారు. జిల్లాలో హాలహర్వి మండలం చింతకుంట నుంచి మాధవరం వరకు 99.15 కిలో మీటర్లు ఉంది. నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారింది. ఆలూరు సమీపంలో హనుమాన్ సర్కిల్ వద్ద, ఆదోని మండలం బైచిగేరి క్రాస్, ఆరేకల్లు వద్ద, ఎమ్మిగనూరు మండలం కోటేకల్లు గ్రామ పరిధిలో కాశిరాళ్లమెట్ట మలుపు, బాడయ్య చేను మలుపు, ఎమ్మిగనూరు పట్టణంలో అన్నమయ్య, ఓంశాంతి, మార్కెట్ యార్డు కూడళ్లు, ముగతి సర్కిల్, మంత్రాయలం మండలం కలుదేవకుంట, చెట్నేపల్లి, మాధవరం కూడలి ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుంతో..? ఏ వాహనం ఢీకొడుతుందో..? అంటూ ప్రజలు నిత్యం భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు.
ప్రమాదాకరంగా కోటేకల్లు మలుపులు:
ఎన్‌హెచ్-167పై ఆరేకల్లు - కోటేకల్లు గ్రామాల మధ్యలో నాలుగైదు కిలో మీటర్లు దూరం ఉంటుంది. కోటేకల్లు గ్రామ పరిధిలో బాడయ్య చేను క్రాసింగ్ (మలుపు), కాశిరాళ్లమెట్ట మలుపు అత్యంత ప్రమాదకంగా ఉన్నాయని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ఇక్కడ తరచూ ఏదో ఒక ప్రమాదం జరుగుతోంది. గత ఐదారేళ్లలో ఆటోలు, కార్లు, లారీలు, మోటర్‌బైక్ ప్రమాదాల్లో 20 మందికి పైగానే దుర్మరణం చెందారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. తెల్లారగానే ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందో అంటూ ఆవేదన చెందుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు చేపడుతామని అధికారులు, ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వడం, ఆ తర్వాత మర్చిపోవడం మామూలైందని స్థానికులు వాపోతున్నారు.
ప్రమాదాలు నివారించాలంటే..
ఆరేకల్లు - కోటేకల్లు మధ్య జాతీయ రహదారి-167ని నాలుగు లైన్ల రహ దారిగా విస్తరించి మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా నిత్యం ప్రమా దాలు జరిగే రెండు మలుపులు వద్ద వాహనాలు వేగం తగ్గించే చర్యలు కఠినంగా అమలు చేయాలి.
నిత్యం నేషనల్ హైవే పెట్రోలింగ్ పర్యవేక్షణ ఉండాలి. అర్థరాత్రి తరువాత ఉదయం వరకు కోటేకల్లు మలుపుల వద్ద పెట్రోలింగ్ విస్తృతం చేయాలి.
ఎమ్మిగనూరు పట్టణం, మంత్రాలయం, మాధవరం వద్ద గ్రామాల్లో వాహ నాలు వెళ్లకుండా తక్షణమే బైపాస్ రోడ్డు నిర్మాణాలు చేపట్టాలి. ఎమ్మిగనూరు, మంత్రాలయం బైపాస్ రోడ్డు ప్రతిపాదన దశలోనే మగ్గుతున్నాయి.
కాశిరాళ్లమెట్ట మలుపు వద్ద ఇరువైపు అటవీశాఖ భూముల్లో దట్టంగా చెట్లు పెరగడంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనిపించడంతో ప్రమాదాలకు జరుగుతున్నాయి. వాహనాలు కనిపించేలా చెట్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
బ్లాక్ స్పాట్లు ఇవే
హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారి-44: కర్నూలు నగరం సంతోష్ నగర్, చిన్నటేకూరు, ఉల్లిందకొండ క్రాస్, దత్తాత్రేయస్వామి ఆలయం సమీపంలో, వెల్దుర్తి సర్కిల్ ఆంజనేయస్వామి విగ్రహం, మదార్‌ఫురం, ప్యాపిలి క్రాస్ రోడ్డు, కర్నూలు నగర శివారులో వెంకన్నబావి ప్రాంతం.
బళ్లారి-కోదాడ జాతీయ రహదారి-167: ఆలూరు సమీపంలో హనుమాన్ సర్కిల్, ఆదోని మండలం బైచిగేరి క్రాస్, ఆరేకల్లు వద్ద, ఎమ్మిగనూరు మండలం కోటేకల్లు పరిధిలో కాశిరాళ్లమెట్ట, బాడయ్య చేను మలుపులు, ఎమ్మిగనూరు పట్టణంలో అన్నమయ్య, ఓంశాంతి, మార్కెట్ యార్డు కూడళ్లు, ముగతి సర్కిల్, మంత్రాలయం మండలం కలుదేవకుంట, చెట్నేపలి, మాధవరం కూడలి.
కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారి-40: ఓర్వకల్లు, శాంతిరాం కళాశాల వద్ద, అయ్యలూరుమెట్ట కూడలి, యర్రగుంట్ల, శిరివెళ్ల, పెద్దభోదనం, కూలూరు, మద్దూరు, ఆళ్లగడ్డలోకి వెళ్లే మార్గాల కూడళ్లను బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు.
కోటేకల్లు మలుపుల వద్ద జరిగిన ప్రమాదాలు కొన్ని
కోటేకల్లు గ్రామ సమీపంలో బాడయ్య చేను మలుపు వద్ద 2018 జనవరి 2న టాటా ఏసీ ఆటోను ట్రక్ ఢీకొన్న ప్రమాదంలో ఐదురుగు మృత్యు వాత పడ్డారు. వారిలో ముగ్గురు కోటేకల్లు గ్రామస్తులు, ఇద్దరు బనవాసి ఫారం, ఎమ్మిగనూరుకు చెందిన వారున్నారు.
ఇదే మలుపు ప్రాంతంలో ఐదేళ్లు క్రితం రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో బెంగళూరుకు చెందిన ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఆ తరువాత వేర్వేరు ప్రమాదాల్లో మరో ఇద్దరు దుర్మరణం చెందారు.
కోటేకల్లు ఫారెస్ట్ వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆదోనికి చెందిన టీడీపీ నాయకురాలి సమీప బంధువు ఒకరు మృతి చెందారు.
అక్టోబరు 10న కోటేకల్లు గ్రామం వద్ద అటవీ శాఖ ఏర్పాటు చేసిన సిటీ ఫారెస్ట్‌ను తిలకించి బైక్‌పై భార్యాభర్తలు, కొడుకు ఆదోనికి వెళ్తుండగా కాశిరాళ్లమెట్ట పలుపు వద్ద బైక్‌ను వెనుక నుంచి ఓ వాహనం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు.
రక్తం చిందిస్తున్న జాతీయ రహదారులు
ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారుల్లో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రవాణా శాఖ అధికారుల్లో అలసత్వం, సిబ్బంది కొరత, పోలీసులు శాంతి భద్రత పర్యవేక్షణకే పరిమితం కావడం ప్రమాదాల నివారణ సాధ్యం కావడం లేదు. అనుభవం లేని డ్రైవర్లు, అవగాహన లోపం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మానవ తప్పిదాల వల్లే 95 శాతం ప్రమాదాలు జరిగితే, డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల 75 శాతం, మరో 25 శాతం రోడ్లు, వాహనాల మరమ్మతుల కారణంగా జరుగుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ఏడాది కాలంలో ఉమ్మడి జిల్లాలో 1,250కి పైగా ప్రమాదాలు జరిగాయి. 550 మందికి పైగా మృత్యువాత పడ్డారని సమచారం.
రోడ్డు డివైడర్లు ఏర్పాటు చేయాలి
ఆరేకల్లు ఉంచి కోటేకల్లు వరకు జాతీయ రహదారిని విస్తరించి డివైడర్లు వేయాలి. అప్పుడే కొంతైనా ప్రమాదాలు నివారించవచ్చు. నేషనల్ హైవే ఇంజనీర్లు స్పందించి డివైడర్లు ఏర్పాటు చేయాలి.
జె. లక్ష్మన్న, కోటేకల్లు గ్రామం, ఎమ్మిగనూరు మండలం