Share News

ఆ ఉద్యోగుల రూటే సపరేటు

ABN , Publish Date - Nov 23 , 2025 | 11:50 PM

ఆ ఉద్యోగుల రూటే సపరేటు

ఆ ఉద్యోగుల రూటే సపరేటు

ఆన్‌డ్యూటీ పేరిట తిష్ఠ

పోస్టింగ్‌ ఓ చోట.. విధులు మాత్రం డీఏవోలోనే..

వర్తించని ప్రభుత్వ మార్గదర్శకాలు

వైసీపీ హయాంలోనూ.. ఇప్పుడూ వారిదే హవా

కీలక విభాగాల్లో పెత్తనం

ప్రతి పనికో రేటు

పైసలిస్తే పనులు.. లేదంటే అంతే?

జిల్లా వ్యవసాయ శాఖ (డీఏవో) కార్యాలయంలో కొందరు ఉద్యోగుల రూటే సెపరేటు. పోస్టింగ్‌ ఒక చోట.. విధులు మాత్రం ఆఫీసులోనే. వైసీపీ హయాంలో, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనూ వారిదే హవా. ఒకేచోట ఐదేళ్లకుపైగా పని చేస్తున్న ఉద్యోగులకు తప్పని సరిగా బదిలీ చేయాలనే మార్గదర్శకాలున్నా అవి వారికి వర్తించవు. పోస్టింగ్‌ ఒకచోట ఉంటే.. ఆన్‌డ్యూటీ (ఓడీ) పేరిట విధులు మరోచోట నిర్వహిస్తారు. ఒకే సీటులో ఏళ్ల తరబడి పాతకుపోయారు. వారికి ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ఆ ఫెవికాల్‌ ఉద్యోగులకు తమ రెగ్యులర్‌ స్థానాలకు పంపు తారా..? రాజకీయ నాయకులు పేర్లు చెప్పి ఇక్కడే కొనసాగిస్తారా..? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

కర్నూలు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రైతులకు సేవలు అందించేందుకు జిల్లా వ్యవసాయ శాఖ (డీఏవో) కార్యాలయ పరిధిలో సాధారణ పరిపాలన, క్వాలిటీ కం ట్రోల్‌, ఎక్స్‌టెన్షన్‌, అకౌంట్‌ సెక్షన్లు ఉంటాయి. ప్రతి విభాగంలో సూపరింటెండెంట్‌, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులుంటాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌, రాయితీ విత్తనాలు, వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ వంటి సంక్షేమ పథకాలతో పాటుగా ఎరువులు, పురుగు మందులు, విత్తనా లు, లైసెన్సులు జారీ, రెన్యూవల్‌ చేస్తారు. జిల్లాలో ఆరు నియోజకవర్గాల పరిధిలో 2,500కు పైగా వివిధ లైసెన్సులు ఉన్నాయి. కొత్తగా లైసెన్సులు జారీ, రెన్యూవల్‌ చేయడంలో క్వాలిటీ కంట్రోల్‌ విభాగం కీలకం. ఆవిభాగంలో కీలక హోదాల్లో పనిచేసే ఉద్యోగులు ఆన్‌డ్యూటీ పేరిట ఏళ్ల తరబడి పాతుకుపోయారు. డీలర్ల లైసెన్సులు జారీ, రెన్యూవల్‌ చేయాలంటే ఒక్కో ఫైల్‌కు ఒక్కోరేటు ఉంటుందని, అందుకు పైరవీలు చేసే ఏళ్ల తరబడి సీటు వదలడం లేదనే విమర్శలున్నాయి. రెగ్యులర్‌ సిబ్బందిని కాదని ఆన్‌డ్యూటీ పేరిట డిప్యుటేషన్‌పై వచ్చిన సిబ్బందికి కీలక బాధ్య తలు జేడీఏ అప్పగించడం వెనుక ఆంతర్మమేమిటని? పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఐదారేళ్లుగా ఆ సీటు..

క్వాలిటీ కంట్రోల్‌ విభాగంలో పెస్టిసైడ్‌ లైసెన్సు జారీ, రెన్యూవల్‌ విభాగం చూసే సీనియర్‌ అసిస్టెంట్‌ ఐదారేళ్లుగా ఆ సీటు వదలడం లేదు. ఆయన ఒరిజినల్‌ పోస్టు కర్నూలులోని భూసారపరీక్ష (ఎస్‌సీ) ఆఫీసులో పనిచేయాల్సి ఉంటే ఓడీ డిప్యుటేషన్‌ పేరిట డీఏవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. వైసీపీ హయాంలో.. నం ద్యాల జిల్లా కోవెలకుంట్ల ఏడీఏ ఆఫీసులో పనిచేస్తూ బదిలీపై ఎమ్మిగనూరు వ్యవసాయ క్షేత్రం (ముగతి ఫారం) డీడీఏ ఆఫీసుకు సీనియర్‌ అసిస్టెంట్‌గా బదిలీపై వెళ్లారు. అక్కడ జీతం తీసుకుంటూ ఓడీ పేరిట నాలుగేళ్లకు పైగా డీఏవో ఆఫీసులో పని చేస్తు న్నారు. ఏడాది క్రితం జరిగిన సాధారణ బదిలీల్లో ఎమ్మిగనూరు నుంచి కర్నూలులోని భూ సార పరీక్ష (ఎస్‌సీ) విభాగానికి బదిలీ అయ్యారు. అక్కడ విధుల్లో చేరిన పది రోజలకే డిప్యుటేషన్‌ పైన మళ్లీ డీఏవో కార్యాలయంలో క్వాలిటీ కంట్రోల్‌ విభాగంలో అదేస్థానంలో కూర్చొబెట్టడం విమర్శలకు తావిస్తుంది.

లైసెన్స్‌ రెన్యూవల్‌కు రూ.25వేలు

జిల్లాలో ఫెర్టిలైజర్స్‌ లైసెన్స్‌ డీలర్లు 800, పెస్టిసైడ్స్‌ విక్రయ డీలర్లు 1,200, సీడ్స్‌ విక్రయ డీలర్లు 500మందికి పైగా ఉన్నారని వ్యవసాయా ధికారులు పేర్కొన్నారు. గతంలో రెండేళ్లకు ఒకసారి లైసెన్స్‌ రెన్యూవల్‌ చేసేవారు. ప్రస్తుతం ఐదేళ్లకు ఒకసారి రెన్యూవల్‌ చేస్తున్నట్లు ఎరువులు, పురుగుమందుల విక్రయ డీలర్ల సంఘం నాయకుడు ఒకరు పేర్కొన్నారు. ఏటా సరాసరి 450-500 లైసెన్సులు రెన్యూవల్‌ చేయాల్సి ఉంటుంది. ఒక లైసెన్సు రెన్యూవల్‌ కోసం సుమారుగా రూ.25వేలు మాముళ్ల కింద ఇచ్చుకోవాల్సి వస్తుందని, ఇవ్వకపోతే లేనిపోని కొర్రీలు పెట్టి వెనక్కి పంపుతున్నారని డీలర్ల సంఘం నాయకులు వాపోతున్నారు.

మరో సీనియర్‌ అసిస్టెంటు..

సీడ్‌ లైనెన్సు విభాగం చూస్తున్న మరో సీనియర్‌ అసిస్టెంట్‌ కూడా ఇక్కడే పాతుకుపోయారు. వైసీపీ హయాంలో ఆయన ఆలూరు ఏడీఏ ఆఫీసులో పోస్టింగ్‌ తీసుకొని ఓడీ పేరిట డీఏవో ఆఫీసులో విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. కూటమి ప్రభు త్వం వచ్చాక సాధారణ బదిలీల్లో భాగంగా ఆలూరు నుంచి ఆదోని ఏడీఏ ఆఫీసు సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. విధుల్లో చేరారే తప్పా ఒక్కరోజూ కూడా ఆ సీటులో కూర్చోలేదని తెలుస్తుంది. ఓడీ పేరిట డీఏవో ఆఫీసులో సీడ్‌ లైసెన్స్‌ విభా గం సీటుకు వచ్చేశారు. ఆదోనిలో పని లేకపోవడంతో కర్నూలు డీఏవో ఆఫీసుకు డిప్యుటేషన్‌పై తీసుకొచ్చారా? అంటే అదీలేదు. జిల్లాలో అత్యధికంగా ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల డీలర్లు ఆదోనిలోనే ఉన్నారు. కొత్త లైసెన్సులు, రెన్యూ వల్‌తో పాటు రెగ్యులర్‌ ఆఫీసు పనులు ఉన్నాయని, పైఅధికారులు డిప్యూటేషన్‌ పైన డీఏవో ఆఫీసులకు తీసుకెళితే కాదనలేము కాదా? అని స్థానిక అధికారులు పేర్కొ నడం కొసమెరుపు. డీఏవో ఆఫీసులో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఆలూరు ఏడీఏ కార్యాలయానికి బదిలీపై వెళ్లిన మరో ఉద్యోగి కూడా ఆన్‌డ్యూటీ పేరిట డీఏవో ఆఫీసులోనే అతుక్కుపోవడం విమర్శలకు తావిస్తుంది.

ఆఫీసు పనుల కోసమే ఓడీ

ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు అమలు, రెగ్యూలర్‌ కార్యాలయం పనుల కోసమే అవసరాన్ని బట్టి ఆన్‌డ్యూటీలో డిప్యూటేషన్‌ పైన ఉద్యోగులకు డీఏవో ఆఫీసులో నియమించిన మాట నిజమే. ఒకే విభాగంలో ఏళ్ల తరబడి ఒకేఉద్యోగిని నియమించలేదు. అప్పుడప్పుడు విభాగాలు మారుస్తూ ఉం టాం. ఇచ్చిన పనులు చేయడానికి చేతకాని వాళ్లే ఇలాంటి ఆరోపణలు చేస్తారు.

వరలక్ష్మి, జేడీఏ, వ్యవసాయ శాఖ, కర్నూలు

Updated Date - Nov 23 , 2025 | 11:50 PM