Share News

ఉల్లి రైతులను ఆదుకోండి

ABN , Publish Date - Sep 08 , 2025 | 11:45 PM

ఉల్లి రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.

ఉల్లి రైతులను ఆదుకోండి
కర్నూలులో మహిళా ఉల్లి రైతుతో మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల

ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల

మార్కెట్‌ యార్డులో రైతులకు ఓదార్పు

కనీస మద్దతు ధర రూ.2,500 ప్రకటించాలి

కర్నూలు/ కర్నూలు అగ్రికల్చర్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఉల్లి రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా రైతులకు అండగా ఉంటానని ఆమె భరోసానిచ్చారు. సోమవారం కుమారుడు రాజారెడ్డితో కలిసి హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన షర్మిల కర్నూలులోని మార్కెట్‌ యార్డుకు చేరుకున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లా నుంచి వచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఉమ్మడి కర్నూలు డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మినరసింహ యాదవ్‌తో కలిసి ఆమె ఉల్లి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉల్లి రైతుల బాధలను అర్ధం చేసుకోవాలని, కనీస మద్దతు ధర రూ.2,500 ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఉల్లి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, పెట్టుబడి ఎకరాకు రూ.లక్షకు పైగా అయితే సగం కూడా చేతికి రావడం లేదని రైతులు కన్నీరు పెడుతున్నారు. ధరలు పతనమై, కూలీ, రవాణా ఖర్చులు కూడా గిట్టుబాటు కాక తాము పడుతున్న ఇబ్బందులను రైతులు వివరించారు. కూటమి ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడం లేదని రైతులు చెబితే ఇక్కడే నిరాహారదీక్ష చేస్తానని అన్నారు. ప్రభుత్వం మద్దతు ధర రూ.1,200లు ప్రకటించింది. ఏ వ్యాపారి కూడా ఆ రేటుకు కొనడం లేదని, వ్యాపారి కొనే ధరపైన వ్యత్యాసం ఉన్న నగదును ఖాతాల్లో జమ చేస్తామని జాయింట్‌ కలెక్టరు వచ్చి చెప్పారు. ఆ డబ్బు వస్తుందో రాదో అని రైతుల్లో భయం ఉందని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకోవాలని, వ్యత్యాసం అమౌంట్‌ ఖాతాల్లో జమ చేయడంతో పాటు గిట్టుబాటు ధర రూ.1,200లు ప్రకటించాలని షర్మిల డిమాండ్‌ చేశారు. అక్కడి నుంచి ఓ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ ఏఐసీసీ సభ్యుడు జె.లక్ష్మీనారాయణ, కాంగ్రెస్‌ పార్టీ సిటీ అఽధ్యక్షుడు షేక్‌ జిలానిబాషా తో సహా పలువురు ముఖ్యనాయకులతో మాట్లాడారు. కర్నూలు డీసీసీ కార్యాలయ వివాదంలో తొలగించబడిన ఆఫీసు సిబ్బంది తమను విధుల్లో తీసుకోవాలని షర్మిలను విన్నవించారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు వైఎస్‌ షర్మిల, వైఎస్‌ రాజారెడ్డితో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం ఆమె హైదరాబాద్‌కు బయలుదేరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, కర్నూలు సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు షేక్‌ జిలానిబాషా, అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఎం.ఖాశీంవలి, బి.క్రాంతినాయుడు, మురళీకృష్ణరాజు, రమేశ్‌యాదవ్‌, అనంతరత్నం మాదిగ, పుల్లయ్య, గార్లపాటి మద్దిలేటి, తేనే నాగరాజు, బాలు యాదవ్‌, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శులు దామోదరం రాధాకృష్ణ, చింతల మోహన్‌రావు యాదవ్‌, ఐఎన్‌టీయూసీ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్‌ ఖాద్రీపాషా, కాంగ్రెస్‌ ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మారుతిరావు పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2025 | 11:45 PM