పోలీసులకు దీటుగా పని చేయాలి
ABN , Publish Date - Dec 06 , 2025 | 11:43 PM
హోంగార్డులు తమ విధి నిర్వహణలో పోలీసులకు దీటుగా పని చేయాలని ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు.
హోంగార్డు వ్యవస్థాపక వేడుకల్లో ఎస్పీ
నంద్యాల టౌన్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): హోంగార్డులు తమ విధి నిర్వహణలో పోలీసులకు దీటుగా పని చేయాలని ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డు 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పోలీసు శాఖలో నిస్వార్థ సేవతో పని చేసే వారందరికీ అభినందనలు తెలిపారు. శాంతి భద్రతలు పరిరక్షించడంలో పోలీసులతో పోలిస్తే హోంగార్డులకు సౌకర్యాలు తక్కువ ఉన్నా.. కొన్ని సందర్భాల్లో వారి కంటే ఎక్కువ సేవలు చేస్తున్నారన్నారు. ఎల్లవేళలా వారి సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. నంద్యాల జిల్లాలో మొత్తం 397 మంది హోంగార్డులు పని చేస్తున్నారని ట్రాఫిక్, క్రైం కంట్రోల్, డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో దేవస్థాన భద్రత ఇలా అన్ని విభాగాల్లో పని చేస్తున్నారని అన్నారు. ఉత్తమ సేవలు అందించిన హోంగార్డులకు బహుమతులు అందజేశారు. అలాగే బాగా చదువుకునే వారి పిల్లలకు స్కాలర్ షిప్ అందజేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మందా జావళి, డీఎస్పీలు ప్రమోద్‌కుమార్, రామాంజినాయక్, శ్రీనివాసరావు, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు మంజునాథ్, సురేశ్‌బాబు, ఆర్‌ఎస్సైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.