అమరుల త్యాగాలు చిరస్మరనీయం
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:34 PM
విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరనీయమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు క్రైం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరనీయమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ నూరల్ ఖమర్ పాల్గొన్నారు. ముందుగా అమరవీరుల స్థూపం వద్ద స్మృతి పెరేడ్ నిర్వహించారు. నిర్వహించి అమర పోలీసులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల త్యాగాలు మన గుండెల్లో నిలిచిపోతాయన్నారు. పోలీసులు నూతన టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నారన్నారు. జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి మాట్లాడుతూ విధి నిర్వహణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం అంతకంటే ఏ త్యాగం లేదన్నారు. ఏ సంఘటన జరిగినా గుర్తుకొచ్చేది పోలీసులే అన్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ దేశ, రాష్ట్ర అంతర్గత శాంతి భద్రత, కమ్యూనలిజం, నక్సలిజంకు వ్యతిరేకంగా పోరాడుతూ రాత్రి, పగలు విధి నిర్వహణలో ఏపీ, సెంట్రల్, గ్రేహౌండ్స్ పోలీసులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ అన్ని వ్యవస్థల కంటే పోలీసు వ్యవస్థలో పని చేయడం చాలా కష్టమన్నారు. అనంతరం అమరవీరులు యుడీ వెంకటేశ్వర్లు, అబ్దుల్ కరీం, కే.రాముడు కుటుంబ సభ్యులను సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నాగరాజు, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, హోంగార్డు కమాండెంట్ సదరన్ రీజియన్ ఎం.మహేష్ కుమార్, ఏఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, డీఎస్పీలు బాబు ప్రసాద్, ఉపేంద్రబాబు, పోలీసు వెల్ఫేర్ స్రవంతి, సీఐలు, ఆర్‌ఐలు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు పాల్గొన్నారు.