Share News

కృష్ణమ్మను వరించిన అదృష్టం

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:00 AM

తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్ష పీఠం ఆపార్టీ రాష్ట్ర రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి గుడిసె కృష్ణమ్మను వరించింది.

కృష్ణమ్మను వరించిన అదృష్టం

బీసీ వాల్మీకి మహిళా కోటాలో అవకాశం

ప్రధాన కార్యదర్శిగా పి.నాగరాజు యాదవ్‌

కర్నూలు, డిసెంబరు 21 ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్ష పీఠం ఆపార్టీ రాష్ట్ర రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి గుడిసె కృష్ణమ్మను వరించింది. ఈ మేరకు పార్టీ హైకమాండ్‌ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ప్రధాన కార్యదర్శిగా పూల నాగరాజు యాదవ్‌ (బిగ్గిం నాగరాజు) ఎంపికయ్యారు. జిల్లా టీడీపీ అధ్యక్ష పీఠం అధిష్టించబోతున్న తొలి మహిళ కృష్ణమ్మ కావడం విశేషం. వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ఆమెకు బీసీ-మహిళా కోటాలో ఈఅవకాశం దక్కింది. పార్టీ ఆవిర్భావం తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న 12వ వ్యక్తి ఈమె. కూటమి అధికారంలోకి వచ్చాక 18 నెలల తర్వాత ప్రస్తుత అధ్యక్షుడు తిక్కారెడ్డి స్థానంలో గుడిసె కృష్ణమ్మకు అవకాశం ఇచ్చారు.

కోసిగి మండలం కోల్‌మాన్‌పేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌, వ్యాపారవేత్త గుడిసె రామలింగప్ప ఆదోనిలో స్థిర పడ్డారు. మార్కెట్‌ యార్డు కమీషన్‌ ఏజెంటుగా వ్యాపారాన్ని మొదలు పెట్టారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు సంతానం. చివరి కుమార్తె గుడిసె కృష్ణమ్మ డిగ్రీ (బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌) పూర్తిచేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదోని నుంచి ఆమె టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. ఆతర్వాత తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మూడు పర్యాయాలు పనిచేశారు. 2017లో ఆంధ్రప్రదేశ్‌ ఫుడ్‌ కమిషన్‌ సభ్యురాలుగా నియమితులయ్యారు. 2024లో కృష్ణమ్మకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా బాద్యతలు అప్పగించారు. అలాగే అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పార్టీ పరిశీలకురాలిగా పని చేశారు. ఒకటి రెండు రోజుల్లో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.

నగరాధ్యక్షుడు నాగరాజుకు ప్రమోషన్‌

టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ కర్నూలు నగర అధ్యక్షుడు పూల నాగరాజు యాదవ్‌ (బిగ్గిం నాగరాజు)ను అధినేత, సీఎం చంద్రబాబు, యువనేత నారా లోకేశ్‌ ఎంపిక చేశారు. ఈయన తండ్రి బాలయ్య ప్రభుత్వ ఉద్యోగి. తల్లి కృష్ణమ్మ గృహిణి. అయితే రాజకీయాల పట్ల ఆసక్తితో 1995లో కృష్ణమ్మ కర్నూలు కార్పొరేషన్‌ కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు. తల్లి బాటలో నాగరాజు యాదవ్‌ రాజకీయాల్లో అడుగు పెట్టి 2000లో జరిగిన కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రె్‌సలో చేరారు. అక్కడి నుంచి వైసీపీలో చేరి ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2022లో టీజీ భరత్‌ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

అధినేత రుణం తీర్చుకోలేనిది

అధినేత, సీఎం చంద్రబాబు, యువనేత, మంత్రి నారా లోకేశ్‌ నాకు టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించి రాజకీయంగా పునర్జన్మ ఇచ్చారు. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించను. వారి రుణం జీవితంలో తీర్చుకోలేనిది. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లాలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తాను. పార్టీలో అందరినీ కలుపుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని అత్యధికస్థానాల్లో గెలిపించేందుకు కృషి చేస్తాను.

గుడిసె కృష్ణమ్మ టీడీపీ బలోపేతమే లక్ష్యం

తెలుగుదేశం పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తాను. అద్యక్షురాలు కృష్ణమ్మ, ఎంపీ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు, ముఖ్య నాయకుల సూచనలు, సలహాలతో పార్టీని అన్ని వర్గాల్లో బలోపేతం కోసం కృషి చేస్తా. ఈ పదవి రావడానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు.

నాగరాజు యాదవ్‌

గౌరు చరితకు అనుకోని అవకాశం

ప్రధాన కార్యదర్శిగా మరోసారి ఎన్‌ఎండీ ఫిరోజ్‌

అధినేత, సీఎం వ్యూహాత్మక నిర్ణయం

నంద్యాల, డిసెంబరు21(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎంపిక విషయంలో అం చనాలు తప్పాయి. ఊహకు అందని విధంగా పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిని నియమించారు. జిల్లా ప్రధాన కార్య దర్శిగా మరోసారి ఎన్‌ఎండీ ఫిరోజ్‌కే అవకాశం దక్కింది. ఈమేరకు పార్టీ నుంచి ఆదివారం అధికారికంగా ఉత్తర్వు లు వెలువడ్డాయి. జిల్లా అధ్యక్ష పదవికి 12 మంది పోటీపడ్డారు. వీరిలో ధర్మవరం సుబ్బారెడ్డి, తులసీరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిల పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఒక దశలో ధర్మవరం సుబ్బారెడ్డి అధ్యక్షుడిగా ఎంపికైనట్లు వార్తలు రావడం, పార్టీ సంకేతాలు కూడా అలాగే వచ్చా యి. తొలినుంచి సస్సెన్స్‌గా సాగిన జిల్లా అధ్యక్ష ప్రక్రియలో చివరకు మహిళా కోటాలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఎంపిక కావడం విశేషం. కూటమి అధికారంలోకి వచ్చాక 18 నెలల తర్వాత ప్రస్తుత అధ్యక్షుడు రాజశేఖర్‌ స్థానంలో గౌరు చరితకు అవకాశం దక్కింది.

గౌరు మూడుసార్లు ఎమ్మెల్యే..

జిల్లా అధ్యక్ష పదవికి ఎంపికైన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపొందారు. ఆమె స్వగ్రామం నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామం. భర్త గౌరు వెంకటరెడ్డి గతంలో ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2004లో కాంగ్రెస్‌ తరుపున నందికొట్కూరు నుంచి గెలుపొందిన గౌరుచరిత 2014లో వైసీపీ తరుపున పాణ్యంలో గెలుపొందారు. అనంతరం 2019లో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. 2024లో ప్రస్తుత వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై 43 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

యూత్‌ లీడర్‌ ఫిరోజ్‌కు మరో అవకాశం

తాజా జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఎన్‌ఎండీ ఫీరోజ్‌కే దక్కింది. ఈయనకు జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి మూడోసారి దక్కినట్లైంది. ఈయన మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ కుమారుడు. టీడీపీ యూత్‌ లీడర్‌గా ఆయనకు ప్రజల్లో మంచి క్రేజ్‌ ఉంది. 2009లో ఉమ్మడి జిల్లాకు ప్రఽధాన క్యాదర్శిగా.. ఆ తర్వాత 2021, తాజాగా మరోసారి అవకాశం దక్కింది. జిల్లా అధ్యక్ష పదవికి ఎన్‌ఎండీ ఫీరోజ్‌ పోటీ పడ్డారు. కానీ చివరికి యధావిధిగా పాత పదవి (జిల్లా ప్రధాన కార్యదర్శినే) సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏది ఏమైనా.. గతంలో మాదిరిగా కాకుండా తాజాగా జిల్లా అధ్యక్షురాలైన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌లు జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని టీడీపీ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

అనుకోని అవకాశం

జిల్లా అధ్యక్ష పదవి నాకు అనుకోకుండా వచ్చింది. పాణ్యం నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. ఎమ్మెల్యే స్థాయిలోనే చాలా చేయాల్సి ఉంది. భవిష్యత్తులో జిల్లా అధ్యక్ష స్థాయిలో సేవలందించాలంటే.. మరింత బాధ్యతగా చేయాల్సి ఉంటుంది. పార్టీ పెద్దల ఆశీర్వాదంతో ఇచ్చిన పదవికి ఎలాంటి మచ్చ లేకుండా సేవలందిస్తాం. అందరితోను కలిసిమెలిసి ముందుకు వెళ్తాను.

- గౌరు చరితారెడ్డి, ఎమ్మెల్యే, పాణ్యం

సీఎం సార్‌కు కృతజ్ఞతలు

టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాకు మూడోసారి అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉంది. సీఎం సార్‌కు కృతజ్ఞతలు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితర ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు. బాధ్యతగా సేవలందించి పార్టీ కోసం శ్రమిస్తాను. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, మద్దతుదారులను గెలిపించుకుంటాం.

- ఎన్‌ఎండీ ఫీరోజ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి

Updated Date - Dec 22 , 2025 | 12:00 AM