మహనీయుల సేవలు చిరస్మరణీయం
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:14 AM
ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించిన మహనీయులు ఈ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు జీయర్ స్వామీజీలు ఉద్బోధించారు.
ఆధ్మాత్మిక సదస్సులో జీయర్ స్వామీజీలు
కర్నూలు కల్చరల్, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించిన మహనీయులు ఈ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు జీయర్ స్వామీజీలు ఉద్బోధించారు. జ్ఞానం, అనుష్టానం కలిగిన మహామహులు సదాచార్యులుగా మనకు దొరకడం అదృష్టమని కొనియాడారు. కర్నూలు నగర శివారు మామిదాలపాడులో వెలసిన గోదా రంగనాథస్వామి దేవస్థానం (గోదా గోకుల క్షేత్రం)లో మహా మహోపాధ్యాయ శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి శతజయంతి వేడుకలు ఘనంగా ముగిశాయి. జయంతి వేడుకల్లో పాల్గొన్న జీయర్ స్వామీజీలు మాట్లాడుతూ భగవద్రామానుజ సంప్రదాయ పరిరక్షణ, సంస్కృత, ద్రావిడ వేదాంతముల ప్రచారమే లక్ష్యంగా రఘునాథాచార్యులు జీవన యానాన్ని కొనసాగించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి (భీమవరం), త్రిదండి అహోబల రామానుజ జీయర్ స్వామి, త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి (సమతామూర్తి, ముచ్చింతల్), త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామిఒ (విజయవాడ), త్రిదండి అష్టాక్షరీ బృందావన రామానుజ జీయర్ స్వామి, త్రిదండి శఠగోపముని రామానుజ జీయర్ స్వామి (అభినవ మేల్కొట, కర్ణాటక), త్రిదండి ప్రసన్న రాఘవ రామానుజ జీయర్ స్వామి (ప్రయాగరాజ్), ఆచార్య పరమాత్మ నంమదగిరి స్వామి (గంగాపురం), విరజానంద స్వామి (తోట్లపల్లి) భక్తులకు ప్రవచన బోధ చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతల నుంచీ శాస్త్ర పండితులు, వైష్ణవ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గోదా రంగనాథ రామానుజ కూటమి చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజ గుప్త, మేనేజింగ్ ట్రస్టీ పల్లెర్ల నాగరాజు, గోకులం సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.