సచివాలయ తప్పుతోంది
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:14 PM
సచివాలయ తప్పుతోంది
ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు
మండలాలకు పరిమితమైన వీఆర్వోలు
పర్యవేక్షించని ఉన్నతాధికారులు
ఇబ్బందుల్లో ప్రజలు
నలభై ఏళ్ల క్రితం పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్లడానికి మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు. 2019లో పరిపాలనను గ్రామస్థాయికి చేర్చాలన్న సదుద్దేశంతో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. జిల్లాలోని సచివాలయాల్లో పాలన గాడి తప్పుతోంది. ఉద్యోగులు ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నారు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించింది. సచివాలయ వ్యవస్థ పర్యవేక్షణకు ప్రభుత్వం మండల స్థాయిలో ప్రత్యేకంగా 25 డిప్యూటీ ఎంపీడీవోలను నియమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ ఉద్యోగుల సర్దుబాటు కోసం సచివాలయాలను ఏ, బీ, సీలుగా వర్గీకరించింది. అయినా కొన్ని చోట్ల తీరు మారలేదు.
కర్నూలు కలెక్టరేట్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సచివాలయ ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. సమయ పాలన లేకుండా విధులకు హాజరు అవుతున్నారు. ఉదయం 10 గంటలకు రావాల్సిన సచివాలయ ఉద్యోగులు ఉదయం 11.30 గంటలకు విధులకు వస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లిన ప్రజలు కుల, ఆదాయ, జనన మరణ సర్టిఫికెట్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు సచివాలయాల్లో తనిఖీలు చేయకపోవడంతో ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాలు, ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రతి గ్రామంలో
సచివాలయాలు ఏర్పాటు అయ్యాక ప్రతి గ్రామంలో ఓకార్యాలయం, 10శాఖలకు సంబంధించిన ఉద్యోగులు, ప్రజల గడప వద్దకు సేవలు, ఆనాడు అది ఓరంగుల కల. వైసీపీ ప్రభుత్వంలోనే సచివాలయాల వ్యవస్థ గాడి తప్పింది. పింఛన్ల మంజూర కోసం వలంటరీలు ప్రజల వద్ద పైసలు వసూల్ చేశారు. నాటి నుంచి నేటి వరకు గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీలు చేసే అధికారులు లేకపోవడంతో సోమవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎ్‌సకు వచ్చే అర్జీల సంఖ్య ప్రతి వారం పెరుగుతోంది.
సమావేశాలు ఉన్నాయని చెబుతూ..
జిల్లాలో పనిచేసే అనేకమంది వీఆర్వోలు మండల కార్యాలయాలకి పరిమితమయ్యారు. ఉదయం 11:30గంటలకు వీఆర్వోలు విధులకు హాజరవుతున్నారు. ప్రతి సచివాలయానికి ఉదయం 10గంటలకు హాజరు కావాల్సిన వీఆర్వోలు, డైరెక్టుగా మండల కార్యాలయానికి వెళ్తున్నారు. ప్రజలు ఫోన్ చేస్తే తహసీల్దార్, డీటీ, ఆర్‌ఐతో సమావేశాలున్నాయని వీఆర్వోలు చెప్పడం గమనార్హం. ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు పనివేళలు తప్పించుకుని తిరగడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో వాటా ఉండటంతో వాటి సేవలను పరిష్కరించి, సచివాలయ దరఖాస్తులను తిరస్కరణకు గురిచేయడంతో వీఆర్వోలు తమ పనిలో సఫలీకృతమయ్యారు. కనీసం ఉదయం 10గంటల నుంచి 1గంటల వరకు అయినా సచివాలయంలో వీఆర్వోలు అందుబాటులో ఉంటే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతాయని గ్రామ, వార్డు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడి నుంచైనా బయో మెట్రిక్..
గత ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక సర్వేయర్‌ను నియమించింది. ఆతర్వాత అగ్రికల్చర్ రీసర్వే మొదలు కావడంతో సర్వేయర్లను రంగంలోకి దింపింది. వారు ఎక్కడి నుంచైనా బయోమెట్రిక్ హాజరు నమోదుచేసే అవకాశం కల్పించడంతో వారు సచివాలయాలకు వీడ్కోలు చెప్పారు. ఇక గ్రామంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు ఎనర్జీ అసిస్టెంట్ ఉండేవారు. సచివాలయ సిబ్బంది జీత భత్యాలు, పంచాయతీ కార్యదర్శుల చేతిలో ఉండేవి. ఎనర్జీ అసిస్టెంట్ జీతం మాత్రం వారి మాతృ శాఖ ఇచ్చేది. దీంతో వారు సచివాలయానికి శుభం కార్డు వేశారు.
మహిళా పోలీసు కొలువు..
సచివాలయం ఏర్పాటైన నాటినుంచి సరైన జాబ్‌చార్ట్ లేక, విధులు కేటాయించక విలువైన మానవ వనరులు వృథా అయిన కొలువు మహిళా పోలీసు. అనంతరం ఈకొలువు పేరును గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిగా మార్చినప్పటికీ వీరి విషయంలో ఏమీ చేయాలో ఎవరి వద్ద స్పష్టమైన సమాధానం లేదు. పోలీసు ఉద్యోగానికి కావాల్సిన శారీరక దారుఢ్య అర్హతలు వీరికి లేవు. వీరిని ఏశాఖకు కేటాయించాలన్న సందిగ్ధత ఇప్పటికీ నెలకొని ఉంది. ఇది విధి నిర్వహణ లేని కొలువుగా మిగిలిపోయింది.
బీఎల్వోలుగా నియామకం..
సచివాలయ ఉద్యోగులు వచ్చాక ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం చేస్తూ వారిలో మెజార్టీ సిబ్బందిని బూత్ లెవెల్ అధికారులుగా (బీఎల్వో) నియమించారు. తమకు బీఎల్వో డ్యూటీ ఉందని సిబ్బంది సచివాలయానికి హాజరు కావడం తగ్గించారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా ట్యాంకులను పరిశుభ్ర పరచడం, మురికి కాలువల నిర్వహణ బాద్యత ఇంజనీరింగ్ అసిస్టెంట్‌ది. వారు ఈ పనులు పంచాయతీ కార్యదర్శులకు సంబంధించినవి అంటూ తప్పించుకుంటున్నారు.
డిప్యుటేషన్‌లో ఉద్యోగులు
డివిజనల్ స్థాయిలో డివిజన్ అభివృద్ధి అధికారులను గత ప్రభుత్వం నియమించింది. ఈ కార్యాలయానికి సిబ్బందిని కే టాయించక ఇబ్బందిని మిగిల్చింది. ఆయా అధికారులు 10 మందికి పైగా సచివాలయ సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకున్నారు. దీంతో సచివాలయాల్లో సేవలు అందించే వారు లేక అవి వెలవెలబోయాయి. జిల్లా పంచాయతీ, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు కూడా సచివాలయ సిబ్బందిని తీసుకున్నాయి. సచివాలయ సేవలు లభించక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
డిప్యూటీ ఎంపీడీవోల నియామకం
సచివాలయ వ్యవస్థను పర్యవేక్షించేందుకు ప్రభు త్వం మండల స్థాయిలో ప్రత్యేకంగా 25 డిప్యూటీ ఎంపీడీవోలను నియమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ ఉద్యోగుల సర్దుబాటు కోసం సచివాలయాలను ఏ, బీ, సీలుగా వర్గీకరించింది. అయినప్పటికీ కొన్నిచోట్ల తీరు మారలేదు. నగరాల్లో నోడల్ అధికారులను నియమించింది. వీరు సచివాలయ ఉద్యోగులపై పర్యవేక్షించింది. వీరి ఆగమనంతోనైనా సచివాలయ ఉద్యోగుల మెడలో గంట కడతారేమోననే ఓఆశ జనాల్లో నెలకొంది.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ప్రభుత్వ నిబంధనలు సచివాలయ ఉద్యోగులు పాటించాలి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం. వారు ప్రజలకు అందుబాటులో ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయ పర్యవేక్షణ అధికారులు తనిఖీలు చేయాలి.
నూరుల్ ఖమర్, జేసీ, కర్నూలు