Share News

ఉద్యమాలు ఉధృతం చేయాలి

ABN , Publish Date - Nov 02 , 2025 | 11:52 PM

జిల్లాల్లో బీసీ ఉద్యమాలు ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య అన్నారు.

ఉద్యమాలు ఉధృతం చేయాలి
మాట్లాడుతున్న ఎంపీలు ఆర్‌.కృష్ణయ్య, బస్తిపాటి నాగరాజు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ నాగేశ్వరరావు యాదవ్‌ తదితరులు

బిల్లు కోసం బీసీ సంఘాలు సమష్టిగా పోరాడాలి

కూటమి ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం

బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య

కర్నూలులో బీసీ భవన్‌కు రూ.కోటి

గజమాలతో సన్మానించిన కురువ సంఘం నాయకులు

కర్నూలు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాల్లో బీసీ ఉద్యమాలు ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య అన్నారు. ఆదివారం జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టోల్‌ ప్లాజా దగ్గర ఎంపీ బస్తిపాటి నాగరాజు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ నాగేశ్వరరావుయాదవ్‌ ఘనస్వాగం పలికారు. స్థానిక ఎంపీ కార్యాలయంలో ఎంపీలు కృష్ణయ్య, బస్తిపాటి నాగరాజును కురువ సంఘం నాయకులు గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ ఎంపీ నాగరాజు విన్నపం మేరకు బీసీ భవన్‌ నిర్మాణం కోసం ఎంపీ నిధుల నుంచి రూ.కోటి కేటాయిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. దేశ జనాభాలో 56 శాతానికిపైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో సమాన అవకాశాలు దక్కడం లేదన్నారు. రాజకీయ రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో బీసీ బిల్లు ఆమోదం జరగాలని డిమాండ్‌ చేశారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీ సంఘాలు సమష్టిగా జాతీయ స్థాయిలో ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరుగుతుందని, బీసీ బిల్లు ఆమోదం కోసం సీఎం చంద్రబాబు నాయకత్వం వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. త్వరలో చంద్రబాబును కలుస్తామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లపై న్యాయస్థానాలు ఆశ్రయిస్తుండంతో అమలు జరగడం లేదని, చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ బీసీ రాజ్యాంగ హక్కుల కోసం మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ఎంపీ ఆర్‌.కృష్ణయ్యను అభినందిస్తున్నానన్నారు. బీసీల ఐక్యత కోసం ఆయన చేసిన పోరాట ఫలితమేగానే తాను ఎంపీ అయ్యానని చెప్పారు. అడిగిన వెంటనే బీసీ భవన్‌కు రూ.కోటి ఎంపీ నిధులు ఇవ్వడం అభినందనీయమన్నారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ నాగేశ్వరరావు యాదవ్‌, కార్పొరేషన్‌ చైర్మన్‌ విక్రమ్‌, ఏపీ కురువ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రామకృష్ణ, బీసీ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, రాంబాబు, కుమ్మరి రామకృష్ణ, దేవశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 11:52 PM