త్యాగధనుడు పొట్టి శ్రీరాములు
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:35 PM
రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలను సైతం అర్పించిన త్యాగధనుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని, ఆయన త్యాగం మరువలేనిదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు అర్బన్ , డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలను సైతం అర్పించిన త్యాగధనుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని, ఆయన త్యాగం మరువలేనిదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం నగరలోని పూలబజారులో అమర జీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి కలెక్టర్ సిరి, కుడా చైర్మన్ సొమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణ త్యాగాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ఆయన జయంతి, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు విగ్రహం స్థాపన కోసం అమరావతిలో 6.8 ఏకరాల భూమిని కేటాయించామన్నారు. అందులో భాగంగానే అభివృద్ధి పనులకు గాను టీజీవీ సంస్థల నుంచి రూ.కోటి ఇస్తామని ప్రకటించా మన్నారు. కర్నూలు నగరంలో చిన్న అమ్మవారిశాల వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటినుంచి పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా పూలబజారులోనే నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ డాక్టర్ సిరి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు రాష్ట్రం కోసం చేసిన త్యాగాలు, సేవలు చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిష నర్ విశ్వనాథ్, బీసీ సంక్షేమాధికారి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.