Share News

తెలుగు రాష్ట్రాల ‘గుండె’రేవుల..!

ABN , Publish Date - Jun 10 , 2025 | 11:58 PM

తుంగభద్రపై గుండ్రేవుల ‘జల’ఆశయం సిద్ధిస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు జలవారధి ఏర్పడుతుంది. కరువు పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు గుండ్రేవుల జలాశయం నిర్మాణం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

తెలుగు రాష్ట్రాల ‘గుండె’రేవుల..!
గుండ్రేవుల నిర్మాణానికి ప్రతిపాదించిన తుంగభద్ర నది ప్రాంతం

52.5 టీఎంసీలకు పెంచాలని ఆలోచన

తెలంగాణ కూడా గుండ్రేవులకు సానుకూలం

నేడు జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు

జలాశయంపై స్పందించాలని పలువురి కోరిక

తుంగభద్రపై గుండ్రేవుల ‘జల’ఆశయం సిద్ధిస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు జలవారధి ఏర్పడుతుంది. కరువు పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు గుండ్రేవుల జలాశయం నిర్మాణం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు కృష్ణా నది యాజమాన్య బోర్డుకు (కేఆర్‌ఎంబీ), తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. తెలంగాణ కూడా సానుకూలంగా ఉంది. ఈ క్రమంలో జలాశయం సామర్థ్యం 52.5 టీఎంసీలకు పెంచాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి చర్చలు జరిపితే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఓ కొలిక్కి వస్తుందని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. నేడు జిల్లా ఇన్‌చార్జి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లాకు వస్తున్న సందర్భంగా గుండ్రేవుల జలాశయంపై ప్రత్యేక కథనం.

కర్నూలు, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర ద్వారా ఏటా 135 నుంచి 150 టీఎంసీలకు పైగా వరద జలాలు కృష్ణాలో కలసి కడలిపాలు అవుతున్నాయి. బచావత్‌ అవార్డు (కేడబ్ల్యూడీటీ-1) మేరకు కర్నూలు-కడప (కేసీ) కాలువకు 39.90 టీఎంసీలు కేటాయించారు. కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో కేసీ కాలువ కింద 2.65,628 ఎకరాలకు సాగు, కర్నూలు నగరం సహా పలు పట్టణాలు, గ్రామాలకు తాగునీరు ఇవ్వాల్సి ఉంది. నికర జలాలు ఉన్నా.. నిల్వ చేసుకునే జలాశయం లేదు. కేసీ కెనాల్‌కు నీటిని మళ్లించే సుంకేసుల బ్యారేజీ సామర్థ్యం కేవలం 1.20 టీఎంసీలు మాత్రమే. తుంగభద్ర డ్యాంలో 10 టీఎంసీలు నిల్వ చేసి వేసవిలో తీసుకోవచ్చు. అయితే దాదాపు 200 కిలోమీటర్లు ప్రవహించి సుంకేసుల బ్యారేజీకి చేరాలంటే వాటా జలాల్లో 25-30 శాతం కూడా దక్కే పరిస్థితి లేదు. గడ్డుకాలంలో సాగు, తాగునీటి కోసం కన్నీటి కష్టాలు తప్పడం లేదు. సుంకేసుల బ్యారేజీ ఎగువన సి.బెళగల్‌ మండలం గుండ్రేవుల వద్ద తుంగభద్రపై కేసీ వాటా జలాల్లో 20 టీఎంసీలు నిల్వ చేసుకునేలా గుండ్రేవుల జలాశయం నిర్మిస్తే కేసీ ఆయకట్టుతో పాటు ఎగువన కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో నీటి కష్టాలు తీరుతాయని సీమ సాగునీటి నిపుణుడు, రిటైర్డ్‌ ఈఈ సుబ్బరాయుడు సూచిస్తున్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు రూపశిల్పిగా ఆయన ఉమ్మడి ఆంఽధ్రప్రదేశ్‌ చివరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈ మేరకు నివేదించడంతో సర్వే కోసం ప్రభుత్వం రూ.53 లక్షలు ఇచ్చింది. ఆర్వీ అసోసియేట్స్‌ సంస్థ సర్వే చేసి డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) ప్రభుత్వానికి పంపించింది.

చంద్రబాబు నిధులిస్తే.. జగన్‌ అటకెక్కించారు

2019 ఫిబ్రవరి 21న అప్పటి సీఎం చంద్రబాబు గుండ్రేవుల జలాశయం నిర్మాణానికి రూ.2,890 కోట్లు నిధులు మంజూరు చేస్తూ జీవో ఆర్టీ నెంబరు.154 జారీచేశారు. మార్చిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఈ జలాశయంలో అంతర్‌ రాష్ట్ర సమస్య ఉందని అటకెక్కించింది.

రెండు రాష్ట్రాలకు జల ప్రయోజనం

గుండ్రేవుల జలాశయం 52.5 టీఎంసీలకు పెంచాలని ప్రతిపాదన తెరపైకి వచ్చింది. తుంగభద్ర నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఆర్డీఎస్‌ ఎడమ కాలువ ద్వారా 15.6 టీఎంసీలు నికర జలాలు వాటా ఉంది. కర్ణాటక రాష్ట్రంలో సుమారు 50 కిలో మీటర్లు ప్రవహించాల్సి ఉండడంతో 5-6 టీఎంసీలు కూడా వాడుకునే పరిస్థితి లేదని ఆ రాష్ట్రానికి చెందిన ఆర్డీఎస్‌ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ సీతారామిరెడ్డి పేర్కొంటున్నారు. దీంతో తెలంగాణ కూడా 15 టీఎంసీలు వాడుకోవడానికి వీలుగా గుండ్రేవుల సామర్థ్యం 35 టీఎంసీలకు పెంచాలని ఆ రాష్ట్రం ప్రతిపాదించినట్లు సమాచారం. ఉమ్మడి కర్నూలు జిల్లా నీటి అవసరాల దృష్ట్యా 52.5 టీఎంసీలకు పెంచితే, ఏపీ 34.5 టీఎంసీలు, తెలంగాణ 13-14 టీఎంసీలు, కర్ణాటకకు 4.5 టీఎంసీలు ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ సైతం సానుకూలంగా ఉండడంతో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. గుండ్రేవుల సామర్థ్యం 52.5 టీఎంసీలకు పెంచేందుకు సాధ్యసాధ్యలపై ప్రాజెక్టు రూపకర్త, రిటైర్డ్‌ ఈఈ సుబ్బరాయుడు ప్రభుత్వానికి మరో లేఖ రాస్తున్నారు. నేడు జిల్లా పర్యటనకు వస్తున్న జిల్లా ఇన్‌చార్జి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని పలువురు కోరుతున్నారు.

కూటమి ప్రభుత్వం రావడంతో కదలిక

తిరిగి కూటమి ప్రభుత్వం రావడంతో గుండ్రేవుల జలాశయం ఫైల్‌ కదిలింది. మంత్రి టీజీ భరత్‌, ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు, పాణ్యం ఎమ్మెల్యేలు బొగ్గుల దస్తగిరి, గౌరు చరితమ్మలు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌, జిల్లా ఇన్‌చార్జి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల ప్రకారం రూ.4,530 కోట్లు గుండ్రేవుల జలాశయం నిర్మాణానికి కావాలని ఈ ఏడాది జనవరి 7న ఉమ్మడి జిల్లా ప్రాజెక్ట్స్‌ సీఈ కబీర్‌బాషా ప్రభుత్వానికి సమగ్ర వివరాలతో నివేదిక పంపారు. కేఆర్‌ఎంబీ, తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలుస్తోంది.

Updated Date - Jun 10 , 2025 | 11:58 PM