ప్రధాన రహదారి బురదమయం
ABN , Publish Date - Aug 17 , 2025 | 11:38 PM
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ బురదమయ్యాయి.
ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సు
సి.బెళగల్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ బురదమయ్యాయి. సి.బెళగల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి. వాటిలో వర్షపు నీరు చేరి రహదారులన్నీ బురదగుంటలుగా దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్‌ఎంబీ రోడ్డులో ఎమ్మిగనూరు నుంచి సి.బెళగల్‌కు వస్తున్న ఓ ఆర్టీసీ బస్సు బురద గుంటలో ఉన్నట్టుండి ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు అదే బురదలో దిగి అవస్థలు పడ్డారు. స్థానికులు, ప్రయాణికులు కలసి ఆర్టీసీ బస్సును అతి కష్టంపై ముందుకు తోశారు. దాదాపు అరగంట తర్వాత బస్సు కదిలింది. మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రధాన రహదారిపైనే ఇంత అధ్వానంగా రహదారులు ఉంటే మరి గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏవిధంగా ఉందో అంటూ ప్రయాణికులు, ప్రజలు చర్చించుకున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చొరవచూపి రహదారులను బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.