అంగరంగ వైభవంగా.. సప్తరాత్రోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:12 PM
మంత్రాలయం రాఘవేంద్రస్వామి 354వ సప్తరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
రాఘవేంద్రస్వామి మఠంలో ఽధ్వజారోహణతో మొదలైన వేడుకలు
ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన ప్రహ్లాదరాయలు
ధాన్య పూజ చేసిన పీఠాధిపతి
అలరించిన కూచిపూడి నృత్యం
మంత్రాలయం, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామి 354వ సప్తరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆధ్వర్యంలో రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి విశేష పూజలు నిర్వహించారు. రాత్రి మహాముఖద్వారంపై ధ్వజారోహణలో భాగంగా జెండాను ఆవిష్కరించి 354వ ఉత్సవాలకు నాంది పలికారు. యోగీంద్ర కళామండపంలో జ్యోతి ప్రజ్వలన చేసి పీఠాధిపతి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. అంతకుముందు గోపూజ, అశ్వపూజ, లక్ష్మీపూజ నిర్వహించారు. అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఏఏవో, మేనేజర్లు, క్యాష్ సెక్షన్, ఇంజనీర్ సెక్షన్, వీఆర్వో, పీఆర్వో సెక్షన్ కార్యాలయాలకు ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చి అక్కడ ఉన్న అధికారులను పీఠాధిపతి ఆశీర్వదించారు. అనంతరం ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను ఊంజల మండపంలో ఊయలలో ఏర్పాటు చేసి ఊగించి ధాన్యపూజ చేశారు. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను చెక్క, వెండి, రజత గజవాహనం, బంగారు, నవరత్నాల రథంపై ఊరేగించిన దృశ్యం భక్తులను కనువిందు చేసింది. వివిధ రాష్ట్రాల నుంచి మొదటి రోజు ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత విధ్వాన్ రాజా ఎస్.గిరిరాజాచార్, సుజీంద్రాచార్, గౌతమాచార్, ఆనంద తీర్థాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, ఈఈ సురేష్ కోనాపూర్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, శ్రీపతిఆచార్, సీఆర్వోలు విజయేంద్రాచార్, బద్రీనాథ్, అనంతపురాణిక్, రవికులకర్ణి, జేపీ స్వామి, జయతీర్థాచార్, ఏఈ బద్రీనాథ్, ద్వారపాలక అనంత స్వామి, ప్రకాష్ ఆచార్, డీఎం ఆనందరావు, సీఐ రామాంజులు, ఎస్‌ఐ శివాలంజల్ భక్తులు, మఠం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అలరించిన కూచిపూడి నృత్యం
ఆరాధనోత్సవాల్లో మొదటి రోజు శుక్రవారం రాత్రి యోగీంద్ర కళామండపంలో మాలూరుకు చెందిన విధ్వాన్ ప్రసన్న కోర్పితో దాసవాని సాహిత్యం, ధర్మవరానికి చెందిన లలిత కళానికేతన్ నిర్వహించిన కూచిపూడి నృత్యం భక్తులను అలరించింది. అనంతరం కళాకారుల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కళాకారులకు నగదు, ఫలపుష్ప మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.
ఉత్సవాల్లో నేడు..
ఆరాధన మహోత్సవాల్లో జరిగే రెండో రోజు శనివారం తెల్లవారుజాము 4 గంటల నుంచి 5గంటల వరకు బృందావనానికి సుప్రభాతం, నిర్మల విసర్జనం, 5 నుంచి 6 గంటల వరకు క్షీరాభిషేకం, ఉదయం 6 నుంచి 8.15 గంటల వరకు ప్రహ్లాదరాయులకు పాదపూజ, పంచామృతాభిషేకం, 8.15 నుంచి 8.30 గంటల వరకు గంటలకు టీటీడీ నుంచి పట్టువస్త్రాలు సమర్పణ ఉంటుంది. ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు విశేష పంచామృతాభిషేకం, అనంతరం యజుర్వేద నిత్య నూతన ఉపకర్మ పూజలు, 11 నుంచి 12.30 గంటల వరకు పీఠాధిపతుల సంస్థాన పూజ, మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు అలంకరణ సంతార్పణ, హస్తోదకం 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు మహామంగళహారతి, తీర్థప్రసాదాలు, సాయంత్రం 5 గంటలకు జ్ఞాన యజ్ఞం, రాత్రి 8.30 గంటలకు రథోత్సవాలు, శాకోత్సవం, ఊంజల సేవ, రజిత మంటపోత్సవం నిర్వహించనున్నారు.
నేటి సాంస్కృతిక కార్యక్రమాలు
ఆరాధనలో రెండో రోజు శనివారం రాత్రి యోగీంద్ర కళా మండపంలో సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు చెన్నై చెందిన విధీషి కన్యాకుమారిచే వాయిలీన్ వాయిద్యం, 6.30 నుంచి 8 గంటల వరకు పుత్తూరు చెందిన విధ్వాన్ పుత్తూరు జగదీష్‌చే దాసవాని సాహిత్యం, ఉడిపికి చెందిన భార్గవి మృత్యతాండ వారిచే భరతనాట్యం నిర్వహించనున్నారు.