స్వాతంత్య్ర దీప్తి.. సంగ్రామ స్ఫూర్తి..
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:04 AM
బ్రిటీషు వారి దాస్య శృంఖలాల నుంచి భారత మాత విముక్తికి పోరాడిన వీరుల ఖిల్లా కర్నూలు జిల్లా. తెల్లదొరలు సాగించిన దారుణ పాలనపై గొంతెత్తి సింహాల్లా గర్జించిన ధీరుల జిల్లా ఇది.
త్యాగధనుల ఖిల్లా.. కందనవోలు జిల్లా
చెరిగిపోని మహనీయుల అడుగు జాడలు
కర్నూలు కల్చరల్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): బ్రిటీషు వారి దాస్య శృంఖలాల నుంచి భారత మాత విముక్తికి పోరాడిన వీరుల ఖిల్లా కర్నూలు జిల్లా. తెల్లదొరలు సాగించిన దారుణ పాలనపై గొంతెత్తి సింహాల్లా గర్జించిన ధీరుల జిల్లా ఇది. చరిత్రలో లిఖించిన 1857 సిపాయిల తిరుగుబాటుకు పూర్వమే చరిత్రకెక్కని రైతాంగ పోరాటం ఈ జిల్లాలో జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీపై 1801లో తొలిసారిగా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన స్మరణీయుడు ముతుకూరి గౌడప్ప. వహాబీ ఉద్యమ స్ఫూర్తితో ఆంగ్లేయులపై 1839లో యుద్ధ భేరి మోగించిన చారిత్రక పురుషుడు కర్నూలు నవాబు గులాం రసూల్‌ఖాన్. బ్రిటీషు దొరల అరాచకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి, 1846-47 కాలంలో మడమ తిప్పని పోరాటం చేసిన యుద్ధ యోధు డు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఇలా ఎందరో తొలితరం త్యాగధనులు వీరోచిత పోరాటాలతో మన కళ్లముందు నిలిచిపోతారు. మలితరం సంగ్రా మంలో గాంధీజీ చూపిన అహింసా మార్గంలో శాంతియుత ఉద్యమాలు చేసి జైళ్లలో జీవితాలను గడిపిన మహనీయులున్నారు. వారిలో జిల్లా నుంచి గాడి చర్ల హరి సర్వోత్తమరావు, కాదర్‌బాద్ నరసింగరావు, మేడం వెంకయ్య శెట్టి, బియాబానీ, ముచ్చుకోట వెంకట్రామయ్య, వనం శంకర శర్మ, ధరణి రామచం ద్రరావు, నివర్తి వెంకటసుబ్బయ్య, సర్దార్ నాగప్ప, అమరావతమ్మ, యాళ్లూరి స్వామిరెడ్డి, గామాగో, దామోదరం సంజీవయ్య, గుర్రం వెంకటరెడ్డి, పెండేకంటి వెంకటసుబ్బయ్య బ్రిటీషు వారిని ఎదురించి లాఠీ దెబ్బలు తిన్నారు. కారా గారాల్లో చిత్రహింసలు అనుభవించారు. తమ జీవితం తోపాటూ ఆస్తిపాస్తులను కూడా సంగ్రామ స్ఫూర్తికే అంకితం చేశారు. శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అలనాటి స్ఫూర్తి ప్రదాతల త్యాగనిరతిపై ప్రత్యేక కథనం.
తెల్లదొరలపై తిరబడ్డ గౌడప్ప
దత్త మండలాల్లో బ్రిటీషు వారిపై తొలి తిరుగుబాటు బావుటా ఎగురవేసి, రైతాంగ పోరా టానికి నాంది పలికిన ఘనత దేవనకొండ మండలం తెర్నేకల్లు గ్రామ పెద్ద ముతుకూరి గౌడప్పకు దక్కుతుంది. బ్రిటీషు వారితో పదిహేను రోజులు యుద్ధం చేసి ఉరికంబం ఎక్కాడు. నిజాం బ్రిటీషు వారితో సైన్య సహకార పద్ధతికి ఒప్పుకొని, కొంతకాలానికి సొమ్ము చెల్లించలేక డబ్బుకు బదులు బళ్లారి, అనంతపురం, కడప, కర్నూలు ప్రాంతాలను వారికి దత్తత ఇచ్చేశాడు. దీంతో ఈ ప్రాంతాలు దత్త మండలాలుగా పేరు పడ్డాయి. దత్త మండలానికి మొత్తం కలెక్టరేట్‌గా అనంతపురం ఉండేది. సీమలో కరువుతో తక్కువ పన్ను వసూలయ్యేది. 50 శాతం పన్ను అదనంగా పెంచా రు. దీన్ని వ్యతిరేకించిన గౌడప్ప బ్రిటీషు సైన్యంతో తలపడ్డాడు. 15 రోజుల పాటూ జరిగిన యుద్ధంలో 40 మందికి పైగా గ్రామస్థులు చంపబడ్డారు. చివరికి గౌడప్ప బ్రిటీషు వారికి చిక్కి ఊరి వాకిలి ముందు ఉరి వేయబడ్డా డు. ‘తెరిణెకంటి ముట్టడి’గా ఈ పోరాటాన్ని పిలుస్తారు.
స్వరాజ్య నిధికి వందల ఎకరాలిచ్చిన బియాబానీ
‘ఆంగ్లేయుల వ ద్ద బానిసగా పనిచేయను..’ అంటూ ప్రకటించిన దేశభక్తుడు బియాబానీ. పదవులు, మహాత్మాగాంధీ ఆశయాలను పాటిస్తూ తనకున్న ఐదు వందల ఎకరాలపైగా భూమిని విరాళంగా ఇచ్చివేసిన మహాదాత బియాబానీ. కర్నూలు జిల్లా చరిత్రలోనే ఇంత భూమి విరాళం ఇచ్చిన దాత ఇప్పటివరకు ఎవరూ లేరు. 1923లో జాతీయ పతాక, సత్యాగ్రహ ఉద్యమంలో బియాబానీ పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.
స్మరణీయుడు నివర్తి వెంకట సుబ్బయ్య
జిల్లాలో స్మరణీయ నాయకునిగా నివర్తి వెంకట సుబ్బయ్య నిలిచిపోతారు. తాలూకా ఆఫీసులోని తన ఉద్యోగానికి రాజీనామా చేసి సాతంత్య్ర పోరాటంలో ప్రవేశించాడు. 1932లో ప్రకాశం పంతులు స్థాపించిన స్వరాజ్య పత్రికలో సంపాదకుడిగా పనిచేశారు. 1936లో వ్యక్తి సత్యాగ్రహం ప్రారంభించగా 1940లో బ్రిటీషు ప్రభుత్వం ఈయన్ను జైలుకు పంపించింది.
గులాం రసూల్.. సలాం
కర్నూలు చివరి నవాబు గులాం రసూల్‌ఖాన్. అసమాన పోరాటం చేసి అసువులు బాసిన త్యాగధనుడు. గులాం రసూల్‌ఖాన్ 1792 నుంచి కర్నూలును పాలించిన నవాబు అలూఫ్‌ఖాన్ కుమారుడు. అలూఫ్ ఖాన్ తండ్రి మునవర్ ఖాన్ మరణాంతరం రాజ్యాన్ని పొందగా, అప్పట్లో ఈ రాజ్యం మైసూరు నవాబుల పాలనలో ఉండేది. అలూఫ్ ఖాన్ పాలనలోనే మూడో మైసూరు యుద్ధం కారణంగా ఈ ప్రాంతం నిజాం నవాబు పాలనలోకి వచ్చింది. 1799లో నిజాం నవాబు, ఈస్టిండియా పాలకులు కలిసి శ్రీరంగపట్టణాన్ని ముట్టడించి టిప్పు సుల్తాన్‌ను చంపేశారు. ఈ పరిణామం అనంతరం సైనిక ఖర్చుల కింద కడప, కర్నూలు, బళ్లారి ప్రాంతాలు బ్రిటీషు వారి కిందికి వెళ్లిపోయాయి. గులాం రసూల్‌ఖాన్ చివరి కొడుకు కావడం, ఆయనపై చాలా ప్రేమ ఉన్న అలూఫ్ ఖాన్ నాటి గవర్నర్ మింటోను ఒప్పించి రసూల్ ఖాన్‌ను నవాబు చేశారు. ఈస్టిండియా కంపెనీకి ఆఫ్ఘనిస్థాన్ చక్రవర్తికి యుద్ధం వచ్చింది. ఇందులో ఆఫ్ఘన్ చక్రవర్తి విజయం సాధిస్తారని నమ్మిన రసూ ల్‌ఖాన్ రహస్యంగా కర్నూలు కోటలో ఆయుధాలు తయారు చేసి, బ్రిటీషు సైన్యాధ్యక్షుడితో పోరాటం చేశాడు. 1839 అక్టోబర్ 18న జోహరాపురం వద్ద జరిగిన యుద్ధంలో అనేక మంది నవాబు సైనికులు, ఆంగ్ల సిపాయిలు మరణించారు. చివరకు కర్నూలు నవాబును పట్టి బంధించిన ఆంగ్లేయులు విచారణ పేరుతో తమిళనాడులోని తిరుచునాపల్లి జైలుకు తరలించారు. అక్కడే ఆయనకు ఒక సేవకుడి ద్వారా భోజనంలో విషం పెట్టి చంపించారు.
ఆంధ్రా అంబేడ్కర్‌గా సర్దార్ నాగప్ప ఖ్యాతి పొందారు. కర్నూలు పట్టణానికి చెందిన సర్దార్ నాగప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. జాతీయోధ్యమంపట్ల ఆకర్షితులయ్యారు. 1936లో ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికయ్యారు. 1937లో రిజర్వ్‌డ్ స్థానం నుంచి మరలా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బ్రిటీషు వారికి వ్యతిరేకంగా పోరాడినందుకు 1940లో ఒక ఏడాది పాటు బళ్లారి, వేలూరు, తిరుచు నాపల్లి జైళ్లలో కఠిన కారాగార శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యానంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌తో కలిసి పనిచేసిన తొమ్మిది మంది సభ్యు ల్లో ఒకరిగా సర్దార్ నాగప్ప పనిచేశారు. జైౖలు జీవితం అనుభవిం చిన నారీమణిగా అమరావతమ్మ నిలిచిపోతారు. పురుషులతో సమానంగా సంగ్రామ పోరాటం చేసి, జైలు జీవితాన్ని అను భవించిన ధైర్యశాలి ఆమె. 1913లో జన్మించిన అమరావతమ్మ చిన్న వయసులో సర్దార్ నాగప్పను వివాహం చేసుకున్నారు. భర్త చూపిన మార్గంలోనే ఆమె పయనించారు. తానుకూడా మహాత్ముని సూచనలు పాటిస్తూ, స్త్రీలలో జాతీయ భావనలు నింపేవారు. దీంతో ఆమెను కర్నూలు సబ్‌జైలులో 1941లో పది నెలలపాటు కారాగార శిక్ష విధించారు. జైలు జీవి తం నుంచి బయటకు వచ్చాక తిరి గి ఆమె క్విట్ ఇండియా ఉద్యమం లో 1942లో పాల్గొని తిరిగి ఏడాది పాటు జైలు శిక్షను అనుభవిం చారు.
అక్షర యోధుడు వనం శంకర శర్మ..
సంఘ సంస్కర్త ధరణి రామచంద్రరావు
ప్రజల్లో స్వాతంత్ర్యోద్యమ కాంక్షను రగిలించడానికి, దేశభక్తిని పెంపొందించడానికి అక్షరాలనే ఆయుధాలుగా మలిచి, నిర్భయంగా బ్రిటీషు పాలకుల దమననీతిని నిరసిస్తూ పత్రికను నడిపిన వీరుడు వనం శంకర శర్మ. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కర్తగా ధరణి రామచంద్రరావు ఖ్యాతి గాంచారు. పత్తికొండ తాలూకాలోని పి.కోటకొండ గ్రామంలో 1904 ఆగస్టు 4న జన్మించిన ఆయన కర్నూలు మున్సిపల్ స్కూల్‌లో పాఠశాల విద్య, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల్లో ఉన్నత విద్య అభ్యసించారు. పత్తికొండలో స్వాతంత్య్ర సమరయోధుడు వనం శంకరశర్మతో ఏర్పడిన సాంగత్యం ఆయన్ను స్వాతంత్య్ర సంగ్రామం వైపు మళ్లించింది. ఐంద్రావతి పత్రికకు ఉప సంపాదకుడిగా పనిచేశారు. గాడిచర్ల హరి సర్వోత్తమరావుతో కలిసి స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.