పేదల ఇంట అభివృద్ధి వెలుగులు..!
ABN , Publish Date - May 11 , 2025 | 10:53 PM
పేదల ఇంట అతి త్వరలోనే అభివృద్ధి వెలుగులు రానున్నాయి.
పీ4 ద్వారా 43,021 కుటుంబాల గుర్తింపు
ముందుకొచ్చిన 458 మంది మార్గద ర్శకులు
మరింత మంది కోసం అన్వేషణ
పేదల ఇంట అతి త్వరలోనే అభివృద్ధి వెలుగులు రానున్నాయి. క్షేత్రస్థాయిలో నిరుపేద కుటుంబాలను గుర్తించి వారిలో పేదరికాన్ని నిర్మూలించి, వారికి మెరుగైన జీవితాలు అందించాలనే లక్ష్యంతో పీ-4 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఎక్కడికి అక్కడ ఇంటింటా సర్వేలు చేసి 43,021 కుటుంబాలను అర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. ఆ కుటుంబాలను ఆదుకునేందుకు మార్గదర్శకులను గుర్తించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. జిల్లాలోని పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, దేశ విదేశాల్లో జీవించే వారిని ఎంపిక చేయడంపై కసరత్తు సాగుతోంది. ఇప్పటికే 458 మంది మార్గదర్శకులను గుర్తించారు. మరింత మంది కోసం జిల్లా యంత్రాంగం అన్వేషణ పక్రియను వేగవంతంగా చేస్తోంది. ఆ దిశగా కలెక్టర్ రాజకుమారి కూడా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఏది ఏమైనా పీ-4 నిర్ణయం పూర్తయితే జిల్లాలోని నిరుపేదల ఇంట్లో అభివృద్ధి వెలుగులు ప్రసరించనున్నాయి.
నంద్యాల, మే 11 (ఆంధ్రజ్యోతి): సమాజంలో బాగా ఆర్థికంగా స్థిరపడి అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన 10 శాతం.. కనీసం తమ జన్మభూమిలో అత్యంత నిరుపేదలైన 15 నుంచి 20శాతం మంది పేద ప్రజలకు చేయూతనిచ్చే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీ-4 (ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామం) అనే బృహాత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలో పేదరిక నిర్నూలన లక్ష్యాన్ని చేదించే దిశగా జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం కూడా ఈ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టిసారించింది. జిల్లా వ్యాప్తంగా నివసించే 6,71,086 కుటుంబాలపై ఇంటింటా సర్వే చేసి 43,021 కుటుంబాలను అర్హులుగా గుర్తించి ఎంపిక చేశారు. ప్రధానంగా ఆర్థిక, జీవన స్థితిగతులు, విద్య, తదితర అంశాల పరంగా సర్వే చేసి ఎంపిక చేయడం జరిగింది. దీంతో ప్రభుత్వం ఆయా కుటుంబాలను బంగారు కుటుంబాలుగా నామకరణం చేసింది. అధికార యంత్రాంగం కూడా పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా ఎక్కడైనా నివసించే కఠిక పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించి వారందరినీ పేదరికం నుంచి బయటకు వేయాలనే ఆశయంతో అర్హులుగా ప్రకటించారు.
లక్ష్యం ఇదే
అధికారులు గుర్తించిన 43,021 కుటుంబాల్లో పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం. ఉద్యోగ, ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ సదుపాయం కల్పించడం. నివాస ప్రాంతాలతో పాటు ఇంటి ఆవరణలో వారి జీవన శైలికి అనుగుణంగా కనీస సౌకర్యాలు కల్పించడం. అంతేకాకుండా ఆయా కుటుంబాలు ఆర్థికంగా నిలుదొక్కునే విధంగా పలు రూపాల్లో అవసరమైన ఆర్థిక సాయం అందించే దిశగా ప్రభుత్వం సంకల్పించింది. మరోవైపు వీరందరికీ సహాయసహకారాలు అందించేందుకు మార్గదర్శకులను గుర్తించే విధంగా ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా యంత్రాంగం కూడా ఇప్పటికే 457 మంది మార్గదర్శకులను గుర్తించారు. మరింతమంది మార్గదర్శకులను గుర్తించే అన్వేషణ జిల్లాలో సాగుతోంది.
పెద్ద పెద్ద వ్యాపారులు..
గుర్తించిన నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు పీ-4 కింద వివిధ ప్రాంతాల్లో ఉండే పారిశ్రామికవేత్తలు, ప్రముఖ వైద్యులు, ఎన్‌ఆర్‌ఐలు, బడా బిల్డర్లు, లాయర్లు, పెద్దపెద్ద వ్యాపారులు మార్గదర్శకులుగా అధికార యంత్రాంగం గుర్తించే దిశగా అన్వేషణ సాగుతోంది. ఇదే విషయంపై కలెక్టర్ కూడా ప్రత్యేక చొరవ తీసుకుని మరీ జిల్లాలోని అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఉన్నతవంతుల జాబితాపై కూడా ఆరాతీస్తున్నారని సమాచారం. భవిష్యత్‌లో వీరు కూడా సదరు కుటుంబాలకు (బంగారు కుటుంబాలు) మార్గదర్శకులుగా మారే అవ కాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నిత్యం కలెక్టర్ పీ-4పై సమీక్షలు, సమా వేశాలు నిర్వహించి తగిన అదేశాలు జారీచేస్తుండటంతో క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం కూడా సదరు అన్వేషణలో నిమగ్నమయ్యారు.
మార్గదర్శకుల గుర్తింపు కొనసాగుతోంది
జిల్లాలో పీ-4 కార్యక్రమంతో అర్హులైన 43,021 నిరుపేద కుటుంబాలను గుర్తించాం. ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు వీలుగా మార్గదర్శకుల గుర్తింపు పక్రియ నిత్యం సాగుతోంది. ఇప్పటికే 457 మందిని గుర్తించాం. త్వరలో మరింత మందిని గుర్తిస్తాం. మార్గదర్శకులు కూడా ఎవరైనా వారికి జాబితాలో ఇష్టమైన కుటుంబాలను ఎంపిక చేసుకుని తగిన విధంగా ఆదుకోవచ్చు. నిరుపేదలకు పీ-4 విధానం ఒక వరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయం.
- కలెక్టర్ రాజకుమారి, నంద్యాల