Share News

శ్రీగిరిపై పౌర్ణమి వెలుగులు

ABN , Publish Date - Nov 06 , 2025 | 12:01 AM

శ్రీగిరి మహాక్షేత్రంలో కార్తీక పౌర్ణమి శోభాయమానంగా కాంతులీనింది. తెల్లవారుజాము నుంచి భక్తులు నదిలో పుణ్యస్నానాలు చేసుకుని ఆలయ ప్రధానవీధిలో దీపాలు వెలిగించారు.

శ్రీగిరిపై పౌర్ణమి వెలుగులు

కార్తీక మాసం సందర్భంగా జ్వాలా తోరణం

శ్రీశైలం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): శ్రీగిరి మహాక్షేత్రంలో కార్తీక పౌర్ణమి శోభాయమానంగా కాంతులీనింది. తెల్లవారుజాము నుంచి భక్తులు నదిలో పుణ్యస్నానాలు చేసుకుని ఆలయ ప్రధానవీధిలో దీపాలు వెలిగించారు. స్వామి, అమ్మవార్ల ఉభయ దేవాలయా ల్లో గంట సమయంలోనే అలంకార దర్శనం చేసుకున్నారు. సుమారు 50వేలకుపైగా భక్తులు క్షేత్ర సందర్శనం చేశారని ఆలయ అధికారులు వెల్లడించారు. జ్వాలా తోరణం సజావుగా సాగేందుకు చేసిన కట్టుదిట్టమైన ఏర్పాట్లను ఈవో శ్రీనివాసరావుతో పాటు ఎస్పీ సునీల్‌ షెరాన్‌ పరిశీలించారు. ప్రధానంగా యాత్రికుల తిరుగు ప్రయాణాలు, ట్రాఫిక్‌ జాం వంటి సమస్యలు తలెత్తకుండా సిబ్బందికి సూచనలిచ్చారు. అదే విధంగా మాసోత్సవాల్లో దేవస్థానం చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లను కూడా పరిశీలించారు.

జ్వాలా తోరణానికి నూలు వత్తులు

శ్రీశైలంలో జ్వాలాతోరణానికి ఉపయోగించే నూలు వత్తులను బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ఆమోదగిరిపట్నానికి చెందిన వసుంధరరావు, రామకృష్ణారావు కుటుంబసభ్యులు సమర్పించారు. బుధవారం ఉదయం ఆలయం లోకి వచ్చి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్వాలాతోరణ దర్శనంతో దృష్టి దోష నివారణ జరుగుతుందని భక్తుల నమ్మకం.

మహానందిలో కార్తీక శోభ

దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

మహానంది, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): మహానందిలో కార్తీక పౌర్ణమి శోభా యమానంగా నిర్వహించారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి వేకువజాముననే భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయాల్లో జరిగే పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని రుద్రగుండం కోనేరుతోపాటు రెండో ప్రాకారంలోని కోనేర్లల్లో భక్తులు కుటుంబ సమేతంగా కార్తీక పుణ్యస్నానాలను ఆచరించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించారు. పరమ శివుడిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలో బారులు తీరారు.

Updated Date - Nov 06 , 2025 | 12:01 AM