అధి‘కార్ల’ మాయ..!
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:17 AM
నిబంధనల మేరకు వ్యవహరించాల్సిన అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు.
సొంత వాహనాలపై ప్రభుత్వ స్టిక్కర్
నకిలీ బిల్లులతో రూ. లక్షల్లో ప్రభుత్వ డబ్బు స్వాహా..
సీసీలు, అటెండర్లు కార్ల డ్రైవర్లు
లైసెన్సు లేని డ్రైవర్లతో అద్దె వాహనాలు
నిబంధనల మేరకు వ్యవహరించాల్సిన అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రతి నెలా రూ. వేలు, లక్షల్లో జీతాలు తీసుకుంటున్న అధికారులు చిన్న చిన్న మొత్తాలకు కక్కుర్తి పడుతున్నారు. కార్యాలయంలో ధనార్జనే ధ్యేయంగా పని చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 100 శాఖల్లోని ఉన్నతాధికార్ల పనుల కోసం ఎల్లో బోర్డు ఉన్న ఓనర్ కమ్ డ్రైవర్ల వాహనాలున్న నిరుద్యోగ యాజమాన్యాలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే ఇదంతా అధికారులు స్వప్రయోజనంతో తారుమారైపోయింది.
కర్నూలు కలెక్టరేట్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే కొందరు అధికారులు సొంత కార్లను ప్రభు త్వ కార్యాలయాలకు అద్దె వాహనాలుగా ఉపయోగిస్తున్నారు.. మరికొందరు అధికారులు వాహనాలు వాడకుండానే నకిలీ బిల్లులు పెట్టి ప్రజాధనాన్ని జేబులో వేసుకుంటున్నారు. కొంత మంది అధికారులు అద్దె వాహనాలున్న వ్యక్తి నుంచి కాగితాలు తీసుకుని వివరాలను నమోదు చేసి బిల్లులు వచ్చిన వెంటనే వారి జాబితాలో డబ్బులు జమ అయ్యేలా చూసి, ఆ తర్వాత వారి నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బు కోసం చట్టవిరుద్ధంగా ప్రభుత్వాన్ని మాయ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సొంత వాహనాలపై ప్రభుత్వ స్టిక్కర్
సొంత అవసరాల కోసం ఉపయోగించే కార్లకు తెలుపు రంగు ప్లేటు.. అద్దె కోసం నడిచే వాహనాలకు పసుపు రంగు ప్లేటు ఉండాలి. సొంత వాహనాలపై ప్రభుత్వ డ్యూటీ స్టిక్కర్ వేసి అధికారులు జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారు. జిల్లాలో సగానికి పైగా శాఖలలో అధికారులు వైట్‌బోర్డు వాహనాలను వినియోగిస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి గుట్టుగా ఈ దందా కొనసాగుతోంది. సొంత వాహనాలను అద్దె వాహనాలుగా చూపి బినామీ బిల్లులు తీసుకునే అధికారుల సంఖ్య పెరిగిపోయింది. ప్రతి అధికారి ఆ శాఖ కేటాయించిన వాహనం నెలకు 2,500 కిలోమీటర్లు తిరగాల్సి ఉంటుంది. అధికారులు సంబంధిత శాఖలో పని చేసే సీసీలు, అటెండర్ క్లర్కులను డ్రైవర్లుగా వినియోగించుకుంటున్నారు.
రూ.లక్షలు స్వాహా
ప్రజా సేవ కోసం క్షేత్ర స్థాయిలో పర్యటించేందుకు అవసరమైతే వాహనాలను అద్దె తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. రెవెన్యూ, ఎంపీడీవో, విద్యాశాఖ, ట్రెజరీ, తహసీల్దార్, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, హౌసింగ్, మున్సిపల్, అంగన్‌వాడీ, మహిళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య, విద్యాశాఖ తదితర విభాగాల అధికారులకు అద్దె వాహనాలను వినియోగించుకున్నందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
జిల్లాలోని ఉన్నతాధికారులకు నెలకు రూ.60వేలు, జిల్లా స్థాయి అధికారి వాహనానికి నెలకు రూ.45వేలు, మండల స్థాయి అధికారులు అయితే.. 35వేలు అద్దె చెల్లిస్తోంది. కానీ కొందరు అధికారులు సొంత కారులను వినియోగిస్తూ ప్రతి నెల బిల్లు పెట్టి డబ్బులు డ్రా చేస్తున్నారు. మరికొందరు క్షేత్రస్థాయి పర్యటించకుండానే బిల్లులు స్వాహా చేస్తున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో కొంత మంది జిల్లా అధికారులు సొంత వాహనాలను అద్దెకిచ్చి బిల్లుల స్వాహా చేస్తే.. మరో శాఖ అధికారి అద్దె వాహనాన్ని కొనుగోలు చేసి ఆ వాహనాన్ని సొంత వాహనంగా వినియోగించుకుని బిల్లులు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. మరో అధికారి సొంత కారు వినియోగించకుంటూ తానే డ్రైవింగ్ చేసుకుంటూ డ్రైవర్ సొమ్మును కూడా వినియోగించుకుంటున్నారు. అధికారులే అదనపు ఆదాయం కోసం ఆశపడుతున్నారు.
నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలి
జిల్లా అధికారుల దారుల్లోనే మండల స్థాయిలో పని చేసే కొందరు ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు అదికారులు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అద్దె వాహనాల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి ప్రజాధనం వృఽథా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రజా సంఘాలు, ఓనర్ కమ్ డ్రైవర్స్ అసోసియేషన్, సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా తెలుపు రంగు వాహనాలను తొలగించి ఎల్లో బోర్డు వాహనాలున్న ఓనర్ కమ్ డ్రైవర్స్ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ రుణాలపై కారు తీసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గిరిజన ఓనర్ కమ్ డ్రైవర్ల లబ్ధిదారులు వాహనాల రుణాలు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విచారణ చేపడతాం
ప్రతి అధికారి ప్రభుత్వ నిబంధనలను పాటించాలి. ఎవరైనా నిబంధనలను అతిక్రమిసే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఎల్లో బోర్డు వాహనాలు మాత్రమే అద్దె వాహనాలుగా ఉండాలి. వైట్ బోర్డు వాహనాలు ఉపయోగించరాదు.
నూరుల్ కమర్, జాయింట్ కలెక్టర్