Share News

జిన్నర్ల విముఖత

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:42 PM

రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తి సాగులో మొదటి స్థానంలో ఉంది.

జిన్నర్ల విముఖత
ఆదోని పత్తి జిన్నింగ్‌ అండ్‌ ప్రెస్సింగ్‌ పరిశ్రమ

కొర్రీలు విధించిన సీసీఐ

రోజురోజుకి పతనమవుతున్న ధరలు

ఆందోళనలో అన్నదాతలు

రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తి సాగులో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటికే బోరు బావులు కింద, ముందస్తు వర్షాలకు పత్తిని మార్కెట్‌కు విక్రయానికి తీసుకొస్తున్నారు. ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో పత్తి ధరలు రోజురోజుకి దిగజారుతున్నాయి. పత్తి ధర క్వింటాలు గరిష్ఠంగా రూ.7500 మించి రైతులకు అందడం లేదు. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ఈఏడాది ముందుగానే కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)ని రంగంలోకి దించి కనీస మద్దతు ధరతో రైతుల ను ఆదుకోవాలని చూస్తోంది. సీసీఐ విధించిన నిబంధనలు సడిలిస్తే తప్ప తాము జిన్నింగ్‌ పరిశ్రమలు అద్దెకు ఇవ్వలేమని చెబుతున్నారు.

ఆదోని అగ్రికల్చర్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): సీసీఐకి అద్దెకిచ్చేందుకు పత్తి జి న్నింగ్‌ పరిశ్రమలు విముఖత చూపుతున్నాయి. ఇప్పటికే మూడుసార్లు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) జిన్నింగ్‌ పరిశ్రమలకు టెండర్లను ఆహ్వానించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరు కూడా టెండర్లు దాఖలు చేయలేదు. ఈనెల 27వ తేదీ వరకు టెండర్లను పొడిగించింది. రాష్ట్రప్రభుత్వం ఓవైపు సీసీఐ ఉన్నతాధికారులతో నిబం ధనలు సడలించి కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. నిబంధనలు సడలిస్తే తప్ప తాము టెండర్లలో పాల్గొనమని పత్తి పరిశ్రమల యజమానులు కరాఖండిగా చెబుతున్నారు.

రూ.7500కు మించి కొనుగోలు..

ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తి సాగులో మొదటి స్థానంలో ఉంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.45లక్షల హెక్టార్లకు పైగా రైతులు పత్తి సాగుచేశారు. 38-45లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఇప్పటికే బోరు బావులు కింద, ముందస్తు వర్షాలకు పత్తి మార్కెట్‌కు విక్రయానికి తీసుకొ స్తున్నారు. ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో పత్తి ధరలు రోజురోజుకి దిగజారు తున్నాయి. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధర రూ.8110 ప్రకటించింది. క్వింటాలు గరిష్టంగా పత్తిని రూ.7300 మించి కొనుగోలు చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే క్వింటాలు రూ.900పైగా తక్కువగా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధర కంటే తక్కువగా పత్తి ధర పలుకుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, పెరిగిన ఎరువులు విత్తనాల ధరలు కూలీ ఖర్చులతో మార్కెట్లో పలుకుతున్న ధర తమకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులకు కనీస మద్దతు ధరతో ఆదుకోవాల్సిన సీసీఐ, జిన్నింగ్‌ పరిశ్రమలకు విధించిన కొర్రీ తో మరింత కొనుగోలు ఆలస్యం జరిగే అవకాశం ఉంది.

120కి పైగా పరిశ్రమలు

ఉమ్మడి జిల్లాలో 120కి పైగా జిన్నింగ్‌ పరిశ్రమలున్నాయి. ప్రతి ఏటా సీసీఐకి 20కి పైగా జిన్నింగ్‌ పరిశ్రమలు అద్దెకు ఇస్తారు. గతఏడాది ఆదోనిలో 10, ఎమ్మిగనూరులో నాలుగు, నంద్యాలలో 3, మంత్రాలయంలో 1, కర్నూలు సమీపంలోని పెంచికలపాడులో 1 జిన్నింగ్‌ పరిశ్రమ సీసీఐ అద్దెకు నడిపింది. ఆదోని కేంద్రంలోని 5 పత్తి జిన్నింగ్‌ పరిశ్రమల నుంచి 2024లో కనీస మద్దతు ధరతో సీసీఐ 1,70,673 క్వింటాళ్లు రైతుల నుంచి కొనుగోలు చేసింది. మిగతా కేంద్రాల నుంచి మరో లక్ష క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌ పంట చేతికి వచ్చే సమయానికి పత్తి ధరలు కనీస మద్దతు ధర కంటే తక్కువగా పలుకుతుంది. సీసీఐ విధించిన నిబంధనలు సడిలిస్తే తప్ప తాము జిన్నింగ్‌ పరిశ్రమలు అద్దెకు ఇవ్వలేమని చెబుతున్నారు.

సీసీఐ నిబంధనలు ఇవే..

ఒక బ్రాంచిలో రెండు, మూడు జోన్లుగా చేసి లింట్‌ పర్సంటేజ్‌లో మార్పులు చేయడంతో పాటు గతంలో కంటే ఎక్కువగా పెంచారు. వంద కిలోల పత్తిలో ఏ నెల ఎంత దూది ఇవ్వాలనే నిబంధన పెట్టారు. గతంలో ఇది నెలవారీగా ఉండేది. ఈ సీజన్‌లో రెండుసార్లు ఇవ్వాలని సూచించారు. 100 కేజీల పత్తికి దూది 97.5 కేజీలు ఇవ్వాలంటుంది. బేలు తయారు చేసే సమయంలో గతంలో లోటు (షార్టేజ్‌) 3.15 నుంచి 1.90 శాతం ఉండేది. దాన్ని 1.25 నుంచి 0.75 శాతానికి తగ్గించారు. చెత్త 2.5 శాతం విధించింది.

ప్రతి జిన్నింగ్‌ పరిశ్రమలో అధునాతన సౌకర్యాలతో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు ఆరు నెలలపాటు డేటా ఏఐ అనాలసిస్‌ భద్రంగా స్టోరేజ్‌ కలిగి ఉండాలి.

ఎల్‌ వన్‌, ఎల్‌ టూ, ఎల్‌త్రీ విభజన చేయడంపై ఈ నిబంధనలు బేళ్ల ధర జిన్నింగ్‌లో సౌకర్యాలు తదితర వాటిపై చర్చలు జరిపిన తర్వాతనే టెండర్లకు వెళ్తామని కాటన్‌ అసోసియేషన్‌ అంటోంది.

నిబంధలు సడలిస్తేనే..

సీసీఐ విధించిన కొత్త నిబంధనలు సడలిస్తే తప్ప తాము టెండర్లలో పాల్గొనలేం. ప్రతి జిన్నింగ్‌ పరిశ్రమలో పదివేల బేళ్ల దూది ఉత్పత్తి చేస్తామని హామీ ఇస్తే అధునాతన సౌకర్యాలు కలిగిన సీసీ కెమెరాలు ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదు.

వెంటకటరామి రెడ్డి, కాటన్‌ మర్చంట్‌, ఆదోని

మంకు పట్టు వీడాలి

సీసీఐ మంకు పట్టు వీడి రైతులకు మేలు చేకూర్చేలా కనీస మద్దతు ధరతో కొనుగోలుకు ముందుకు రావాలి. వారు విధించిన కొత్త నిబంధనలు తమకు నష్టం చేకూర్చేలా ఉన్నాయి,

- బత్తిని కుబేర నాథ్‌, ఎన్‌డీబీఎల్‌ జిన్నింగ్‌ పరిశ్రమ యజమాని, ఆదోని

Updated Date - Oct 05 , 2025 | 11:42 PM