Share News

చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేయాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:10 AM

భవిష్యత్తులో విద్యార్థులు ఎక్కడ స్థిరపడినా తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధి కృషి చేయాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషా అన్నారు.

చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేయాలి: కలెక్టర్‌
ఆకర్ష్‌ బుక్‌లెట్లను విడుదల చేస్తున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

ఓర్వకల్లు, ఆగస్టు 10 ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో విద్యార్థులు ఎక్కడ స్థిరపడినా తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధి కృషి చేయాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషా అన్నారు. ఆదివారం ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను కలెక్టర్‌ సందర్శించారు. పూర్వ విద్యార్థుల సంఘం ఆకర్ష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కలెక్టర్‌తో పాటు రాష్ట్ర గురుకుల విద్యార్థుల సెక్రటరీ మస్తాన్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. గురుకుల పాఠశాలలో 1993 నుంచి 1999 బ్యాచ్‌ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆకర్ష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ, క్రికెట్‌, అథ్లెటిక్స్‌ పోటీల్లో గెలిచిన విద్యార్థులకు ట్రోఫీలు బహూకరించారు. పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అప్పటి సమయంలో పాఠశాలలో ప్రహరీ ఉండేది కాదని, తాను పంచాయతీ రాజ్‌ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో రూ.50లక్షలతో కాంపౌండ్‌ వాల్‌ నిర్మించారన్నారు. గ్రీన్‌కో కంపెనీ ఆధ్వర్యంలో జగ్నాథగట్టు వద్ద క్రికెట్‌ స్టేడియం ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో పీ-4 పాలసీ కింద గుర్తించిన బంగారు కుటుంబాలను కూడా దత్తత ప్రక్రియ దాదాపు పూర్తయిందన్నారు. బనవాసి ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ఇంటర్నెల్‌ రోడ్డు మరమ్మతులు పనులు కూడా చేస్తున్నట్లు తెలిపారు. ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన సందర్బంగా తన సహ విద్యార్థులు, టీచర్లు, ఉపాధ్యాయులతో సమావేశమై అప్పటి జ్ఞాపకాలను, అనుభవాలను కలెక్టర్‌ గుర్తు చేసుకున్నారు. పాఠశాలలో గదులను సందర్శించారు. విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఈవో శామ్యూల్‌పాల్‌, తహసీల్దార్‌ విద్యాసాగర్‌, ఏపీఆర్‌ ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 12:10 AM