Share News

వాగులు ఉప్పొంగాయి..

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:13 AM

వాగులు ఉప్పొంగాయి..

వాగులు ఉప్పొంగాయి..
శివపురం పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఎక్కడి ప్రజలు అక్కడే నిలిచిపోయిన దృశ్యం

పొంగి ప్రవహిస్తున్న పెద్దవాగు, సుద్దవాగు

పలు గ్రామాలు, మండలాలకు నిలిచిన రాకపోకలు

స్తంభించిన జనజీవనం

ప్రమాదం అని తెలిసినా తప్పని ప్రయాణం

కొత్తపల్లి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఐదు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నల్లమలలో భారీ నుంచి అతి భారీవర్షాలు కురవడంతో శివపురం సమీపంలోని పెద్దవాగు, దుద్యాల గ్రామశివారులో ఉన్న సుద్దవాగులు పొంగి ప్రవహి స్తున్నాయి. మండలంలోని 20గ్రామాలకు, ఆత్మకూరు, పాములపాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు ఉధృతితో శివపురం, చిన్నగుమ్మడాపురం, సిం గరాజుపల్లి, పెద్దగుమ్మడాపురం, బట్వారిపల్లి, ముసలిమడుగు, ఎర్రమఠం, శ్రీమాడుగుల, జానాలగూడెం గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అత్యవపర పరిస్థితుల్లో కొంతమంది ప్రమాదమని తెలిసినా పొంగిపొర్లుతున్న వాగులను దాటుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఒకరినొకరు పట్టుకుని వాగును దాటుతున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు, రెవెన్యూశాఖల సహకారం తీసుకోవాలని కొత్తపల్లి తహసీల్దార్‌ ఉమారాణి తెలిపారు. ఏదీ ఏమైనా ఈ గ్రామాల పరిధిలో హైలెవెల్‌ వంతెన నిర్మిస్తే తప్ప కొత్తపల్లి మండల ప్రజల ఇబ్బందులు తప్పవు.

శాంతించని ‘భవనాశి’

ఆత్మకూరు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఆత్మకూరు శివారులో ప్రవహిస్తున్న భవనాశి నది రెండో రోజైన గురువారం ఉగ్రరూపం దాల్చింది. నల్లమలలో కురిసిన భారీ వర్షాలతో వరద రాజస్వామి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద వచ్చిచేరుతోంది. ప్రాజెక్ట్‌లోకి గరిష్ట స్థాయిలో నీటిచేరిక ఉండటంతో ప్రాజెక్ట్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియాలో కురిసిన వర్షపునీటిని ఎప్పటికప్పుడు మునిమడుగుల వాగుకు విడుదల చేస్తున్నారు. దీంతో ఈ నీరు భవనాశి నదిలోకి చేరి ఆత్మకూరు శివవారు మీదుగా సంగమేశ్వరానికి చేరుకుంటుంది. ఈక్రమంలోనే ఆత్మకూరు శివారులోని కురు కుంద, కొత్తపల్లి మలుపువద్ద ఉన్న వంతెనపై భవనాశి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మండలంలోని కురుకుంద, కొట్టాలచెరువు గ్రామాలతో పాటు కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భవనాశి సమీపంలోనే ఉన్న పడేవాగులో కూడా నీటి ఉధృతి కొనసాగింది. ఆయా వాగుల సమీపంలో ఉండే పొలాలు నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వడ్లరామాపురం రస్తాలో ఉన్న పీతురువాగు కూడా ఉప్పొంగి ప్రవహించడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వడ్లరామాపురం రస్తాలోని భవనాశి నదీ పరిసర ప్రాంతాల్లోని పంటపొలాలు కూడా నీటమునగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Updated Date - Aug 15 , 2025 | 12:13 AM