రైతు సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:59 PM
రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని, అయితే యూరియా విషయంలో వైసీపీ నీచ రాజకీయం చేస్తోందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
యూరియా విషయంలో వైసీపీ నీచ రాజకీయం
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ధ్వజం
బనగానపల్లె, సెప్టెంబరు 11( ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని, అయితే యూరియా విషయంలో వైసీపీ నీచ రాజకీయం చేస్తోందని రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యూరియా కేటాయింపులు, సరఫరాను సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 1.04 మెట్రిక్ టన్నులు వినియోగం యూరియా వినియోగం అయిందన్నారు. ధర తక్కువ కావడం, సాగు శాతం పెరగడంతో యూరియాకు డిమాండ్ ఏర్పడిందన్నారు. వచ్చే రబీ సీజన్‌లో దృష్టి పెట్టుకొని యూరియా సరఫరాకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలు చేపట్టినట్లు తెలిపారు. గత ఐదేళ్లలో తాడేపల్లి దాటిరాని మాజీ సీఎం జగన్ నేడు రైతుల కష్టాలు అంటూ సరికొత్త డ్రామాకు తెరతీస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉండగా కనీసం జగన్ రైతులకు సాగునీరందించే పంట కాలువల్లో పూడికలు తీయలేదని గుర్తుచేశారు. ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌లో 6.91 లక్షల మెట్రిక్ టన్నులు యూరియాను కేటాయించిందని, ఇప్పటి వరకు రైతులు 6.11 లోల మెట్రిక్ టన్నులు వినియోగించారని చెప్పారు. డీఏపీ వంటి ఇతర ఎరువుల కూడా గత ఏడాది కంటే 20శాతం అఽధికంగా కొనుగోలు చేశారన్నారు. మరో పది రోజుల్లో మరో 30 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందని చెప్పారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో రాయలసీమ జిలాల్లో తదితర ప్రాంతాల్లో 1.6లక్షల ఎకరాలు అదనంగా సాగు అయిందని చెప్పారు. పొగాకు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం రూ.200 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. నేపాల్ సంక్షోభం నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ తెలుగువారికి బాసటగా నిలిచి వారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకువచ్చారన్నారు. ఇది అందరికీ గర్వకారణమన్నారు.