చెంచుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:19 PM
: చెంచుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అన్ని ప్రభుత్వ శాఖలు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి సూచించారు.
న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి
ఆత్మకూరు, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): చెంచుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అన్ని ప్రభుత్వ శాఖలు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి సూచించారు. మంగళవారం మండలంలోని కొట్టాలచెరువు చెంచుగూడెంలో ఆయా శాఖల అధికారులతో కలిసి అవగాహన సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెంచుగిరిజనుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రత్యేకించి రేషన్‌కార్డు, ఆధార్, ఆరోగ్య, కుల, కుటుంబసభ్యులు ధృవీకరణపత్రం తదితర వాటి మంజూరుకు ఆయా శాఖలు చెంచులకు పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మహిళా, గిరిజన హక్కుల చట్టాలు, బాల్య వివాహ నిర్మూలన చట్టం తదితర వాటిపై లీగల్ సర్వీసెస్ యాక్ట్ 1987 ద్వారా ఉచిత న్యాయ సలహాలను అందివ్వనున్నట్లు చెప్పారు. అనంతరం ఆయా శాఖలకు చెందిన స్టాళ్లను వారు సందర్శించారు. కార్యక్రమంలో శ్రీశైలం ఐటీడీఏ పీవో వెంకట శివప్రసాద్, ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి, డీఎంహెచ్‌వో వెంకటరమణ, సోషల్ వెల్ఫేర్ డీడీ చింతామణి, డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, తహసీల్దార్ రత్నరాధిక, ఎంపీడీవో ఉమర్, ఆత్మకూరు అర్బన్, రూరల్ సీఐలు రాము, సురేష్‌కుమార్‌రెడ్డి, జిల్లా చైల్డ్ ఆఫీసర్ స్వప్నప్రియ, ఆత్మకూరు ఐసీడీఎస్ సీడీపీవో సూర్యకుమారి, సర్పంచ్ నాగలక్ష్మి ఉన్నారు.