ఉరకలెత్తిన తెలుగుగంగ
ABN , Publish Date - Jul 23 , 2025 | 11:26 PM
వెలుగోడు తెలుగుగంగ జలాశయం నుంచి కృష్ణా జలాలను బుధవారం అధికారులు దిగువకు విడుదల చేశారు.
వెలుగోడు డ్యాం నుంచి మూడు గేట్లు ఎత్తివేత
వెలుగోడు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): వెలుగోడు తెలుగుగంగ జలాశయం నుంచి కృష్ణా జలాలను బుధవారం అధికారులు దిగువకు విడుదల చేశారు. జలాశయానికి చెందిన మూడు స్పిల్‌వే గేట్లను తెలుగుగంగ ఈఈ శిశంకరరెడ్డి, ఏఈఈ శివనాయక్ ఆరు వేల క్యూసెక్కుల నీటిని గాలేరుకు విడుదల చేశారు. జలాశయంలోకి బనక చర్ల సముదాయం నుంచి 5200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా స్పిల్‌వే ద్వారా ఆరువేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. వీటిలో మద్రాసు మెయిన్ కెనాల్‌కు 2,500, కుడి తూము ద్వారా 60, ఎడమ తూము ద్వారా 30, నంద్యాల తాగునీటి కోసం 20 క్యూసెక్కుల చొప్పున దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 263.90మీటర్ల వద్ద 15.573 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దిగువకు నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్న నేపథ్యంలో గాలేరు నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.