Share News

రైతుల ప్రయోజనమే లక్ష్యం

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:32 AM

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (ఎస్‌డబ్ల్యూసీ)ను బలోపేతం చేయడంతో పాటు రైతులకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఆ సంస్థ రీజనల్‌ మేనేజర్‌ నాగరాజు తెలిపారు.

రైతుల ప్రయోజనమే లక్ష్యం
గోదాము వద్ద కాటాను పరిశీలిస్తున్న ఆర్‌ఎం

రీజనల్‌ మేనేజర్‌ నాగరాజు

కర్నూలు అగ్రికల్చర్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గిడ్డంగుల సంస్థ (ఎస్‌డబ్ల్యూసీ)ను బలోపేతం చేయడంతో పాటు రైతులకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఆ సంస్థ రీజనల్‌ మేనేజర్‌ నాగరాజు తెలిపారు. గురువారం కడప నుంచి కర్నూలు వచ్చిన ఆయన కర్నూలు నగరంలోని రేడియోస్టేషన్‌ వద్ద ఉన్న ఎస్‌డబ్ల్యూసీ గోదాములను పరిశీలించారు. గత నాలుగేళ్లుగా ఎటువంటి వినియోగం లేకుండా ఉన్న ఈ గోదాములకు పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన 6వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని నిల్వ చేసేందుకు సంస్థ ఎండీ నవ్య, చైర్మన్‌ వెంకటేశ్వరరావు చర్యలు తీసున్నారు. ఈ గోదాములకు బియ్యం రైల్వే రేకు పాయింట్‌ నుంచి వస్తుండడంతో గోదాములను పరిశీలించేందుకు వచ్చామనీ ఆర్‌ఎం సుధాకర్‌ తెలిపారు. ఈ సందర్భంగా లారీలను నిల్వ చేసేందుకు, అదే విధంగా తూకం వేసేందుకు ఏర్పాటు చేసిన వేయింగ్‌ కాటాను పరిశీలించారు. ఆర్‌ఎం విలేకరులతో మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా రాయలసీమలోని ఎస్‌డబ్ల్యూసీ గోదాముల్లో ఆహార ఉత్పత్తుల నిల్వలు లేక నిరూపయోగంగా ఉన్నాయని, ప్రస్తుతం ఆ గోదాములన్నింటిలో పౌరసరపరాల సంస్థకు చెందిన బియ్యంతో పాటు రైతుల నుంచి సేకరించిన ఆహార ఉత్పత్తులను నిల్వ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. కర్నూలు, కడప, అనంతపురం ఉమ్మడి జిల్లాలో 1,12,789 మెట్రిక్‌ టన్నుల ఆహార ఉత్పత్తులను నిల్వ చేసే సామర్థ్యం నిల్వ ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ గోదాముల్లో పూర్తి స్థాయిలో ఆహార ఉత్పత్తులను నిల్వ ఉంచేలా ఎస్‌డబ్ల్యూసీ ఎండీ, చైర్మన్‌ వైస్‌, చైర్మన్‌ ఆదేశించారని చెప్పారు. ఇందులో భాగంగానే సంస్థ గోదాములను ఏవేవి నిరూపయోగంగా ఉన్నాయో గుర్తించి వాటిల్లో సివిల్‌ సప్లయ్‌ చెందిన బియ్యంతో పాటు రైతుల నుంచి సేకరించిన ఆహార ఉత్పత్తులను నిల్వ చేసేందుకు త్వరితగతిన చర్యలు చేపడుతున్నామని ఆర్‌ఎం చెప్పారు. నంద్యాలలో 9వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సంస్థ గోదాముల్లో నిల్వ చేసేందుకు చర్యలు తీసుకున్నామని, అదే విదంగా డోన్‌లో రైతులకు సంబందించిన 2వేల మెట్రిక్‌ టన్నుల కందులను నిల్వ చేశామని, నాలుగేళ్లుగా నిరూపయోగలో ఉన్న కర్నూలు నగరంలోని రేడియోస్టేషన్‌ వద్ద ఉన్న ఎస్‌డబ్ల్యూసీ గోదాముల్లో 6వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని నిల్వ చేస్తున్నామని తెలిపారు. కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీనగర్‌ వద్ద ఉన్న గోదాములను పూర్తిస్థాయిలో ఆధునికీకరించి సంసకు ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకునే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు.

Updated Date - Nov 21 , 2025 | 12:32 AM