Share News

ముంచేసిన ‘మొంథా’

ABN , Publish Date - Oct 28 , 2025 | 11:52 PM

మొంథా తుఫాన్‌ జిల్లా రైతాంగాన్ని ముంచేసింది.

ముంచేసిన ‘మొంథా’
కోసిగి మండలం సాతనూరులో నేలపాలైన వరి పైరు

జిల్లా అంతటా తుఫాన్‌ ప్రభావం

ముసురుకున్న పల్లెసీమలు

పలు మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు

మిరప, కంది, వరి పంటలపై ప్రభావం

2వేల ఎకరాల్లో నేలవాలిన వరి పైరు

బెంబేలెత్తిపోతున్న రైతాంగం

295.2 మిల్లీ మీటర్ల వర్షపాతం

అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

మొంథా తుఫాన్‌ జిల్లా రైతాంగాన్ని ముంచేసింది. కష్టజీవుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే అధిక వర్షాలతో సుమారుగా రూ.2వేల కోట్లకు పైగా విలువైన పత్తి దిగుబడులు రైతులు కోల్పోయారు. తాజాగా మొంథా రూపంలో మరో ముప్పు వచ్చిపడింది. పత్తి సహా కంది, వరి, మిరప, పప్పుశనగ పంటలు తీవ్రంగా దెబ్బతింటాయని, అపార నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని రైతులు బెంబేలెత్తి పోతున్నారు. తుఫాన్‌ దెబ్బకు కందనవోలు పశ్చిమ ప్రాంతం కరువు రైతులు నిలువునా మునిగే పరిస్థితి నెలకొంది. జిల్లాపై మొంథా తుఫాన్‌ తీవ్ర ప్రభావం ఉండకపోవచ్చని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవడానికి కలెక్టర్‌ ఏ. సిరి జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు.

కర్నూలు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ముంచుకొస్తున్న ‘మొంథా తుఫాన్‌’ అన్నదాతల నెత్తిన పిడుగులా పడబోతుంది. జిల్లాలో 26 మండలాల్లో సాధారణ సాగు విస్తీర్ణం 4.22 లక్షల హెక్టార్లు కాగా 2025-26 ఖరీ్‌ఫలో 4.25 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగుచేశారు. అత్యధికంగా 2.25 లక్షల హెక్టార్లలో పత్తి సాగుచేశారు. కంది, వరి, మిరప, టమోటా, మొక్కజొన్న, సజ్జ పంటలు సాగు చేశారు. సగటున ఎకరాకు రూ.50 వేలు ప్రకారం హెక్టారుకు రూ.1.25 లక్షలు సాగు ఖర్చు చేశారు. ఈలెక్కన రూ.5,315 కోట్లకు పైగా పెట్టుబడి రూపంలో కష్టజీవులు మట్టిలో పోశారు. దిగుబడులు చేతికొచ్చే సమయంలో భారీవర్షాలు నిలువునా ముంచేశాయి. ఇప్పటికే పత్తి రైతులు రూ.2 వేల కోట్లకు పైగా విలువైన పత్తి దిగుబడులు రైతులు కోల్పోయారు. పెట్టుబడి అప్పులు తీర్చేందుకు సుగ్గిబాటన జిల్లా సరిహద్దులు దాటేందుకు సన్నద్ధమవుతున్నారు. వేలాది కుటంబాలు తెలంగాణ, గుంటూరు ప్రాంతాలకు వలస వెళ్లారు.

నేలపాలైన వరి

‘మొంథా’ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కోసిగి మండలం తుమ్మిగనూరు, సాతనూరు, కందుకూరు, కడదొడ్డి, అగసనూరు గ్రామాల్లో దాదాపుగా 2వేల ఎకరాలకు పైగా వరి పైరు నేల వాలింది. త్వరలో కోతలకు సిద్ధమవుతుండగా మొంథా తుఫాన్‌ నిలువున ముంచేసింది. చేతికొచ్చిన పంట నేలపావడంతో గింజలు మొలకెత్తి దిగుబడి సగానికి పైగానే నష్టపోతామని రైతులు వాపోతున్నారు. కోసిగి మండలంలో ఒక్కటే కాదు. తుంగభద్ర తీరంలో మంత్రాల యం, నందవరం, సి.బెళగల్‌, కర్నూలు రూరల్‌ మండలాలు, తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ) కింద వరి సాగుచేసిన హాలహర్వి, హోళగుంద, ఆదోని, కౌతాళం, పెద్దకడుబూరు, ఎమ్మిగనూరు, గోనేగండ్ల మండలాల్లో వరి రైతులు మొంథా తుఫాన్‌కు తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఈఏడాది 12,500 హెక్టార్లలో వరి ధాన్యం పంటను సాగుచేశారు. తుఫాన్‌ ప్రభావంతో త్రీవంగా నష్టపోతామని రైతులు ఏకరువు పెడుతున్నారు.

మిరపకు కుళ్లు తెగులు

హాలహర్వి మండలం గూళ్యం, జె.హోసల్లి, బాపురం, నెట్రవట్టి, చింతకుంట తదితర గ్రామాల్లో ఎల్లెల్సీ కాలువ కింద దాదాపు 5 వేల ఎకరాల్లో మిరప సాగు చేశారు. ప్రస్తుతం పూత, పిందె దశలో పైరు ఉంది. మొంథా తుఫాన్‌ వల్ల తేమ ఎక్కువై కుళ్లు తెగులు వ్యాపిస్తుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే పూత, పిందెలు రాలిపోతున్నాయని కన్నీరు పెడుతున్నారు. అధిక వర్షాలకు కుళ్లు తెగులు, ఆకుముడత తెగులు వ్యాపిస్తుందని అంటున్నారు. ఈ ఏడాది జిల్లాలో 15-20 వేల హెక్టార్లలో సాగు చేశారు. తుఫాన్‌ నిలువున ముంచేస్తుందని అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు.

తేమ ఎక్కువై..

ఈఏడాది కంది 39వేల హెక్టార్లు, ఆముదం 9వేలు, పొగాకు 100, టమోటా 2,500 హెక్టార్లలో సాగు చేశారు. కంది పంట పూత, కాయ దశలో ఉంది. తేమ ఎక్కువైతే పూత రాలిపోతుంది. టమోటా పైరు కుళ్లిపోతుందని కష్జజీవులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో ఉద్యానవన పంటలు సుమారుగా 35 వేల హక్టార్లలో సాగులో ఉన్నాయి. తుఫాన్‌ ప్రభావంతో ఆ పంటలు సైతం తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

21 మండలాల్లో వర్షం

జిల్లాలో 26 మండలాల్లో 21 మండలాల్లో మొంథా తుఫాన్‌ ప్రభావంతో వర్షం కురిసింది. 295.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 11.4 మిల్లీమీటర్లు నమోదైందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా కోసిగి మండలంలో 42.4 మిుల్లీ మీటర్లు వర్షం కురిసింది. కౌతాళం మండలంలో 34.4, ఆస్పరిలో 33.2 ఆదోనిలో 29.2, తుగ్గలిలో 29, పత్తకొండలో 26.2 ఆలూరులో 22.4, కల్లూరులో 19.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాంతటా ముసురు కమ్మేసింది.

అధికారులతో సమీక్షలు..

మొంథా తుఫాన్‌ను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. కలెక్టర్‌ ఏ.సిరి ఇప్పటికే ఆయా శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. లోతట్టు, తుంగభద్ర నదీతీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. మంగళవారం తుఫాన్‌ ప్రభావం జిల్లాపై పెద్దగా లేదు. బుధవారం ప్రభావం చూపినా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

ఎంత కష్టం.. ఎంత నష్టం

కర్నూలు అగ్రికల్చర్‌: జిల్లాలో మొంథా కకావికలం కొనసాగుతోంది. సాధారణ సాగు విస్తీర్ణం 4,22,540 హెక్టార్లు కాగా, సెప్టెంబరు ఆఖరు నాటికి రూ.3,46,495 (82 శాతం) హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. 2,19,636 హెక్టార్లలో పత్తి సాగైంది. వరి 9,120 హెక్టార్లు, సజ్జ 5,749 హెక్టార్లు, మొక్కజొన్న 7,201 హెక్టార్లు, కొర్ర 2858 హెక్టార్లు, కంది 39,531 హెక్టార్లు, వేరుశనగ 28,453 హెక్టార్లు, ఆముదం 9,306 హెక్టార్లు, ఉల్లి 11,056 హెక్టార్లు, ఇతర పంటలు 23,486 హెక్టార్లు తదితర అన్ని పంటలు కలిపి 3,46,495 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ప్రధానంగా పత్తి రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఈసారి ముందస్తు వర్షాలతో మే చివరి వారంలోనే పత్తిని రైతులు సాగు చేశారు. తక్కువ వ్యవధిలోనే పత్తి చేతికందుతుందని, మంచి ధరకు అమ్ముకుందామని రైతులు ఆశించారు. అయితే రోజూ కురుస్తున్న వానలతో తెగుళ్లు, క్రిమికీటకాలు రైతులను దారుణంగా దెబ్బతీశాయి. ఒక ఎకరాలో పత్తి దిగుబడి ఈసారి 15 క్వింటాళ్లకు పైగా వస్తుందని రైతులు ఆశించారు. అయితే.. కేవలం 8 నుంచి 10 క్వింటాళ్ల దాకా మాత్రమే రైతులకు అందింది. చేతికందిన పత్తిని అమ్ముకునేందుకు అవకాశం లేకుండా పోయింది. సీసీఐ అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రెండు నెలలు జాప్యం చేయడంతో దాదాపు 50 శాతం పత్తిని రైతులు గ్రామాల్లోనే వ్యాపారులకు క్వింటం పత్తిని రూ.6వేల నుంచ రూ.6,500కు అమ్ముకుని నష్టపోయారు. క్వింటం ఉల్లిని రూ.300-400కు అమ్మాలని వ్యాపారులు డిమాండ్‌ చేయడంతో రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కావని రైతులు పొలాల్లోనే పశువుల మేతకు వేశారు. మొక్కజొన్న రైతులు ఆరబెట్టుకునే అవకాశం కూడా లేకుండా వానలు తీవ్ర నష్టపరిచాయి.

ఇరవై ఎకరాల్లో వరి నేలపాలు

25 ఎకరాల్లో వరి సాగు చేశా. రూ.20లక్షల వరకు పెట్టుబడి పెట్టా. పైరు ఏపుగా పెరిగింది. వారం రోజుల్లో వరి కోతకు సిద్ధం చేసుకుంటున్నాం. మొంథా తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు 20 ఎకరాల్లో చేతికొచ్చిన పైరు నేలపాలైంది. రూ.15 లక్షలు మేర పెట్టుబడి మట్టిపాలైంది.

రంగస్వామి, వరి రైతు, సాతనూరు, కోసిగి మండలం

కష్టాలు తీరుతాయనుకుంటే..

ఎల్లెల్సీ కాలువ కింద ఐదెకరాల్లో మిరప సాగు చేశా. పూత, పిందె, కాయ దశలో ఉంది. తుఫాన్‌ ప్రభావంతో తేమ ఎక్కువై కుళ్లు తెగులు వ్యాపించింది. రెండేళ్లుగా గిట్టుబాటు ధరలేక అప్పుల పాలయ్యా. ఈఏడాదైనా కష్టాలు తీరుతాయనుకుంటే అధిక వర్షాలు ముంచేశాయి.

బసవన్నగౌడ్‌, బల్లూరు, హాలహర్వి మండలం

Updated Date - Oct 28 , 2025 | 11:52 PM