Share News

మహిమాన్వితం కార్తీకమాసం

ABN , Publish Date - Oct 21 , 2025 | 11:22 PM

శివ,కేశవులకు అత్యంత ఇష్టమైనది కార్తీకమాసం. ప్రతిఏటా దీపావళి పండుగ వెళ్లిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది.

మహిమాన్వితం కార్తీకమాసం

శివకేశవులను ధ్యానించే మాసం

జిల్లా వ్యాప్తంగా ముస్తాబైన ఆలయాలు

నేటి నుంచి ప్రారంభం

నంద్యాల కల్చరల్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): శివ,కేశవులకు అత్యంత ఇష్టమైనది కార్తీకమాసం. ప్రతిఏటా దీపావళి పండుగ వెళ్లిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. నోములు, వ్రతాలకు ఈ మాసం ఎంతో ప్రధాన్యం. బుధవారం నుంచి కార్తీకమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆలయాలు ముస్తాబయ్యాయి. తెలుగు సంవత్సరంలో వచ్చే ఎనిమిదో మాసమే కార్తీకం. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలుస్తాడు కాబట్టే ఈ మాసాన్ని కార్తీకం అని అంటారు. శివకేశవులను భక్తిశ్రద్ధలతో కొలిచే ఈ మాసంలో చేసే పూజలు, నోములూ వ్రతాల వల్ల ఎన్నో శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే హైందవులు ఈ నెల మొత్తం నోములు, వ్రతాలు, జపం, ధ్యానం, పూజ, దానం, దీపారాధనతో భక్తిని చాటుకుంటారు. నెల రోజుల పాటు చేయలేని వారు కార్తీకంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, మాస శివరాత్రి, సోమవారాల్లో ఉపవాస దీక్షను నియమనిష్టలతో ఆచరిస్తుంటారు. ఆ రోజుల్లో ఉపవాసం ఉండి చీకటి పడిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసాన్ని విడుస్తారు.

దీపారాధనకు ప్రాధాన్యం: కార్తీక మాసంలో దీపారాధనకు మహిళలు అధిక ప్రాధాన్యమిస్తారు. పూజలు చేసిన మహిళలు ఉపవాసాలతో శివకేశవులను ధ్యానిస్తారు. ప్రధానంగా సోమవారం రోజున బ్రహ్మ ముహూర్తంలోనే లేచి చన్నీటి స్నానాలు చేసిన తర్వాత కార్తీక దీపాలను వెలిగిస్తే పుణ్యఫలం సిద్ధిస్తుందని మహిళలు భావిస్తారు. ఈ నెలలోనే అయ్యప్ప దీక్ష మొదలై సంక్రాంతి వరకూ కొనసాగుతుంది. కార్తీక మాసంలో గంగానది, నదులు, పుష్కరిణి, చెరువుల్లో దీపాలను పవిత్రంగా వదిలి మొక్కులు తీర్చుకుంటారు. ఇదే మాసంలో తులసి, ఉసిరి చెట్టుకూ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. కార్తీక వనభోజనాల పేరుతో ఉసిరి చెట్ల కింద సామూహిక భోజనాలు చేసి మానవ సంబంధాలు, కుటుంబ బంధాలను మెరుగుపర్చుకుంటారు.

మహానందిలో ‘ఆకాశ దీపం’

మహానంది, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో మంగళవా రం రాత్రి ఘనంగా కార్తీక మాసోత్సవాలను ఆలయ వేదపండితులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయాల్లో పూజ లు నిర్వహించిన అర్చకులు ధ్వజస్తంభం వద్దకు పూజా ద్రవ్యాలతో చేరుకున్నారు. కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా సకల దేవతలను మహా నంది క్షేత్రానికి ఆహ్వానిం చేందుకు వీలుగా ‘ఆకాశ దీపం’ వెలిగించారు. వచ్చే నెల 20వ తేదీ వరకు మహానందిలో కార్తీక మాస ఉత్సవాలు జరుగుతాయని ఆలయ అర్చకులు రవిశంకర్‌ అవధాని, నాగేశ్వరశర్మ వెల్లడించారు.

Updated Date - Oct 21 , 2025 | 11:22 PM