Share News

మంత్రిగారి బంధువు..!

ABN , Publish Date - Apr 24 , 2025 | 11:44 PM

‘అధికారం మనదే.. మనల్ని ఎవరు అడ్డుకునేది..’ అన్నట్టుగా సాగుతోంది నంద్యాలలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల తీరు.

మంత్రిగారి బంధువు..!

మంత్రి సమీప బంధువు కావడంతో బెదిరింపులు

మైనింగ్‌లో ఆయన మాటే శాసనం

బిజీ షెడ్యూల్‌లో మంత్రి...

లోకల్‌గా ‘బంధుత్వం’ పేరుతో దర్బార్‌

ఆ నేత తీరుతో పార్టీకి, ప్రభుత్వానికి నష్టమే!

ఓ టీడీపీ నాయకుడి దందా పర్వం

నంద్యాల, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ‘అధికారం మనదే.. మనల్ని ఎవరు అడ్డుకునేది..’ అన్నట్టుగా సాగుతోంది నంద్యాలలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల తీరు. ఓ వైపు రాష్ట్రాన్ని ప్రగతిపథం వైపు నడిపించేందుకు చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం అధికార టీడీపీకి, ప్రజాప్రతినిధులకు చెడ్డపేరు తెస్తున్నారు. వీరిలో ముఖ్యంగా జిల్లాలో ఓ మంత్రి సమీప బంధువు(మండల ఇన్‌చార్జి) ఆగడాలు, అధికారదర్పం రోజురోజుకూ పెరుగుతోంది. మంత్రి కావడంతో సాధారణంగా ఆయన రాష్ట్ర కార్యాలయం, సచివాలయం, ఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఓ కీలక శాఖకు మంత్రిగా బాధ్యతలు చక్కబెడుతున్న మంత్రి నిత్యం రాష్ట్రస్థాయిలో సమీక్షలు, అభివృద్ధి, తన శాఖకు చెందిన పనులపై బిజీగా ఉన్నారు. ఆ బిజీ వ్యవహారమే ఇప్పుడు మంత్రిగారి బంధువుకు అందివచ్చిన అవకాశమైంది. ‘మంత్రి మా బంధువే.. నేను చెప్పినట్లు విను...’ అంటూ తనదైన శైలిలో బరితెగించడం పలు విమర్శలకు తావిస్తోంది. చిన్నా,పెద్ద అనే తేడా లేకుండా వ్యాపారులైనా.. ఉద్యోగులైనా ఆదాయం పొందే ఏ వర్గాల వారైనా సరే అడిగినంత ఇవ్వాల్సిందే. చెప్పింది చేయాల్సిందే. లేకుంటే ఆ వర్గాలను భయభ్రాంతులకు గురిచేసి వారిని తమదారికి తెచ్చుకుంటారు. గనుల వ్యాపారులు, బియ్యం మాఫియాల నుంచి రూ.కోట్లలో బెదిరింపు ధోరణిలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. ఒక్కమాటలో చెప్పాలంటే సదరు మంత్రి బంధువు ఆగడాలను తట్టుకోలేక వ్యాపారాలు చేయాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా నంద్యాల జిల్లాలో ఓ నాయకుడి అవినీతి దందా ఇటు మంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు తెస్తోంది.

ఆయన తీరే వేరు..!

నంద్యాల జిల్లాలోని ఓ మంత్రి సమీప బంధువైన నాయకుడి (మండల ఇన్‌చార్జి) అవినీతి దందాపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు గుప్పుమంటున్నాయి. బియ్యం మాఫియా నుంచి గనుల వ్యాపారుల వరకు సదరు నాయకుడి దందా అధికమైంది. సదరు నాయకుడు సైతం తమ సమీప బంధువుతో పాటు మరికొందరిని అనుచరులుగా పెట్టుకుని అక్రమ వసూళ్లకు తెరలేపారు. ఇందులో వైసీపీ నాయకులను కూడా పెట్టుకుని దందాకు పాల్పడుతున్నాడు. మంత్రి బంధువు అని చెప్పుకుంటూ గనుల వ్యాపారులను బెదిరిస్తున్నారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో మంత్రి హెచ్చరించినా ఆ అధికార పార్టీ నాయకుడు తన పంథాను మార్చుకోలేదు. మొత్తంగా అధికారం వచ్చింది కదా..? మంత్రి కూడా తమ బంధువే కదా...? ఏమి చేసుకుంటారో చేసుకోండి అనేలా ఆ నేత తీరు మారింది.

అడిగినంత ఇస్తేనే.. లేకుంటే కరెంట్‌ కట్‌..!

నంద్యాల జిల్లాలోని ఆ ప్రాంతాల్లో నాపరాళ్ల గనులు ఎక్కువగా ఉంటాయి. ఏళ్ల తరబడి చాలా మంది వ్యాపారాలు సాగిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంత్రిగారి బంధువు, టీడీపీ నాయకుడి కన్ను వీటిపై పడింది. ఈ నేపథ్యంలో ఆయా మండలాల్లోని కొందరు గనులకు సంబం ధించిన వ్యాపారులపై తమ అనుచర వర్గాన్ని పురమాయించి రూ.లక్షల్లో డిమాండ్‌ చేశారు. ‘అడిగినంతా ఇస్తావా..? లేకుంటే నీ గనులకు విద్యుత్‌ సరఫరా ఆపేయమంటావా..’ అని బెదిరి ంపులకు పాల్పడినట్లు సమాచారం. మొత్తంగా సదరు నాయకుడి దందాతో గనుల వ్యాపారులు సైతం అల్లాడిపోతున్నారు. సదరు నేత వ్యవహారంతో టీడీపీ కేడర్‌కు ముప్పు కలిగే అవకాశం ఎంతైనా ఉంది.

మంత్రి బంధువుపై ఆరోపణల్లో కొన్ని..

మంత్రి నియోజకవర్గం పరిధిలోని మూడు మండలాల పరిధిలోని గనుల వ్యాపారులు జోరుగా సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉండే సుమారు 15 మంది గనుల యజమానులను వివిధ రూపాల్లో తమ అనుచరులతో బెదిరించి భయభ్రాంతులకు గురి చేశారని బాధిత వర్గాల సమాచారం. ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల నుంచి 15 లక్షలు డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. దీంతో ఆయా యజమానులు సదరు నాయకుడు, అనుచరులపై పలుమార్లు మంత్రికి కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఆ ప్రాంతంలో పవర్‌ గ్రిడ్‌ సంస్థ నేతృత్వంలో ఓ కంపెనీ సిమెంట్‌ కంపెనీ దగ్గర నుంచి మరోకచోటకు టవర్స్‌ లైన్స్‌ పనులు చేస్తుండగా.. సదరు నాయకుడు (తమ పరిధి కాకపోయినా) అనుచరుడిని పంపించి కంపెనీ వారిని బెదిరించి పనులు ఆపించి సుమారు రూ.12 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఇది తెలుసుకున్న మరో స్థానిక లీడర్‌ సైతం స్థానిక రైతులను వెంట బెట్టుకుని మరోమారు సదరు కంపెనీ వారిని బెదిరించారు. ‘మాకు కూడా డబ్బులివ్వాలిందే’నని బెదిరించారని సమాచారం. దీంతో చేసేదేమీ లేక సదరు కంపెనీ రూ.10 లక్షలు ఇచ్చుకున్నట్లు తెలిసింది. కంపెనీ స్థానిక నాయకుడికి మాముళ్లు ముట్టచెప్పినట్లు సమాచారం.

ఇతర జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తమ పరిధిలోని ఓ గనిని లీజుకు తీసుకున్నాడు. విషయం తెసుకున్న నేత తెలిసిన సదరు నాయకుడు సదరు గని పనులను ఆపించి సదరు యజమాని నుంచి కూడా సుమారు రూ.12 లక్షలు వసులు చేశారని తెలిసింది.

ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించే పాలిషింగ్‌ స్లాబ్స్‌ లారీలను చెక్‌పోస్టుల్లో పట్టుకోకుండా వైసీపీకి చెందిన ఓ వ్యక్తిని పెట్టుకుని మరీ సదరు నాయకుడి సమీప బంధువు ద్వారా కథ నడిపిస్తున్నారు. రోజుకు 20 లారీలు వరకు రెండు మార్గాల నుంచి తాడిపత్రి, గుంతకల్లు మీదుగా అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఒక్కో లారీ నుంచి రూ.7 వేలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

Updated Date - Apr 24 , 2025 | 11:44 PM